ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్  నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తోపాటు సెర్ప్‌లో పనిచేస్తున్న మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి 106 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 129, 134 కింద సస్పెన్షన్‌ వేటు వేశారని, పిటిషనర్లకు ఈ సెక్షన్‌లు వర్తించవని తెలిపారు. పిటిషనర్లు రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించలేదన్నారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి వేతనాలు పొందడంలేదని, సెర్ప్‌ నుంచి రూ.5 వేలు గౌరవ వేతనం మాత్రమే పొందుతున్నారని చెప్పారు. అందువల్ల పిటిషనర్లను నియమించే లేదా తొలగించే అధికారం కలెక్టర్‌కు లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 26కు వాయిదా వేశారు.

Spread the love