అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు

– 18మంది అరెస్ట్‌ : సీపీ రంగనాధ్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లాలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడుతూ గర్భస్రావాలు చేస్తున్న 18మందిని హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాధ్‌ తెలిపారు. వారి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్‌ఫోన్లు, రూ.73 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై సీపీ వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో వేముల ప్రవీణ్‌, వేముల సంధ్యారాణి, డాక్టర్‌ బాల్నె పార్ధు, డాక్టర్‌ మోరం అరవింద, డాక్టర్‌ మోరం శ్రీనివాస్‌ మూర్తి, డాక్టర్‌ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్‌రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్‌, డి. ప్రణరుబాబు, కీర్తి మోహన్‌, బాల్నె ఆశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్‌, చెంగెల్లి జగన్‌, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్‌ ఉన్నారు.
ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్‌కు గతంలో స్కానింగ్‌ కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో దాని ద్వారా సులభంగా డబ్బులు సంపాదించాలనుకొని తన భార్య సంధ్యారాణితో కలిసి గోపాల్‌పూర్‌ వెంకటేశ్వర కాలనీలో కొద్ది మంది సిబ్బందితో పోర్టబుల్‌ స్కానర్ల సహాయంతో స్కానింగ్‌ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ స్కానింగ్‌ కేంద్రానికి ఆర్‌ఎంపీ లు, పీఆర్‌ఓలు, ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌, సిబ్బంది, డాక్టర్‌లతో కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేసుకొని వారి సాయంతో గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను లింగనిర్ధారణ పరీక్షల కోసం నగరానికి తీసుకొచ్చేవారు. లింగనిర్ధారణకు వచ్చే మహిళలకు పరీక్షలు చేసి పుట్టబోయేది ఆడబిడ్డ అయితే గర్భస్రావం కోసం ఈ ముఠాకు చెందిన ఆస్పత్రులు.. హన్మకొండలో లోటస్‌, గాయత్రి ఆస్పత్రులు, నెక్కొండలోని ఉపేందర్‌ (పార్ధు ఆస్పత్రి), నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సంబంధింత డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి పంపించేవారు. ఇందుకోసం ఒక్కొక్క గర్భస్రావానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు డబ్బులు వసూలు చేసి వాటిని ఆ ముఠా సభ్యులు కమిషన్ల రూపంలో పంచుకునే వారు. ఇప్పటి వరకు ఈ ముఠా 200కుపైగా గర్భస్రావాలు చేశారు. అక్రమం గా లింగానిర్ధారణ పరీక్షలు చేస్తున్నందుకు గతంలో నూ ప్రవీణ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రె డ్డి, ఇన్‌స్పెక్టర్లు సుజాత, శ్రీనివాసరావు, జనార్ధన్‌రెడ్డి, వినరుకుమార్‌, ఎస్‌ఐలు ఫసీయుద్దీన్‌, మల్లేశం, శరత్‌కుమార్‌, భాగ్యలక్ష్మీ, ఏఏఓ సాల్మన్‌, ఏహెచ్‌టీ యూ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్‌ సమీయుద్దీన్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, సైబర్‌ క్రైం సిబ్బంది, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, చైల్డ్‌ కోఆర్డినేటర్లు కృష్ణమూర్తి, కృతిను పోలీసు కమిషనర్‌ అభినందించారు.

Spread the love