మత విద్వేషాలపై ‘ఎద్దేళు కర్నాటక’ నిశ్శబ్ద విప్లవం!

224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి 2023 మే 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే13న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలు గెలిచి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు సంవత్సరాల పాటు అవినీతి, మతవిద్వేషాలతో పరిపాలన సాగించిన బీజేపీ 66 సీట్లకే పరిమితం కాగా, హంగ్‌ అసెంబ్లీ వస్తే చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్‌ చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా 19 సీట్లకే పరిమితమైంది. ఇంతటి పతనానికి కారణమైన బీజేపీని ఓడించేందుకు అక్కడ అనేక సామాజిక, స్వచ్ఛంద శక్తులు కలిసి పనిచేశాయి. ఇది దేశంలో చాలా ముఖ్యమైన పరిణామం. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ అడుగడుగునా అధికార దుర్వినియోగం చేసింది. పైగా విపరీతమైన మతవిద్వేష ప్రచారానికి తెరదీసింది. ఎన్నికలకు ఏడాది ముందునుంచే ఆ రాష్ట్రంలో హిజాబ్‌ ధరించటం, హలాల్‌ చేసిన మాంసం తినడం, లవ్‌ జిహాద్‌ వంటి విషj లపైన విద్వేషాలు రగిలించింది. పబ్బులు, వాలెంటైన్స్‌ డే రోజున ప్రేమికులపై దాడులు చేసింది. టిప్పుసుల్తాన్‌ చరిత్రను వక్రీకరించి ప్రచారం చేయటం, ముస్లిం రిజర్వేషన్‌ రద్దుచేసి వాటిని బీసీలకు మళ్లించే ప్రయత్నం చేయటం కొనసాగించింది. మహాత్మా గాంధీ పాఠం తీసేసి పాఠ్యపుస్తకాలలో సావర్కర్‌ పాఠం చేర్చడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అంతే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను అమలు చేస్తామని, ఎన్‌పీఆర్‌ (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌) తయారు చేస్తామనే వివాదాస్పద అంశాలు కూడా చేర్చింది. బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్‌ ”ఎన్నికల ముందు బీజేపీ నాయ కత్వం మతకలహాలను సృష్టించేందుకు కుట్రపన్నింది. హిందువులు, ముస్లింలు ఈ కుట్రను గ్రహించి మత సామరస్యంతో ప్రశాంతంగా ఉండాలి” అని హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఏమిటీ ‘మేలుకో కర్నాటక’?!
దేశంలో, కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలతో విసిగిపోయిన కొందరు మేధావులు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల ప్రజలు, అనేక స్వచ్చంద సంస్థలు చేతులు కలిపి ‘ఎద్దేళు కర్నాటక (మేలుకో కర్నాటక)’గా ఏర్పడి బీజేపీ మత విద్వేష చర్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తెలుస్తోంది. కర్నాటకలో బీజేపీ చేసిన మత రాజకీయాలు ఉన్నాయి. అనేకమంది ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులు, ఇతర హింద్వువాదులు కర్నాటకలో విద్వేష ఉపన్యాసాలతో ప్రజల మధ్య విభజనలు తీసుకరావడం, కొట్లాటలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఆకాశాన్నంటిన అవినీతి… తదితర చర్యలను వ్యతిరేకించిన ఐదువేలకు పైగా రాజకీయాలతో సంబంధంలేని వాలంటీర్లు, ప్రముఖ మేధావులు పురుషోత్తం బిలిమలే, తారారావు, డీయూ సరావతి, రహమత్‌ తరికెరె, దేవనూరు మహాదేవ, జి.ఎన్‌. దేవి, ఏఆర్‌ వాసవి తదితర అనేక మంది నాయకత్వంలో ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే మత రాజకీయాలను, బీజేపీని ఓడించడమే లక్యంగా ‘ఎద్దేళు కర్నాటక’ (మేలుకో కర్నాటక) అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరం ముందుగానే ‘ఈదినకర్నాటక.కామ్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ‘ఎద్దేళు కర్నాటక’లో 112 సంస్థలు, కర్నాటక రాజ్య రైతు సంఘం, రాష్ట్ర కార్మిక సంఘాలు, దళిత సంఘర్ష్‌ సమితి, ఓబీసీ ఫెడరేషన్‌, పలు ముస్లిం, క్రిస్టియన్‌ సంస్థలు కూడా ‘ఎద్దేళు కర్నాటక’తో చేతులు కలిపాయి. ఆరు నెలల పాటు ఈ ఐదువేల మంది కార్యకర్తలు 149నియోజక వర్గాల ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేశాయి. బీజేపీ మత విద్వేష విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాయి.
