నిమ్స్‌లో బాలికకు, కుటుంబ సభ్యులకు పరామర్శ…తక్షణ సహాయంగా రూ.5 లక్షలు మంజూరు
నవతెలంగాణ – బంజారా హిల్స్
ఖమ్మం జిల్లాలో లైంగికదాడి యత్నానికి గురైన బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, బాధిత కుటుంబాన్ని శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, సీపీఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంత్రి పరామర్శించారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యుల బృందం నుంచి బాలిక ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మొదట బాలిక భవనంపై నుంచి కింద పడినట్టు సమాచారం అందిందని, అయితే, ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన దారుణం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. తాత వయసులో ఉన్న వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడటం బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్‌కు తరలించిందని తెలిపారు.
ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని, బాలిక పూర్తిగా కోలుకునే వరకు అన్ని వైద్య సేవలు కొనసాగిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా ఇప్పటికే రూ.70 వేల అత్యవసర సహాయం అందించినట్టు తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, కుటుంబానికి అండగా ఉండేందుకు ఖమ్మం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి విష్ణు వందనను నిమ్స్‌లోనే అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.“ఇలాంటి దుర్మార్గులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఎంతటి రాజకీయ అండ ఉన్నా నిందితుడిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో మానవ విలువలు కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఖమ్మం బాలికకు అండగా ప్రభుత్వం:మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



