త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి

– వచ్చే ఎన్నికల్లో బాధితులందరూ నామినేషన్‌ వేయాలి :ప్రజా గాయకులు గద్దర్‌
– కలెక్టరేట్‌ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని, ఒకవేళ మార్చకుంటే ఎకరం భూమికి, మూడెకరాల భూమి ఇవ్వాలని ప్రజాగాయకులు గద్దర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని కోరుతూ భూనిర్వాసితులు సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి గద్దర్‌ మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి నుంచి భూ సమస్య పైనే పోరాటాలు జరిగాయని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా భూమికోసం, భుక్తి కోసం జరిగిందని చెప్పారు. మహాభారత యుద్ధం సైతం భూమి కోసమే జరిగిందని గుర్తు చేశారు. ‘మా భూమి మాకు కావాలి’ అనే నినాదంతో ఓట్ల విప్లవం రావాలని, ఓటు ఆయుధం కావాలని అన్నారు. రాష్ట్రంలో ధరణి పేరుతో భూములను అమ్ముకుంటున్నారన్నారు. అలైన్‌మెంట్‌ మార్చకుంటే వచ్చే ఎన్నికల్లో బాధితులందరూ నామినేషన్‌ వేయాలని సూచించారు.త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు అండగా సీపీఐ(ఎం), రైతు సంఘం ఉంటుందని తెలిపారు. త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నాక ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. అలైన్‌మెంట్‌ కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పారు. ధర్నాకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడారు. త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే కోసం మార్పులు చేశారని ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మెన్‌ ఎనబోయిన ఆంజనేయులు కల్పించుకొని అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇదే సందర్భంలో బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యల మాటల యుద్ధం ముదిరింది. కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీపీసీసీ బీర్ల ఐలయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు తంగేళ్లపల్లి రవికుమార్‌, పల్లెర్ల యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ కాశపాక మహేష్‌, వైఎస్‌ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షులు ఎండి.అవతార్‌, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, కౌన్సిలర్‌ నాయిని పూర్ణచందర్‌, కిరణ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు బీస్కుంట్ల సత్యనారాయణ, రఘుబాబు పాల్గొన్నారు.

Spread the love