బడ్జెట్‌ కేటాయించినా పైసా ఖర్చు చేయలే

న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రైల్వే భద్రత, రైలు ప్రమాదాల నివారణ వ్యవస్థ(కవచ్‌)పై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొన్నేండ్లుగా భద్రతా పనులపై రైల్వేల వ్యయం తగ్గుదల గురించి తీవ్ర చర్చకు దారి తీసింది. బాలాసోర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటన సౌత్‌ ఈస్ట్‌ జోనల్‌ రైల్వే(ఎస్‌ఈఆర్‌) కిందకు వస్తుంది. అయితే యాంటీ కొలిజన్‌ సిస్టమ్‌ (కవచ్‌) కోసం కేటాయించిన బడ్జెట్‌ నుంచి ఎస్‌ఈఆర్‌ ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది.
ఎస్‌ఈఆర్‌ కోసం మూలధన వ్యయం కింద రూ.468.90 కోట్లు ఆమోదించబడ్డాయి. ఇందులో లో ట్రాఫిక్‌ రైల్వే నెట్‌వర్క్‌ (1563 ఆర్‌కేఎం)పై స్వదేశీ కవచ్‌ (ఇది 2020-21లో పూర్తి చేయాల్సిన పని) కు సంబంధించిన పని ఉన్నది. కానీ ఇందుకోసం బడ్జెట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవటం గమనార్హం. అదే జోన్‌లోని మరో సెక్టార్‌లో (2020-21లో జరగాల్సిన పని) తక్కువ ట్రాఫిక్‌ ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లో దీర్ఘకాలిక అభివద్ధి వ్యవస్థ కోసం సుమారు రూ. 312 కోట్లు మంజూరు చేయబడ్డాయి. అయితే గతేడాది మార్చి వరకూ ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ కపోవటం గమనార్హం.
అలాగే సిగ్నిలింగ్‌ టెలీ కమ్యూనికేషన్‌ కింద సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే కోసం రూ. 162.29 కోట్లు ఆమోదించబడింది. ఈ డబ్బును అత్యధికంగా ట్రాఫిక్‌ ఉన్న రైల్వే మార్గంలో ఆటో మేటిక్‌ బ్లాక్‌ సిగలింగ్‌, సెంట్రలైజ్డ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, కవచ్‌ కోసం ఖర్చు చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ఖర్చూ చేయకపోవటం గమనార్హం.
ఈ ప్రాంతంలో భద్రతా పనులకు సంబంధించి ఇంత వరకు టెండర్లు తీసుకోనందున బడ్జెట్‌ను ఖర్చు చేయలేదని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. 2023-24కి సంబంధించిన ప్రభుత్వ బడ్జెట్‌ సమాచార విశ్లేషణ ప్రకారం.. ఇలాంటి నిష్క్రియ నిధుల స్థితితో కవచ్‌ను అమలు చేయటానికి చాలా సమయం పడుతుంది.
కవచ్‌ అమలుపై ప్రధానంగా దృష్టి సారించి నట్టు చెప్తున్నది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే జోన్‌ వంటి నెట్‌వర్క్‌లు రెండో, మూడో అధిక ప్రయాణీకుల రద్దీని కలిగి ఉన్న మార్గాలు.
రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్డీఎస్‌ఓ) భారతదేశంలో కవచ్‌ పరికరాలను అందించడానికి మేధా సర్వో డ్రైవ్స్‌, హెచ్‌బీఎల్‌, కెర్నెక్స్‌ అనే మూడు సంస్థలను ఆమోదించింది. దీనికి సంబంధించి మరో రెండు కంపెనీలు పనిచేస్తున్నాయని సమాచారం.

Spread the love