కలుపు మొక్కల నివారణకు…

గార్డెనింగ్‌ అంటే చాలా మందికి ఇష్టం.
ఈ పెంపకంలో ఇబ్బంది పెట్టేవి కలుపు మొక్కలు.. మొక్కలు బాగా పెరగాలంటే వీటిని తీసేయాలి. వీటిని ఎప్పటికప్పుడు తీసెయ్యకపోతే అసలు మొక్కలు త్వరగా పెరగవు. ఆకుకూరల మడి, పూలమొక్కల పక్కన, కుండీల్లో, లాన్‌లో… కలుపు మొక్క కనపడని, పెరగని ప్రదేశం లేదు. మనం ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కల కంటే ఇవి చాలా త్వరగా పెరుగుతాయి. దాంతో.. మట్టిలోని న్యూట్రియెంట్స్‌, నీరూ, సూర్యరశ్మి… అన్నీ ఇవే లాగేసుకుంటాయి. వాటిని గుర్తించి తొలగించడం తప్పనిసరి.. అందుకు చేయాల్సిందేంటంటే…
మామూలు మొక్కలు, కలుపు మొక్కలకీ తేడా చెప్పడం చాలా కష్టం. ఇవి రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి. ఇవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకగలవు. మామూలు మొక్కల కంటే త్వరగా పెరుగుతాయి. విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కలుపు మొక్కలకి ముళ్ళూ, చిన్న రెక్కలూ వంటివి ఉంటాయి.
నష్టాలు..
నేల నుండి మామూలు మొక్కలకి కావాల్సినవన్నీ ఖనిజాలు కలుపు మొక్కలు ముందే అందుకుంటాయి. మామూలు మొక్కల్ని పెరగనివ్వకుండా ఇవి వాటికి అడ్డంగా పెరుగుతాయి. కొన్ని మొక్కల్ని తింటాయి కూడా. ఇవి రకరకాల కీటకాలకి ఆధారమౌతాయి. సరైన గాలి తగలకుండా అడ్డుకుంటాయి. మొక్కలకి నీటి సరఫరా సరిగ్గా సాగకుండా చేస్తాయి.
తీసేయడమెలా…?
రోజూ తోట అంతా తిరుగుతూ, జాగ్రత్తగా గమనిస్తూ కలుపు మొక్కల్ని చేత్తో తీసి పారేయడం మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కలుపు మొక్కలు పెరిగిపోతాయి. వీటి కోసం కొన్ని రకాల మందులు వాడొచ్చు. కానీ వాటిల్లో ఉండే కెమికల్స్‌ వల్ల మనం ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కలకి కూడా హాని కలుగుతుంది. భూసారం కూడా తగ్గుతుంది. వాటి బదులు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ద్రావణంతో కలుపు మొక్కల బెడదని తేలిగ్గా వదిలించుకోవచ్చు.
ద్రావణం తయారీ…
మూడు రకాలుగా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.
ఒక పెద్ద బకెట్‌లో ఒక గాలన్‌ వైట్‌ వెనిగర్‌ వేసి, అందులో రెండు టేబుల్‌ స్పూన్ల లిక్విడ్‌ డిష్‌ సోప్‌ కలపాలి. ఇందులో ఒక కప్పు ఎప్సమ్‌ సాల్ట్‌ కూడా కలపాలి. ఈ మూడింటిని బాగా కలిపి జాగ్రత్తగా గరాటుతో ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి.
ఒక పెద్ద బౌల్‌లో అర కప్పు రాళ్ళ ఉప్పు వేసి, కప్పు గోరువెచ్చని నీటిని పోయాలి. ఉప్పు కరిగే వరకూ కలిపి గరాటు ద్వారా స్ప్రే బాటిల్‌లోకి తీసుకుని ఉపయోగించవచ్చు.
ఒక స్ప్రే బాటిల్‌లో ఒక కప్పు నీటిని తీసుకోని అందులో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ల లిక్విడ్‌ డిష్‌ సోప్‌ కలపాలి. అందులోనే అర చెక్క నిమ్మ రసం పిండి, బాటిల్‌కి మూత పెట్టేసి బాగా కదిపితే లోపల ఉన్నవన్నీ బాగా కలుస్తాయి.
ఉపయోగించడమెలా..?
ఈ మిశ్రమాలను బాగా ఎండగా ఉన్న రోజుల్లోనే వాడాలి. మబ్బు పట్టి ఉన్నా, వాన వచ్చేట్లున్నా వాడకపోవడమే మంచిది. ఇవి చల్లాక కూడా కనీసం రెండు రోజుల పాటు వాన లేకుండా ఉంటే బాగా పనిచేస్తాయి. ఈ ద్రావణాన్ని కలుపు మొక్కల ఆకుల మీదా, కొమ్మల మీదా మాత్రమే పిచికారీ చేయాలి. మంచి మొక్కల మీద కానీ, మట్టి మీద కానీ ఈ ద్రావణం పడకూడదు. ఇది పిచికారీ చేసిన తర్వాత ఒక వారంలో మొత్తం కలుపు మొక్కలన్నీ పోతాయి. ఇంకా ఏవైనా ఒకటీ రెండూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయూలి. కలుపు మొక్క ఎండిపోయి వేరు కనబడుతుంటే వేరు మీద కూడా స్ప్రే చేయండి. లేదంటే అందులోంచి మళ్ళీ మొక్క వచ్చే అవకాశముంది. మిగిలిన ద్రావణాన్ని ఎండ తగలని చల్లని ప్రదేశంలో ఉంచి మళ్ళీ వాడుకోవచ్చు.

Spread the love