ప్రముఖ దర్శకుడు కె.వాసు ఇకలేరు

ప్రముఖ దర్శకుడు కె.వాసు (కొల్లి శ్రీనివాసరావు) (72) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సీనియర్‌ దర్శకుడు కె.ప్రత్యగాత్మ తనయుడే కె.వాసు. ఆయన బాబాయి హేమాంబరధరరావు కూడా దర్శకులే. కమ్యూనిస్టు భావజాలం ఉన్న కె. ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు వాసు జన్మించారు. వాసు మేనమామ చలసాని శ్రీనివాసరావు కూడా గొప్ప కమ్యూనిస్టువాది. ఆయన జ్ఞాపకార్థం ఈయనకు శ్రీనివాసరావు అని పేరు పెట్టారు.
బాబాయి దగ్గర దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్న వాసు తొలి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఆడపిల్లల తండ్రి’ (1974). ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో చిరంజీవిని వెండితెరకు పరిచయం చేశారు. ‘కోతల రాయుడు’, ‘ఆరని మంటలు’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘దేవుడు మావయ్య’, ‘పక్కింటి అమ్మాయి’, ‘కలహాల కాపురం’, ‘అల్లుళ్ళొస్తున్నారు’, ‘కొత్త దంపతులు’, ‘అయ్యప్పస్వామి మహత్యం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ వంటి తదితర చిత్రాలు విశేష ప్రేకాదరణ పొందాయి. కె.వాసు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అన్నయ్య చిరంజీవి వెండితెరపై కనిపించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ సినిమా దర్శకులుగా వాసుగారిని మరిచిపోలేం. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలనూ ఆయన తెరకెక్కించారు. ఆయన సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైంది. – పవన్‌కళ్యాణ్‌

Spread the love