ఢిల్లీ ధనాధన్‌

– రొసో,పృథ్వీ, వార్నర్‌ మెరుపుల్‌
– పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపు
ధర్మశాల :
పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. సీజన్‌ చివర్లో చిచ్చరపిడుగల్లె చెలరేగుతుంది. ఇటీవల రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై ఛేదనలో చెలరేగిన క్యాపిటల్స్‌.. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌పై పంజా విసిరింది. 214 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 198 పరుగులే చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో లియాం లివింగ్‌స్టోన్‌ (94, 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లు), అథర్వ (55 రిటైర్డ్‌ హర్ట్‌, 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా పంజాబ్‌ కింగ్స్‌కు పరాజయం తప్పలేదు. లివింగ్‌స్టోన్‌, అథర్వ మినహా పంజాబ్‌లో ఎవరూ రాణించలేదు. ధావన్‌ (0), జితేశ్‌ (0), షారుక్‌ (6), కరణ్‌ (11) విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీ రొసో ( 82 నాటౌట్‌, 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీకి తోడు ఓపెనర్లు పృథ్వీ షా (54, 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవిడ్‌ వార్నర్‌ (46, 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ శామ్‌ కరణ్‌ (2/36) రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (54), డెవిడ్‌ వార్నర్‌ (46) క్యాపిటల్స్‌కు తిరుగులేని ఆరంభాన్ని అందించారు. పృథ్వీ షా బౌండరీలతో విరుచుకపడగా.. వార్నర్‌ సావధానంగా రాణించాడు. పవర్‌ప్లేలో 61/0తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు 94 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఓపెనర్లు నిష్క్రమించినా.. రిలీ రొసో, ఫిల్‌ సాల్ట్‌ ఎదురుదాడి ఆపలేదు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో వీరవిహారం చేసిన రిలీ రొసో..25 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (24) సైతం రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో డెత్‌ ఓవర్లలో దంచి కొట్టాడు. టాప్‌-4 బ్యాటర్లు వచ్చీ రాగానే బౌండరీల మోత మోగించటంతో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు బేజారిపోయారు. ఫిల్‌ సాల్ట్‌, రొసోలు మూడో వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు.

Spread the love