మద్యం మత్తులో కారు బీభత్సం

నవతెలంగాణ-మిర్యాలగూడరూరల్‌
పట్టణంలోని సాగర్‌ రోడ్డు వద్ద గల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం నారమ్మగూడెంకు చెందిన చక్రధర రాజు తన కుటుంబ సభ్యులతో పట్టణానికి షాపింగ్కు వచ్చి తన కారును రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి దుకాణంలోకి వెళ్లారు. తిరిగివచ్చి కారు ఎక్కే సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ వైపు నుంచి రాజీవ్‌ చౌక్‌ వెళ్లే టీఎస్‌ 10 యూబీ 2541 నెంబర్‌ గల తెల్లని కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి రోడ్డుపక్కనకు దూసుకొచ్చింది. చక్రధర రాజుకు చెందిన కారుతో పాటు బైక్ను ఢకొట్టడంతో రోడ్డు పక్కన నిలిపిన కారు దుకాణంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో సైకిల్‌ పై వస్తున్న గుడిమెట్ల రాజేశ్వరిని కారు ఢకొీట్టడంతో ఆమెకు తీవ్ర గాయం అయింది. దీంతో స్థానికులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా అతివేగంగా వచ్చి ఢకొట్టిన తెల్లని కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తుండగా కారులో తాగిన బీరు బాటిల్లు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన తరువాత యువకులు కారును అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకులను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. సాగర్‌ రోడ్డులో సీసీ కెమెరాలు పరిశీలిస్తే యువకుల ఆచూకీ తెలిసే అవకాశం ఉండగా నలుగురిలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ మేరకు టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love