నిరంకుశ సర్కార్‌ చెరలో దేశం

A country in the grip of a tyrannical governmentదేశ చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడంతో నరేంద్రమోడీ ప్రభుత్వ నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది.ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ అధ్యక్షుడూ అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కోసం కేంద్రం పొంచి కూచున్నసంగతి అందరూ అనుకున్నంటు న్నదే. లిక్కర్‌ స్కాం అనే దర్యాప్తులో వరుసగా అనేక మందిని అరెస్టు చేయడం ఒక ఎత్తయితే ఎన్నికల ప్రకటన రాగానే రాజ్యాంగ పదవిలో వున్న అది కూడా దేశ రాజధాని ప్రాంతాన్ని పాలిస్తున్న కీలకనేతను వెంటబడి నిర్బంధించడం మరో ఎత్తు. రాజ్యాంగ విలువలకే ప్రమాదం. ఇది కేవలం కేజ్రీవాల్‌కో లేక ఆప్‌కో సంబంధించిన అంశమనుకుంటే తప్పు చేసినట్టే.ఈ మధ్యనే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను కూడా ఇలాగే అరెస్టు చేశారు. ఇదే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఇప్పటికీ ఏడాదిగా జైలులోనే వున్నారు. ఒకటికి రెండు సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రులకు కూడా చట్టబద్దంగా పోరాడే అవకాశం ఇవ్వకుండా ఏవేవో ఆరోపణలతో, సాంకేతిక సాకులతో ఖైదు చేయడం ఫెడరలిజం మీద దాడి తప్ప మరొకటి కాదు. సిబిఐ, ఈడిలను ఫెడరల్‌ ఏజన్సీలు(కేంద్ర సంస్థలు) అని సంబోధిస్తుంటారు. ఫెడరలిజంపై ఫెడరల్‌ సంస్థల దాడిలో తీవ్రమైన హెచ్చరిక దాగివుందని గమనించడం అవసరం. లిక్కర్‌ వ్యవహారంలో ఏం జరిగిందనేదానికీ కేజ్రీవాల్‌ అరెస్టుకూ ఏ సంబంధం లేదు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపే. ఎందుకంటే ఆప్‌ అధినేతగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ దీనికి బాధ్యత వహించవలసి వుంటుందని మాత్రమే తాజాగా సుప్రీం కోర్టుల్లో ఈడి అధికారులు చేస్తున్న వాదన కూడా. ఇందుకోసం వారు ఆప్‌ పార్టీని ఒక కంపెనీగా అభివర్ణించారు. మనీలాండరింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 4లో కంపెనీది బాధ్యత అన్నారు గనక ఆప్‌ నాయకుడుగా కేజ్రీవాల్‌ శిక్షార్హుడనేది వారి ఏకైక వాదన.దీనికి తోడు అప్రూవర్లుగా మార్చుకున్న వారు ఇచ్చిన సాక్ష్యాలంటూ కొన్ని చూపిస్తున్నారు.వాటి లోతుపాతులు అటుంచి అరెస్టు చేయకుండా విచారించే అవకాశం లేదా అనే ప్రశ్న తప్పక వస్తుంది.తొమ్మిదిసార్లు సమన్లు ఇచ్చినా రాలేదనే ఫిర్యాదు దీనికి జత చేస్తున్నారు. అదే నిజమైతే రాకపోవడంపైనే ఫిర్యాదు చేసి వుండాలి కదా. ఒకసారి వెళ్తే అరెస్టు అనివార్యమనే అంచనాతోనే ఆయన వెళ్లలేదనేది నిపుణుల అభిప్రాయం.చివరకు వచ్చేసరికి ఏకంగా అరెస్టు వారంటుతోనే ఇంటికి రావడం ఆయన సందేహాన్ని ధృవపరిచేదిగా వుంది.
చెప్పిందేంటి?చేసిందేంటి?
ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్టు. తనకు వరుసగా సమన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగినప్పుడు అనవసరంగా వెంటాడుతున్నారని కేజ్రీ తరపు లాయర్లు వాదించారు. అరెస్టు చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు కూడా. అయితే అక్కడ ఈడి తరపున వాదించిన అదనపు సోలిసిటర్‌ జనరల్‌ విఎస్‌ రాజు ఆ ఆ రోపణను ఖండించారు. తాము కేవలం విచారించి తెలుసుకోవడానికి పిలుస్తున్నాము తప్ప అరెస్టుచేసే ఉద్దేశం లేదన్నారు. కానీ అదే రోజు సాయంత్రం సమన్లతో పాటు అరెస్టు వారంటు కూడా తీసుకుని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఇది ఒక విధంగా కోర్టు ధిక్కారమే. కేంద్ర సంస్థల కపట ప్రవర్తనకు ఇదో నిదర్శనం కూడా. అక్కడకు వెళ్లినప్పుడు వారి వ్యవహార సరళి, అంతులేని భద్రతా ఏర్పాట్లు బీజేపీ నేతల మూకుమ్మడి దాడి చూసిన తర్వాత అన్నీ అరెస్టు కోసమేనని దేశమంతటికీ తెలిసిపోయింది. అదే జరిగింది. దానిపై ముఖ్యమంత్రి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది గాని ఉపశమనమివ్వలేదు. తర్వాత హైకోర్టు ఆయనను వారం రోజులు ఈడి రిమాండ్‌కు అనుమతినిచ్చింది. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత విషయంలోనూ పదిరోజుల వరకూ అరెస్టుచేసే ఉద్దేశం లేదని హామీ ఇచ్చిన ఈడి నిజంగానే ఆరు మాసాల పాటు ఆమెకు వ్యవధి ఇచ్చింది. ఇక్కడ అది కూడా లేకుండా ఎకాఎకిన నిర్బంధంలోకి తీసుకున్నారంటే ముందే జరిగిన నిర్ణయమనేది స్పష్టం.
మామూలుగా ఒక ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి.ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వుంటారు. నిజానికి గత ఎల్‌జిగా పనిచేసిన తనే స్వయంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై కేసు పెట్టాలని ఆదేశించడం ఒక విపరీతం. కనుక అనుమతి ప్రశ్న లేకుండా పోయింది. ఆ తర్వాత కాలంలో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు విచారణలు జరిగినా నిర్దిష్టంగా నిరూపితమైంది లేదు. అందులోనూ కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆధారాలేమీ లేవు. అసలు ఈ స్కామ్‌ అనబడేదాని ద్వారా వచ్చిందని చెబుతున్న మొత్తం రూ.వందకోట్లు, ఇతరత్రా కలిపి ఇది రెండు వందల కోట్లు చూపిస్తున్నారు. వందలో నలభై కోట్లు గోవాలో ఎన్నికల కోసం పంపించారని ఆరోపణ. తన కంచుకోట వంటి ఢిల్లీలో చోటు లేకుండా చేయడమే గాక నెమ్మదిగా గుజరాత్‌లోనూ, గోవాలోనూ కూడా సవాలు చేశారనేది ఆప్‌ పై బీజేపీ ప్రత్యేక కక్ష. దేశమంతా తాము పాలిస్తుంటే ఆ పాలన జరిగే చోటును మరెవరో పాలించడం మోడీ బృందం ఎన్నడూ భరించలేక పోయింది. మధ్యతరగతి మద్దతుతో పట్టణ ప్రధానమైన సంస్కరణలతో కొంత సమాంతర పాలన అందించిన ఆప్‌ దేశ రాజకీయ పటంలో ఒక స్థానం సంపాదించు కుంది. నిజానికి ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ పార్టీగా ఎదిగిన ప్రత్యేకత దానిదే. చాలా ప్రాంతీయ పార్టీలలో వలె ఒక నాయకుడి కుటుంబమే చక్రం తిప్పే సంస్కృతి ఆప్‌లో లేకపోవడం ఒక విశేషం.కేజ్రీవాల్‌ పాత్రనే ప్రధానంగా వున్నా పంజాబ్‌లో గెలిచిన తర్వాత అదీ కొంత మారింది. ఢిల్లీ ఓటర్లు కూడా శాసనసభకు ఆప్‌నూ లోక్‌సభకు బీజేపీని గెలిపిస్తూ మిశ్రమ చిత్రం సృష్టించారు. ఈ ద్వంద్వత్వం చాలాకాలం ఆప్‌పైనా ప్రభావం చూపింది. కేజ్రీవాల్‌ ఆంజనేయ దండకంతో సహా కొన్ని ప్రయోగాలు చేశారు.కానీ బీజేపీకి లోబడిపోతే భవిష్యత్తు వుండదనే వాస్తవం ఆయన గ్రహించగలిగారు. అందుకే తమపై దాడిని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించడానికి ఆయన దేశమంతా పర్యటించారు. ఇండియాతో సహా పలు ప్రతిపక్ష సమావేశాలకు హాజరైనారు. కేంద్ర నిరంకుశత్వంపై పోరాటంలో పాలు పంచుకున్నారు. ఇవన్నీ సహజంగానే మోడీకి మింగుడు పడలేదు.పైగా కేజ్రీవాల్‌ రాజకీయాలకు తన భక్తిని జోడించి గుళ్లు కూడా తిరగడం మరింత ఆందోళన కలిగించివుంటుంది. ఈ పూర్వరంగంలో లిక్కర్‌ ఆరోపణలు మోడీ సర్కారుకు చక్కగా అచ్చివచ్చాయి.
