కవిత బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

Judgment reserved on Kavita's bail– మే 7కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం ప్రణాళికాబద్ధంగా జరిగిందని ఈడీ ఆరోపించింది. కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఆధారాలను ధ్వంసం చేయడమే కాకుండా, అప్రూవర్లను బెదిరించారని పేర్కొంది. అందువల్ల ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని రౌస్‌ అవెన్యూ కోర్టును కోరింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మూడో రోజు బుధవారం ఈడీ తరుపున జోహెబ్‌ హుస్సేన్‌ దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో క్విడ్‌ ప్రోకో జరిగిందని ఈడీ ఆరోపించింది. ముడుపులు తీసుకొని పాత పాలసీలో 5 శాతంగా ఉన్న కమీషన్‌ను 12 శాతానికి పెంచారని వివరించింది. ఈ స్కాం ద్వారా హౌల్‌సెల్‌ వ్యాపారంలో దాదాపు రూ. 338 కోట్ల అక్రమ లాభాలు గడించగా, లిక్కర్‌ వ్యాపారంలో మేజర్‌ హౌల్‌సెల్లర్‌గా ఉన్న ఇండో స్పిరిట్స్‌ కంపెనీ రూ.192 కోట్లు లాభం పొందిందన్నారు. ఈ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉన్నారని, ఆమె తరపు అరుణ్‌ రామచంద్ర పిళ్లై ప్రాక్సీగా వ్యవహరించినట్లు నివేదించారు. లిక్కర్‌ స్కాంతో ప్రజలకు, ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. ఆప్‌ నేతలు విజరు నాయర్‌, మనీష్‌ సిసోడియా ద్వారా కవిత అనుచరులు బుచ్చిబాబు, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. విజరు నాయర్‌ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేసులో ఈడీ వాదనలతో ఏకీభవించిన ట్రయల్‌ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు… ఇప్పటికే మనీష్‌ సిసోడియా, విజరు నాయర్‌, ఇతర సహ నిందితుల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించినట్లు వివరించారు.
బుచ్చిబాబు లైజేనింగ్‌ చేశారు
సౌత్‌ గ్రూప్‌లో కవిత తరపున ఆమె మాజీ సీఎ గోరంట్ల బుచ్చిబాబు లిక్కర్‌ వ్యాపారాన్ని లైజేనింగ్‌ చేశారని హుస్సేన్‌ ఆరోపించారు. కవితకు 33 శాతం వాటాకోసం బుచ్చిబాబు పనిచేసినట్లు తెలిపారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్‌ చాట్స్‌లో సాక్ష్యాధారాలు దొరినట్లు వెల్లడించారు. అనంతరం అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ సాక్ష్యాలను ధ్రువీకరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో కవిత లబ్దిపొందారని స్టేట్మెంట్‌ ఇచ్చారన్నారు. రాఘవ తన సిబ్బంది గోపీకుమార్‌తో రెండు విడతలుగా రూ.25 కోట్లను బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లికి ఇచ్చినట్లు అందులో పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే లిక్కర్‌ వ్యాపారంలో భాగం కావాలని శరత్‌ చంద్రారెడ్డిని అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై సంప్రదించారన్నారు. పిళ్లై సలహాతో శరత్‌ చంద్రారెడ్డి హైదరాబాద్‌లో కవితను కలిసినట్లు తెలిపారు. లిక్కర్‌ స్కాంలో అనుకూల మార్పుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాలని కేజ్రీవాల్‌ అడిగినట్లుగా శరత్‌ చంద్రారెడ్డికి కవిత వివరించారని వాదించారు. రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు శరత్‌ చంద్రారెడ్డి ముందుకు వచ్చారని ఆధారాలను చూపారు.
