తాగునీటి కోసం ఇబ్బందులు

– ప్రజల కష్టాలను పట్టించుకోని పాలకులు
– మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం ఏనే కాలనీ ప్రజలు మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈదులగూడెం ఏనే ప్రాంతంలో 350 కుటుంబలకుపైగా నివసిస్తున్నాయని, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందని, కనీసం నడవలేని పరిస్థితి ఉందని వాపోయారు. డ్రెయినేజీ లేక మురుగునీరంతా రోడ్డుపై చేరుతుందని, దాని ఫలితంగా దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని చెప్పారు. కాలనీలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు వేసి నల్లాలు బిగించారని, కానీ మంచినీరు ఇప్పటివరకు రాలేదని తెలిపారు. మంచినీరు లేక బోరు నీటితో దాహార్తి తీసుకుంటు న్నారని చెప్పారు. ఎంతోమంది నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారని వారికి రేషన్‌ కార్డులు, పింఛను కూడా అందడం లేదన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మంచి నీరందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ అధికారులు, పాలకులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిం చాలని, లేనిపక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు నిరువధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీష్‌చంద్ర, రవినాయక్‌, డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, రెమిడాల పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, భావండ్ల పాండు, కౌన్సిలర్‌ ఎంఏ గని, కాలనీవాసులు పాల్గొన్నారు.

Spread the love