తొలినుంచీ కక్ష
వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతంగావుండి పరిమితమైన అధికారాలు గల రాష్ట్రంగా మార్చబడిన ఢిల్లీలో దీర్ఘకాలం బీజేపీ హవావుండేది. దేశంలో కాంగ్రెస్‌ దెబ్బతినిపోయినా అక్కడ మాత్రం షీలాదీక్షిత్‌ మూడు సార్లు ఎన్నికై సంచలనం సృష్టించారు.బీజేపీని దూరంగా వుంచారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమబృంద సభ్యుడుగా వుండి మార్పుకోసం ఆప్‌ స్థాపించిన కేజ్రీ ఈ నేపథ్యంలోనే రంగంలోకి వచ్చారు.తొలి ప్రయత్నంలోనే విభిన్న ప్రచారంతో ఎన్నికల్లో నెగ్గారు. అన్నాకు ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు.తన సూచనలను తోసిపుచ్చి ఆప్‌ ఏర్పడింది. తమాషా ఏమంటే కేంద్రంలో మోడీ, ఢిల్లీలో కేజ్రీ ఒకేసారి దేశం దృష్టికి వచ్చారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్‌ను ఓడిస్తూనే ఆప్‌ నిలదొక్కుకుంది. మొహల్లా క్లినిక్‌లు, పాఠశాలల విషయంలోనూ, మహిళల ఉచిత ప్రయాణం వంటి వాటిలోనూ కొత్త ఒరవడి పెట్టింది. సమస్యలు లేవని కాదు గాని సమాంతర లక్షణాలు కనపరిచింది.ఈ కాలమంతటా అక్కడే ఉన్న కేంద్ర పెద్దలు సహకరించక పోగా అడుగడుగునా గండాలు సృష్టించారు. పోలీసు అధికారాలతో సహా కేంద్రం గుప్పిట్లో వున్నందున ప్రతిదానికి పేచీలు పెట్టారు. బిల్లులపై సంతకాలు చేయకుండా ఎల్‌జి జంగ్‌ వేధించారు. చివరకు ఈ విషయంలో తమ రాజ్యాంగ హక్కుల కోసం సుప్రీంకోర్టులోనూ పోరాడిన కేజ్రీ ప్రభుత్వం విజయం సాధించింది. అంతకుముందు కాలంలో ఢిల్లీ సర్కారంటే నామమాత్రపు అధికారాలనే భావన వుండేది.కేజ్రీవాల్‌ అలాగాక మిగిలిన రాష్ట్రాలతో పాటు ప్రాధాన్యత సాధించారు. గుజరాత్‌లో మంచి ఓటింగ్‌, పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జాతీయ పార్టీగా మారడం బీజేపీ భరించలేని పరిస్థితిని సృష్టించింది. ప్రతి కాగితాన్నీ తప్పుపడుతూ ప్రతి చర్యనూ అడ్డుకుంటూ ముఖ్యమంత్రి పిఎ పైన, రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శిపైన కూడా దాడులు చేశారు. అసలు అధికార యంత్రాంగం మొత్తం ఎల్‌జి అదుపులోనే వుండాలని సుప్రీంకోర్టులో కేంద్రం వాదిస్తే న్యాయస్థానం తిరస్కరించింది. చివరకు ఈ లిక్కర్‌ స్కాం అనేదాన్ని పట్టుకున్నారు.ఇందులో ఇమిడివున్న మొత్తం ఏమంత పెద్దదేమీ కాదు గానీ రాజకీయ అస్త్రంగా అక్కరకు వచ్చింది. చివరకు కేజ్రీ అరెస్టు వరకూ తీసుకెళ్లారు.
ఇకనైనా ఎదిరిస్తారా?