ఆ విషయం మాకు అనవసరం
ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చారనేది ఈ కేసులో అనవసరమని ఈడీ స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని హుస్సేన్‌ వాదించారు. అప్రూవర్లను ప్రలోభపెట్టారని అనుమానించడం అంటే, కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడమే అన్నారు. కవితకు నోటీసులు ఇచ్చాకే అరుణ్‌ పిళ్ళై తాను ఇచ్చిన స్టేట్మెంట్స్‌ వెనక్కి తీసుకున్నారని నొక్కి చెప్పారు. కవిత ఒత్తిడితోనే అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై వెనుకడుగు వేశారని ఆరోపించారు. అంతేకాక కవిత, కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా మధ్య అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్‌ ఇచ్చారు. విజరు నాయర్‌తో కలిసి లిక్కర్‌ పాలసీ తయారు చేశారు. డ్రాఫ్ట్‌ లిక్కర్‌ పాలసీ వీళ్ళ దగ్గరకు వచ్చిందన్నారు. ఈ కాపీని విజరు నాయర్‌ బుచ్చిబాబుకి పంపించారని, ఫైనల్‌గా కవిత చెప్పిన అంశాలే లిక్కర్‌ స్కాంలో పొందుపరిచారని వివరించారు. అలా సౌత్‌ గ్రూప్‌ ద్వారా ఇండో స్పిరిట్‌లో అరుణ్‌ పిళ్ళై ద్వారా కవిత లిక్కర్‌ వ్యాపారంలో భాగమయ్యారని ఆరోపించారు.
కవిత మేనల్లుడిని ఉద్యోగిగా పెట్టారు
కవిత తన మేనల్లుడు మేకా శ్రీ శరన్‌ను ఇండో స్పిరిట్‌లో ఉద్యోగిగా పెట్టారని ఈడీ ఆరోపించింది. ఒక్కరోజు ఉద్యోగానికి హాజరుకాకపోయిన నెలకు రూ.లక్ష జీతం చెల్లించినట్లు తెలిపింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆయనను విచారణకు పిలిస్తే… 7,8 రోజుల పాటు హాజరు కాలేదని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరబిందో కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి అమాయకుడు కాదని, ఈ వ్యాపారంలో ఆయన ప్రధాన లబ్దిదారుడని ఈడీ పేర్కొంది. ఈ స్కాంలో రూపకల్పనతో ఆయన ఐదు రిటైల్‌ జోన్లు పొందారని తెలిపింది. మధ్యలో కవిత తరపు న్యాయవాది రాణా జోక్యం చేసుకొని బుచ్చిబాబు లైజేనింగ్‌ చేస్తే, ఆయనను ఎందుకు ఈడీ అరెస్ట్‌ చేయలేదని వాదించారు. దీనికి బదులిస్తూ… బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిందని ఈడీ తరపు హుస్సేన్‌ వివరించారు. జ్యుడీషియల్‌ కస్టడీలోనే బుచ్చిబాబును జైలు సూపరింటెండెంట్‌ సమక్షంలో విచారించి స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేసినట్లు తెలిపారు.
అప్రూవర్లను బెదిరిస్తున్నారు
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సహా నిందితులను తమ వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలని కవిత బెదిరిస్తున్నారని ఈడీ ఆరోపించింది. సాక్ష్యాలను ధ్వంసం చేశారు, సాక్ష్యులను బెదిరించారని ఆరోపిస్తూ… తన సుదీర్ఘ వాదనలను ముగించింది. అయితే కవిత తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. దాదాపు మూడు రోజులుగా ఈడీ వాదనలు కొనసాగించడంపై అభ్యంతరం తెలిపారు. తాము తన వాదనలను లిఖితపూర్వకంగా రిజాయిండర్‌ రూపంలో కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. దీంతో ఇరువైపు వాదనలు ముగిస్తున్నట్లు స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా వెల్లడించారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును మే 6కు రిజర్వ్‌ చేశారు.
విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అప్రూవర్‌ గా మారిన కవిత మాజీ సిఎ గోరంట్ల బుచ్చిబాబు ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిపై తర్వలో న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించనుంది.

Spread the love