‘ఆర్థిక వృద్ధిలో అనుమానాలెన్నో!?’

అంతులేని నిరుద్యోగం, అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి బాటలో… ఏమిటి ఆంతర్యం? ఆసక్తితో పరిశీలన చేద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందంటే ఆ దేశ శ్రామికశక్తి, వ్యవసాయరంగం నుంచి పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతూ, తలసరి ఆదాయం తద్వారా జీడీపీ వద్ధి చెందుతుంది. కానీ దీనికి విరుద్ధంగా భారతదేశంలో ప్రస్తుతం పారిశ్రామిక రంగాల నుంచి శ్రామికశక్తి, వ్యవసాయ రంగం వైపు పయనిస్తోంది. ”సియమ్‌ఐఈ మరియు సిఈడిఏ” నివేదికలు ప్రకారం 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో 5.2 కోట్ల నుంచి 2.7కోట్ల మంది తయారీ (పారిశ్రామిక) రంగాల నుంచి తగ్గారు’ అని తెలిపారు. అంటే దాదాపు 50శాతం తగ్గుదల సంభవించింది. టెక్స్‌టైల్స్‌, బిల్డింగ్‌ నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాల్లో ఉపాధి క్షీణత ఎక్కువగా ఉంటుంది. 2016-17 నుంచి 2021-22 మధ్య సంవత్సరాల్లో ఒక్క టెక్స్‌టైల్స్‌ రంగంలోనే 1.2కోట్లు శ్రామికులు నుంచి 55 లక్షలకు చేరింది. గమ్మతైన విషయం ఏమిటంటే, ” లేబర్‌ ఇంటెన్సివ్‌ సెక్టార్‌ నుంచి క్యాపిటల్‌ ఇంటెన్సివ్‌” వైపు భారత్‌ ఆర్థిక వ్యవస్థ పయనిస్తోంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. కేవలం నూతన మెషినరీ, టెక్నాలజీ ద్వారా వస్తు ఉత్పత్తి చేస్తూ, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతిలో బడా పారిశ్రామిక సంస్థలు ఉండుటచే, శ్రామిక జనాభాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోయినా, వృద్ధి బాటలో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. దీంతో శ్రామిక జనాభా వ్యవసాయ రంగంలోకి వెనుదిరిగారు. అజీజ్‌ ప్రేమ్‌జీ నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం ఆకాశాన్ని తాకుతుంది అని తెలిపారు.
2018 ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఐదవ తరగతి అర్హత కలిగిన 62టెలిఫోన్‌ మెసెంజర్‌ పోస్ట్టుకు 92వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసినవారు ఉన్నారు. అలాగే రేల్వే గ్యాంగ్‌ మెన్‌, పోర్టర్‌ వంటి 67,000 పోస్ట్లుకు 1.9కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని హౌటల్స్‌లో కేవలం 4వ తరగతి అర్హత కలిగిన వెయిటర్‌ వంటి పోస్ట్స్‌ కూడా వేల సంఖ్యలో డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అంటే నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో కనపడుతుంది. గత యూపీఏ ప్రభుత్వం నుంచి నేడు ఎన్‌డీఏ ప్రభుత్వం వరకూ దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది. మేక్‌ ఇన్‌ ఇండియా, పియల్‌ఐ స్కీం వంటి పథకాలు ఎన్ని వచ్చినా, దేశంలో శ్రామిక జనాభాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించుటలేదు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉచితాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. దేశ సగటు కంటే మూడు రెట్లు అధికంగా వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. ప్రతీ సంవత్సరం నూతనంగా 1.2కోట్ల మంది శ్రామిక జనాభాగా చేరుతున్నారు. వీరిలో కేవలం 55లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. 2022-23లో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు సుమారు 10మిలియన్ల మంది ఉండగా, కేవలం ఒక మిలియన్‌ వారు మాత్రమే ఉపాధి లభిస్తుంది.
ఇటువంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ నిర్మూలనకు కొన్ని చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విద్యావ్యవస్థలో ఒకేషనల్‌ కోర్సులు అభివృద్ధి పరచాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. పెద్ద పెట్టుబడి, మెషినరీ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే రంగాలకు ప్రాధాన్యత తగ్గించి, లేబర్‌ ఇంటెన్సివ్‌ సెక్టార్‌ లకు ప్రాధాన్యత పెంచాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నేటి విద్యా విధానం, సబ్జెక్టులు ప్రవేశపెట్టాలి. ఖాళీ పోస్టుల భర్తీ చేయాలి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నూతన టెక్నాలజీ అభివృద్ధి పరచాలి. ప్రభుత్వ విధానాలను సమీక్ష చేసుకుని, శ్రామిక శక్తి ద్వారా ఉత్పత్తి రంగాల్లో వస్తు ఉత్పత్తికి ప్రాధాన్యత పెంచాలి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో స్థాపించే పరిశ్రమలకు యువ జనాభాకు, శ్రామిక శక్తికి పెద్ద పీట వేయడం ద్వారా నిర్మాణాత్మక రీతిలో, శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. కేవలం సేవా రంగం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, అభివృద్ధి తాత్కాలికమే అని భావించాలి. ఇది గాలిబుడగ వంటిది. ప్రజల జీవి తాల్లో నిజమైన అభివృద్ధి వారి తలసరి ఆదాయం పెరగుటయే. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ద్రవ్యోల్బణం తగ్గాలి. ధరలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండగా కాకుండా, పేద మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే విధానాలకు అనుగుణంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టి, శాశ్వత ప్రాతిపదికన దేశం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. – ఐ.పి.రావు

 

Spread the love