గ్యారెంటీ…వారెంటీ

గ్యారెంటీ...వారెంటీఅనగనగా ఒక దేశం, అందులో ఎన్నికల నగారా మోగింది. ఇక చూడండి అందరూ బిజీ బిజీ ఐపోయారు. ఎవరు చూసినా ఇది నా గ్యారెంటీ, అది నా గ్యారెంటీ అంటున్నారు. ఆశపెడుతున్నారు, ఆశపడుతున్నారు. గ్యారెంటీల మీద గ్యారెంటీలు ప్రజల మీద పడిపోయి వాళ్ళు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసలు గ్యారెంటీ స్పెల్లింగు రానోళ్ళు కూడా గ్యారెంటీలిచ్చేస్తున్నారు ఇంతకూ వీళ్ళను ఎంతవరకు నమ్మాలి, వీళ్ళు ఎంత గ్యారెంటీ అని సామాన్యులు తమ ఆలోచనలతో గ్యారెంటీ లేని బతుకే అసలైన గ్యారెంటీ అనుకుంటున్నారు. ఇన్నేండ్లు పోయినా ఈ గ్యారెంటీ అనే పదాన్ని అలాగే మాట్లాడుతున్నాం కాని తెలుగులో సరైన పదాన్ని కనిపెట్టలేకపోయామా అన్న బాధ కలుగు తుంది. కానీ హామీ, పూచి అన్న పదాలున్నాయి. విషయానికొస్తే ఎవరూ ఇలా ఇది నా హామీ అనమని, ఇది నా పూచి అన మని ఎడ్వైజ్‌ చేసినట్టు లేరు, సారీ సలహా ఇచ్చినట్టు లేరు. అందుకే ఇంగ్లీషునే ఆశ్రయించారు నాయకులు. కష్టాలు మనుషులకు కాక మాన్లకొన్స్తాయా చెప్పండి. అందుకే అందరూ నిద్రలు, తిండి మానేసి అనడానికి వీలు లేదు కాని వాటిని ఎలాగో ఒక లాగ కానిస్తూ తిరుగుతా ఉన్నారు. తమ మిత్రులకు ఎప్పటికప్పుడు తిండి పెట్టబట్టే ఈ బట్ట కడుతున్నారు, ఆ తిండి తినగలుగుతున్నారని గిట్టని వాళ్ళు చెబుతుంటారు. అలా అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్లను పట్టించుకునే పనేలేదని తేల్చేశారు కూడా. ప్రజలూ బిజీనే అందుకే ఎవరు ఏమి చెబుతున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారని గమనించడం లేదేమో అనిపిస్తుంది. కాని వాళ్ళు గమనిస్తుంటారు, సమయమొచ్చినప్పుడు తీర్పునిస్తారు.
కొన్ని కంపెనీలు ఇది మా గ్యారెంటీ అంటారు. ఇంకొందరు మిక్సీ కొంటే మోటారుకు ఐదేళ్ళ వారెంటీ ఇస్తాం, ఇంకో భాగానికి ఇన్నేండ్లు వారెంటీ ఇస్తామని ప్రకటనల్లో, లేదా మనకిచ్చిన వారెంటీ కార్డుల్లో చూస్తాం.ఈ వారెంటీ, గ్యారెంటీ పదాలు రెండింటిలో ఏది నిజమైనది అని ప్రజలు అయోమయ స్థితిలోకి పోతున్నారు. ఒకోదానికి ఒకో అర్థం ఉందని తెలిసి గూగుల్లో, నిఘంటువుల్లో చూసే వాళ్లు కొందరు. ఇలా మొత్తం మీద ఏ వారెంటీ లేక, ఏ గ్యారెంటీ లేకుండా జీవితాలు తయారవుతాయి, కాస్త ఓపిక పట్టి ఎన్నికలైపోనిస్తే మీకే తెలుస్తుందని బుద్ధి జీవులు అనుకుంటున్నారు. అసలు ఈ తెలివి, బుద్ధికి కూడా గ్యారెంటీ కరువువైపోయింది, ఎలాగంటారా ఏ.ఐ అంటే కృత్రిమ తెలివిని పెంచి పోషిస్తున్నారు, దాన్ని ఈ ఎన్నికల్లో బాగా వాడుకుంటారు కూడా.
