నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

– రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ఇప్పటికే తొమ్మిది జిల్లాలలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్ డే రోజున మిగతా 24 జిల్లాలలోని అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 . 84 లక్షల మంది గర్భిణీలకు వీటిని అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగామని, మాతాశిశు మరణాలను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. ఇదే కోవలో గర్భిణీల్లో రక్తహీనతను నివారిస్తూ, పుట్టబోయే శిశువులు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రస్తుతం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమం కూడా మంచి ఫలితాలను అందిస్తుందనే నమ్మకం ఉందని మంత్రి ఆహ్శాభావం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి హరీష్ రావు జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు మంజూరు చేసినందున, వాటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన చోట నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. కాగా, కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 80 పని దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 3854000 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు. ఇందులో 2146000 మందికి రీడింగ్ అద్దాలు, 1708000 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశామని అన్నారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని మంత్రి హర్షం వెలిబుచ్చారు. ఇప్పటికే దాదాపు తొంభై శాతం స్క్రీనింగ్ పూర్తయినందున కంటి వెలుగు శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏ.ఎన్.ఎం లను వారివారి సాధారణ విధుల నిర్వహణ నిమిత్తం రిలీవ్ చేయాలని సూచించారు. మిగతా సిబ్బందితో కంటి వెలుగు శిబిరాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తూ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కాగా, వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు అందించాలని, పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు హితవు పలికారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని అందరికీ అందించేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ శ్వేత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Spread the love