ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఎన్‌ఈపీ

– టీపీటీఎఫ్‌ అధ్యక్షులు అశోక్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)ను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు వై అశోక్‌ కుమార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి లక్ష్మయ్య భవన్‌ ఎదుట ఆ సంఘం పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్‌ కుమార్‌ ఆ సంఘం జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. విద్యారంగానికి సరిపడా బడ్జెట్‌ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో ఉన్న ఖాళీలను నింపకుండా ఏండ్ల తరబడి తాత్సారం చేస్తున్నాయని అన్నారు. దీంతో సర్కారు బడులలో విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నష్టపోతున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన ఎన్‌ఈపీ పేదలకు విద్యను దూరం చేసేదిగా ఉందని విమర్శించారు. అది విద్యా ప్రయివేటీకరణను బలోపేతం చేసేదిగా ఉందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసిందని, విద్యను ఉమ్మడి జాబితా నుంచి తొలగించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే నడిపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్రతను, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఉన్న ఎన్‌ఈపీని తెలంగాణలో అమలు చేయొద్దని ఆయన డిమాండ్‌ చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ విద్యావిధానాన్ని మ్యానిపెస్టోలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు ఎం ప్రకాష్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ భాస్కర్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సుధాకర్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి, రాష్ట్ర కౌన్సిలర్‌ రామానందయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love