అధికధరలు, నిరుద్యోగం, అవినీతిపై గుర్రుగా ప్రజలు

అధికధరలు, నిరుద్యోగం, అవినీతిపై గుర్రుగా ప్రజలు– అందుకే బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు
– మతోద్వేషం, రెచ్చగొట్టే మాటలతో లబ్దిపొందే యత్నం
– మోడీ, బీజేపీ నేతల ప్రసంగాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ పదేండ్ల పాలనలో దేశంలో పెరిగిన అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతిపై ప్రజలు గుర్రుగా ఉన్నారనీ సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి సర్వే తేల్చిచెప్పడంతో బీజేపీ మతోద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌. అరుణ్‌కుమార్‌ అన్నారు. అందుకే విద్వేష పూరిత ప్రసంగాల తీవ్రతను మోడీ, మిగతా బీజేపీ నేతలు పెంచారని విమర్శించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని స్థితిలో ఈసీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంస్థ చేపట్టిన సర్వేలో 62 శాతం మంది నిరుద్యోగ సమస్యనే ప్రధానంగా ఎత్తి చూపారన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వెబినార్‌ నిర్వహించారు. దీనికి సమన్వయ కర్తగా ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామనే హామీని మోడీ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 71 శాతం మంది ప్రజలు అధిక ధరలతో సతమతమవుతున్నామని చెప్పారన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే కీలక కారణమని ప్రజలు ఎత్తిచూపుతున్న అంశాన్నీ ప్రస్తావించారు. దేశంలో తాము అధికారంలో వస్తే అవినీతి లేకుండా చేస్తామని 2014లో మోడీ చెప్పిన మాటల్ని ఎత్తిచూపారు. దేశంలో పదేండ్ల కాలంలో అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిందని 55 శాతం ప్రజలు నొక్కి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకం ద్వారా బీజేపీ లాభపడిందనీ, తమ లాభాల కంటే 300, 400 శాతం అధికంగా కంపెనీలు నిధులను ఎలా ఇచ్చాయనేది నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నదని అన్నారు. దీనికి ఈడీ, సీబీఐ, ఐటీలను మోడీ సర్కారు ప్రధాన అస్త్రాలుగా మార్చుకున్నదనే విమర్శలూ వస్తున్నాయన్నారు. ఈ మూడు అంశాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోడీ, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో మాదిరిగానే ఎన్నికల కన్సల్టెన్సీ, కార్పొరేట్‌ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. పైమూడు విషయాల పైనా, అభివృద్ధిపైనా ఎన్నికలకు వెళ్తే గెలవలేమనే స్పష్టత బీజేపీకి వచ్చిందన్నారు. అందుకే. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బకొట్టేలా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే సున్నిత అంశాలపై బీజేపీ నేతలు ఫోకస్‌ పెట్టారన్నారు. ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో ఒక్కో విడతకు ఒక్కో అంశాన్ని ఎత్తుకుని బీజేపీ ముందుకెళ్తున్నదని చెప్పారు. తొలివిడతలో తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కచ్చదీవులను ప్రధాన ఎజెండాగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఉత్తరభారతంలో ఎన్నికలు ప్రారంభమయ్యాయనీ, దానికి తగ్గట్టు ప్రచారాన్ని మార్చుకున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణం, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, హిందూ మతాన్ని ద్వేషించే పార్టీలు, రాముడిని ద్వేషించే పార్టీలు అంటూ మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్న తీరును వివరించారు. బీజేపీ నేతలు తెలివిగా ఎక్కడ కూడా ప్రజల సమస్యలు, బాధల గురించి ప్రస్తావన రాకుండా ముందుకెళ్తున్నారన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు, ఆర్‌పీ యాక్టు దుర్వినియోగంపై సీపీఐ(ఎం) ఫిర్యాదు చేసినా, 200 మందికిపైగా మేధావులు, సామాజికవేత్తలు ఈసీకి లేఖ రాసినా ఈసీ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రసంగాలపై సీపీఐ(ఎం) తరఫున ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ప్రయత్నిస్తే పోలీసులు కూడా తిరస్కరించడం దుర్మార్గమన్నారు. దీనిపై పోలీసు కమిషనర్‌కు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారని చెప్పారు. మోడీ అనుయాయులతో ఈసీ నిండిపోయిందనీ, అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వ్యాపార సంబంధాల విషయంలో వ్యాపారిపై కొంత మంది వ్యక్తులు దాడి చేసినా దాన్ని హనుమాన్‌ చాలీసా చదువుతుంటే దాడి చేశారని బీజేపీ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ప్రచారంలో అసత్యాలు చెప్పొద్దనీ, మతాన్ని ఉపయోగించుకోవద్దని స్పష్టంగా ఉన్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ 400 సీట్ల నినాదం వెనుక రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. బీజేపీకి దళితులు, గిరిజనులు, బీసీలు దూరమవుతున్నారనే గుర్తించి హిందూవులను రెచ్చగొట్టేలా ముస్లింల నుంచి మనకు ప్రమాదం రాబోతున్నదనే ప్రచారాన్ని మోడీ మొదలుపెట్టారని విమర్శించారు. బీజేపీ అసలు నైజాన్నీ, ఈసీ తీరును ప్రజల ముందు ఎండగట్టాలనీ, ప్రజల్ని చైతన్యపరిచి వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Spread the love