గతంలో జయలలిత, లాలూయాదవ్‌, శిబుసొరేన్‌, మధుకోడా తదితరులు రకరకాల సందర్భాల్లో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన మాట నిజమే గానీ వారు పదవులకు రాజీనామా చేసి లేదా కోల్పోయి వెళ్లారు. ఇక్కడ అధికార హోదాలోనే వెళ్లడం ఇదే తొలిసారి.ఒక విధంగా ఇది దేశంలో ప్రస్తుత పరిస్థితికి ప్రతిబింబమే. ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వాలను వెంటాడి వేటాడుతున్న బీజేపీ కేంద్రం కక్షపూరితంగానే ఆయన్ను అరెస్టు చేసింది. ఇందుకు ముందు రోజే న్యూస్‌18 సమిట్‌లో మాట్లాడుతూ మోడీ కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోలేదని అంతకుముందు అనేవారనీ, తన హయాంలో చర్య తీసుకుంటే గోలచేస్తున్నారని అపహా స్యం చేశారు. నిజానికి ఆయన హయాంలో అవినీతి పేరిట అరెస్టు చేసిన వారిలో 95శాతం ప్రతిపక్షానికి చెందినవారే. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నదాడి అని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ సమయంలోనే ఎన్నికల బాండ్లద్వారా బీజేపీకి రూ.పదివేల కోట్లకు పైన వచ్చినట్టు అధికారికంగా వెల్లడైంది, అయినా తమ ఎంపీల సంఖ్యతో పోలిస్తే తక్కువే వచ్చిందని హోంమంత్రి అమిత్‌ షా బాహాటంగా వ్యాఖ్యానించారు. సరిగ్గా ఏ సంస్థలపైన ఈడి, సిబిఐ, ఐటి దాదులు జరిగాయో వాటినుంచే వందల,వేల కోట్లు బీజేపీకి ముట్టాయని ఇప్పుడు లెక్కలతో సహా తేలింది. ప్రధానికి సన్నిహితుడైన గౌతం అదానీ నిర్వాకాలపై అంతర్జాతీయ నివేదిక వస్తే విచారణ చేయకుండా మరింత వెసులుబాటు కల్పించారు.అమిత్‌ షా తనయుడైన జైషాపై అరోపణలు వస్తే ప్రచురించిన మీడియాపై చర్య తీసుకున్నారు. ఇలా ఎన్ని సంస్థల నోరునొక్కారో లెక్కలేదు. ఎన్నికల సంఘం కూడా వారి కనుసన్నల్లో పనిచేసే పద్ధతి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మాజీలకు పదవులిచ్చి,మరికొందరిని అదర గొట్టి న్యాయాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బేఖాతరు చేస్తూ కేంద్రీకృత పాలనకు బాట వేసుకుంటున్నారు. తమవైన మతతత్వ హిందూత్వ రాజకీయాలకు తోడు ఈ అప్రజాస్వామిక నిరంకుశ పోకడలు దేశానికి ముప్పుగా మారుతున్నాయి. బడా మీడియా వంతపాడుతున్నందున ఇందుకు సంబం ధించిన వివరాలు ప్రజలకు అందడం లేదు. అయినా అధికారం కోసం అనేక ప్రాంతీయ పాలక పార్టీలు వంతపాడుతున్న తీరుకు ఏపీ, తెలంగాణ రాజకీయాలే నిదర్శనం, టీడీపీ, జనసేన పూర్తిగా లొంగిపోగా వైసీపీ పరోక్షంగా వత్తాసునిస్తూనే వుంది. ఇదే కేసులో వైసీపి ఎంపీలకు సంబంధించినవారు, బీఆర్‌ఎస్‌ నన్నిహితులు అప్రూవర్లుగా లొంగిపోయి వారు చెప్పినట్టు వింటుంటే ఆ పార్టీలు మాత్రం వత్తాసునిస్తూనే వున్నాయి. 2024 ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత జరుగుతున్న ఇంత అఘాయిత్యాన్ని ఇండియా వేదిక ప్రతినిధులు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు కూడా. రాజకీయ సమాన అవకాశాలు లేకపోతే ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగే ప్రసక్తి వుండదు. వేలకోట్లు బాండ్ల సొమ్ము తీసుకున్న కేంద్రంలోని బీజేపీ కాంగ్రెస్‌ ఖాతాలు మాత్రం స్తంభింప చేయడం ఇలాంటి వైపరీత్యమే. కేజ్రీవాల్‌ అరెస్టు ఈ దిశలో మరో అప్రజాస్వామిక ఘట్టం, కేరళలోనూ ఇలాగే చేయబోయి భంగపడ్డారని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా అవకాశవాదం మాని ఈ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించి తేనే దేశానికి రక్ష. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమికి దేశవ్యాపితంగా తిరుగులేని పాఠం చెప్పాలి.
తెలకపల్లి రవి

Spread the love