అక్కడ వాళ్లేం చేశారు?
అసలు అక్కడ వాళ్లేం చేశారనేది ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారు 250 వర్క్‌షాపులు నిర్వహించారు. జువసఱఅa.షశీఎ వెబ్‌సైట్‌ నిర్వహించిన మెగా సర్వే కోసం ఈ వాలంటీర్లు 41,000 కుటుంబాలను కలిశారు. 650పోస్టర్లు విడుదల చేశారు. 80వీడియోలు, 7ఆల్బమ్‌లు విడుదల చేశారు. 10లక్షల మతన్మోద వ్యతిరేక సాహిత్యం కాపీలు పంపిణీ చేశారు. 1.6లక్షల మంది ఓటర్లను కొత్తగా నమోదు చేయించారు. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. 100ప్రెస్‌ మీట్లు పెట్టారు. 4జాతాల ద్వారా కోటి మంది ప్రజలకు సందేశం ఇవ్వగలిగారు. 75సదస్సులు నిర్వహించారు. ఇందులో 2లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. రైతులు, కార్మికులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, ఆదివాసీలుతో 50ధర్నాలు నిర్వహించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఈ సంస్థ ప్రముఖులు ఢిల్లీ వెళ్ళి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ను, యూపీలో బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతిని కలిసి ఆయా పార్టీల అభ్యర్థులు నిలబడ కుండా కృషి చేశారు. 49మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒప్పించగలిగారు. దీనిపై ‘ఎద్దేలు కర్నాటక’ సంస్థలో ప్రముఖుడైన పురుషోత్తం బిలిమలె మాట్లాడుతూ, ‘దేశం, రాష్ట్రం రాజకీయంగా మునుపెన్నడూలేని విధంగా పతనమైంది. వాస్తవికత ఆధారంగా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలి. ఈ దోపిడీ, మతోన్మాద ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన అంశం. దుష్టపాలన సాగిస్తున్న పార్టీని ముందుగా ఓడించాలి. ఆ తర్వాత ప్రజల ప్రయోజనాల పునరుద్ధరణ కోసం గెలిచి అధికారంలోకి వచ్చిన వారితో పోరాటం కొనసాగించాలి – ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదొక్కటే మార్గం’ అన్నారాయన.
ప్రజల్లోకి తీసుకెళ్లిన మూడు సూత్రాలు
‘బీజేపీని తిరస్కరిస్తే సరిపోదు. మళ్లీ ఎమ్మెల్యేలను కొనేందుకు వీలు లేని విధంగా వారిని ఓడించడం మన బాధ్యత. ప్రజలకు తీరని కష్టాలు తెచ్చిపెట్టిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా మంది అంగీకరిస్తున్నారు. 1.ఓట్లు వృధా కాకూడదు 2.ఓట్లు చీలిపోకూడదు 3.బీజేపీని ఓడించగల అభ్యర్థికి ఓటు వేయాలి అనే మూడు సూత్రాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. దీని కారణంగానే జేడీఎస్‌ వైపు ఉన్న ముస్లింలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. అలాగే చిన్న పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు కూడా ఈ సారి ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.
‘ఎద్దేళు కర్నాటక’ సంస్థ తన ప్రచారంలో విజయవంతమైంది. అయినా బీజేపీ 36శాతం ఓట్లు పొంది తన పునాదులు కాపాడుకోవడంతో మతతత్వ ప్రమాదం తొలిగిపోలేదని గ్రహించాలి. కాగా ‘ఎద్దేళు కర్నాటక’ ఈ కృషిని దేశవ్యాప్తం చేయాలని భావిస్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రజలు ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేసుకొని బీజేపీని ఓడించి దేశంలో మతోన్మాద రాజకీయాలు లేకుండా చేయాలని సంస్థ ఆశిస్తోంది. వాస్తవానికి ‘ఎద్దేళు కర్నాటక’ మత విద్వేషాలపై ఒక నిశ్శబ్ద విప్లవం. అలాంటి సంస్థలకు మతసామరస్యతను కోరుకునే అందరూ సహకారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జి.వి.నాగమల్లేశ్వరరావు
9490300669

Spread the love