దుబాయ్‌లో జలప్రళయం..ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

నవతెలంగాణ-హైదరాబాద్ : దుబాయ్‌లో ఆకస్మిక వానలు ఎంతటి ప్రళయం సృష్టించాయో తెలిసింది. 24 గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం యావత్ యూఏఈని సంద్రంగా మార్చేసింది. రహదారులన్నీ జలమయమై కార్లు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయాయి. గత 75 ఏళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయిలో వాన కురిసిందని దుబాయ్ ప్రభుత్వం చెప్పింది. దీన్నో చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. అయితే, వర్షం ఏం రేంజ్‌లో కురిసిందీ చెప్పే ఓ టైమ్ లాప్స్ వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం 30 సెకెన్ల నిడివి గల ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. యూఏఈపై మేఘాలు ఆవరించిన క్షణం నుంచి కుండపోత వర్షం వరకూ మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. తొలుత మేఘాలు మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరిస్తాయి. ఈ క్రమంలో చిరుజల్లుగా మొదలైన వాన ఆ తరువాత విశ్వరూపం దాలుస్తుంది. కుంభవృష్టి కురుస్తోంది. వీడియోలో ఇదంతా చూసిన జనాలు భయపడిపోతున్నారు. ప్రకృతి కన్నెర చేస్తే మానవాళి బ్రతుకు క్షణాల్లో తలకిందులవుతుందని కామెంట్ చేశారు. ప్రకృతి శక్తి ఎంతటిదో కళ్లకు కట్టినట్టు చూపించిందీ వీడియో అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇక అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం, ఈ ఆకస్మిక వర్షాలు యూఏఈతో పాటూ పొరుగున ఉన్న ఒమాన్ దేశాన్నీ అతలాకుతలం చేశాయి. ఒమాన్‌ సరిహద్దుకు సమీపంలోని దుబాయ్ నగరం అల్ అయిన్‌లో రికార్డు స్థాయిలో 10 అంగుళాల వర్షపాతం నమోదైంది.

Spread the love