ఉద్యోగులు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయన్న హమీ లేక పెరిగే ధరల్ని, పెరిగే పన్నులను, ఎన్నికలప్పుడు మాత్రమే ధర తగ్గే అంటే తగ్గించే పెట్రోలు, గ్యాసులను చూసి ప్రజాస్వామ్యమే ఓ పెద్ద గ్యాస్‌ అంటూ, అనుకుంటూ ఉన్నారు. ఆదాయ పన్ను మాత్రం టంచనుగా కట్టాలి, కట్టేదేముంది దాన్ని పట్టుకునే ఇస్తారు జీతం. అలా నూటికి ఎనభయ్యో, డెబ్భయ్యో చేతికొస్తే కొనే ప్రతి వస్తువు మీద జీఎస్టీ పడి అందులో మరో పెద్దెనిమిది లేదంటే ఇరవై ఎనిమిది రూపాయలు కట్టాలి. అప్పుడు ఆదాయం సగానికి సగం పడిపోతుంది. అసలు ప్రయివేటువారిని అన్ని రంగాల్లోకి ఆహ్వానించినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగాలకే హామీ లేకుండా పోయేదే. అయితే ఉద్యోగ సంఘాలు, జాతీయ ట్రేడ్‌ యూనియన్లు, వామపక్షాలు గట్టిగా తమ నిరసనను తెలుపుతున్నందుకు ప్రభుత్వాలు అటు ఇటుగా, ముందుకు వెనక్కు అడుగులేస్తున్నాయి. తమకు సహకరించేవారెవరో ఇప్పుడు ఉద్యోగులకు తెలిసిపోయింది.
ఇక ప్రయివేటు ఉద్యోగాలు గాలిలో దీపాలు. ఏ సంస్థ ఎప్పటిదాకా ఉంటుందో, ఇంకో దాంట్లోకి కలిసిపోతుందో, ఉద్యోగుల్ని ఎప్పుడు పొమ్మంటారో తెలియని పరిస్థితి. గ్యారెంటీ లేదు. ఓ ఇరవై ఏండ్ల ముందర ఒక ప్రయివేటు కంపెనీ బీమా ఏజెంటు వచ్చి మా దగ్గర మంచి పాలసీలున్నాయి తీసుకొండి, సంవత్సరానికొకసారి ప్రీమియం కడితే చాలని చెప్పాడు. ఒకే ప్రశ్న వేశాను ”దీని రెన్యూవలుకి అంటే తరువాతి సంవత్సరం ప్రీమియం తీసుకోవడానికి నీవే వస్తావా, లేక ఇంకో కంపీనికి పోతావా” అంటే సమాధానం లేదు. హామీ లేదు, పూచి లేదు, గ్యారెంటీ లేదు. సరిగ్గా ఈ ఎన్నికల సమయాన ఈరోజు ఒక పార్టీ వెంట వచ్చిన నాయకులే మరుసటి రోజు ఇంకో ఏ పార్టీ కండువా కప్పుకొని వస్తారో తెలియని రోజులు. వాళ్లకు పార్టీలో ఉంచుతారో లేదో ఎలాంటి పూచి లేదు, పార్టీలకూ అంతే ఎవరెప్పుడు వస్తారో, పోతారో తెలియక తెగ ఇదైపోతారు.
ఈ గ్యారెంటీలు, వారెంటీలు, హామీలు, పూచీలు లేని జీవితాల మధ్య మొన్న టీవీ ఛానల్సు తిప్పుతుంటే ఒక పాత సినిమా వచ్చింది. దాంట్లో నువ్వు అన్యాయం చేశావంటే లేదు సగమే చేశానంటాడు ఓ విలన్‌. అంతే తన పని ఇంకా పూర్తి కాలేదని, చేయవలసింది ఇంకా ఉందని ఇంతలో పట్టేశారని దానర్థం. అందుకే కొందరు తాము ప్రజలకింకా చేయవలసింది మిగిలిందని, ఇంకా చాలా చేయాలన్న మాటలు వింటుంటే భయమేస్తోంది. ఇంతవరకు చేసింది చాలదా ఇంకా ఇంకా చేయడమంటే ఏమిటి మంచా లేక …? అన్నది ప్రజల అనుమానం. ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా మరి?
సెల్‌: 9849753298
జంధ్యాల రఘుబాబు

Spread the love