ఆధిపత్యంపై సూపుడు వేలు ”జమిడిక”

జమిడిక ప్రత్యేకించి ఒక వాద్య
విశేషం. ముఖ్యంగా అమ్మవారి
జాతర్లలో, గ్రామదేవతల బోనాల
పండుగల్లో ఈ వాద్యగాళ్లు
మైమరచి పోయి, గానం చేస్తూ
అమ్మవార్ని ఆవాహన చేస్తారు.
ఈ వాద్యం రాయలసీమలోని
జాతర్ల లోనూ కన్పిస్తుంది. ఈ
జమిడికనే పుస్తకం శీర్షిక గా
ఎంచుకున్నాడు కవి.
కవి ఐన వాడు ముందుగా మంచి మనిషై ఉండాలి. తనదైన వ్యక్తిత్వ విలువలతో సామాజిక చలనాలకు, సంఘర్షణలకు స్పందించే గుణం కలిగి ఉండాలి. తాను ఏ కాలం జీవిస్తున్నాడో ఆ కాలిక స్పహ కలిగి ఉండాలి. మంచి మనిషిగా, మానవీయ భావజాలంతో ఇటీవల నన్ను ఆకర్షించిన కవి కందుకూరి అంజయ్య.

మా పరిచయం అనుకోని విధంగా, ఆశ్చర్యంగా విజయవాడలో జరిగింది. ఈ మేడే రోజు నేను విజయవాడలో సాహితీ మిత్రులు నిర్వహించిన కవితా -2022 ఆవిష్కరణ సభకు నేను అతిథిగా వెళ్ళాను. ఈ సభకు ఉభయ రాష్ట్రాల ప్రముఖ తెలుగు కవులు వచ్చారు. అలా కరీంనగర్‌ నుంచి గాజోజు నాగభూషణం, విలాసాగరం రవీందర్‌, తప్పెట ఓబయ్య, కందుకూరి అంజయ్య వచ్చారు. వీరందరూ నాకు పరిచయం ఉన్న కవులే.
శ్రీరామ్‌ కందుకూరి అంజయ్యను నాకు పరిచయం చేశాడు. ఆ క్షణంలోనే తన మాటలతో, మంచితనంతో నన్ను ఆకట్టుకున్నాడు. కవిత్వం మనుషుల్ని కలపడమే కాదు. మనసుల్ని మరింత దగ్గరగా జేస్తుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి తొమ్మిది ఏండ్లు గడిచి పోయాయి. కుటిల రాజకీయాల మూలంగా ప్రాంతీయ భేషజాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి కొనసాగడమే రాజకీయ మనుగడ అని మనం భావించవచ్చు.
జమిడిక ప్రత్యేకించి ఒక వాద్య విశేషం. ముఖ్యంగా అమ్మవారి జాతర్లలో, గ్రామదేవతల బోనాల పండుగల్లో ఈ వాద్యగాళ్లు మైమరచి పోయి, గానం చేస్తూ అమ్మవార్ని ఆవాహన చేస్తారు. ఈ వాద్యం రాయలసీమలోని జాతర్ల లోనూ కన్పిస్తుంది. ఈ జమిడికనే పుస్తకం శీర్షిక గా ఎంచుకున్నాడు కవి. అంజయ్య తన మొదటి కవితా సంపుటి కట్టె పల్క (2013) తర్వాత పదేళ్ల విరామంతో ఈ జమిడిక వచ్చింది.
అది నేను చదవలేదు గానీ ఈ సంపుటిలోని కవిత్వం మాత్రం వస్తువులో, అభివ్యక్తిలో, విస్పష్ట భావ ప్రకటనలతో పాఠకుణ్ణి ఆలోచింపజేస్తుంది. తెలుగు వారికందరికీ ఇష్టమైన పండుగ ఉగాదితో నిష్టూరంగా పల్కుతాడు
ఉగాదీ !
నీకు నాకు ఎంత దూరం
నీకు నాకు అందనంత దూరం
మా వాడకురా
మా గుండె గూటికి రా
మాకు నీడగా రా
మాకు తోడుగా రా..
(పుట 10)
గడీలల్లో తిరగబడ్డ నాగళ్ళను గురించి రాస్తాడు. ఈ దేశంలో మనుషులు పుట్టలేదు, వర్ణాలు పుట్టినయి అంటూ..
మా చెమట పునాదుల మీదనే కదా
ఆధిపత్యపు సప్తవర్ణాల సౌధాలు నిలబడ్డది
కావ్య జగత్తుకు కవి రారాజని నీకు తెలుసు
కవి స్వేచ్ఛను కట్టడి చేయడం
సాధ్యం కాని ముచ్చట
వర్ణ సంకరాన్ని ధర్మాన్ని ధిక్కరించి
తాపసిగా మారి తామసాన్ని ఎదిరించిన
శంభూకులం
అన్ని అసమానత పీడనలను రూపుమాపే
చూపుడు వేలు సూరులం
(పుట:17)
రాజకీయ గుంటనక్కల నైజాన్ని ఎండగట్టాడు
వాడు తోడేలు గుంపులో ఉండి
మేకల మెడలు కొరికిన వాడు
గొర్ల కాపరినని గొంతు చించుకుంటుండు
(పుట:22)
ఉమ్మ నీటిలో చందమామలకు అలల ఊయలు కట్టినట్లున్న ఇంద్రావతిని అభివర్ణిం చాడు. అడవి బిడ్డలకు అడవి మీద హక్కు కోసం శృతి కలిపాడు. తన ఊరును మాట్లాడిస్తాడు. మట్టిని మాట్లాడిస్తాడు. పోరు విత్తనాలు చల్లిన ఏరు బిడ్డల గురించి మాట్లా డుతాడు. మూగ వేదనను అనుభ వించిన మాగాణంలో మురళీ గీతిక పాడినట్లు మానేరు ముచ్చట్లను మనతో పంచుకుంటాడు కవి. వసంతం వల విసిరిన చిగురించ డానికి చెట్టు లేదని బాధపడతాడు. పచ్చదనాన్ని మింగిన నల్లతాచు రోడ్లు గురించి మాట్లాడుతాడు.
వేములవాడ పురవీధులన్నీ
వెన్నెల జాగారం చేసినయి
పూలరధమై కదులుతున్న
నీ పార్టీవ దేహాన్ని చూసి
పూల వర్షం కురిసింది
(పుట:85)
తన తల్లి లక్ష్మి యాది చేసుకుంటాడు.
అవ్వా! నువ్వు
ఎంత ఆత్మ గల దానివి
కలిగినోని ఇంట్లబుట్టినా
కలిలోనికి గింజలు లేనోని
ఇంట్లమెట్టినా
కాలాన్ని నమ్ముకున్నవు
కష్టాన్ని నమ్ముకున్నవు
మగ్గంలో నాడే లాగా
నీ కాళ్లు చేతులు రికాం లేకుండ ఆడేవి
కష్టాలు మనిషికొస్తాయి గానీ
మానికొస్తాయా?
జమిడిక వాద్యాన్ని ఒక కవితలో చాలా గొప్పగా వివరిస్తాడు. కన్నెర్ర జేసిన పోచమ్మను సల్లబరుస్తాడు. మంత్ర ముగ్ధులను జేసే ఈ వాయిద్య విన్యాసానికి పోచమ్మే పరవశించి పోతుంది.
డప్పు దరువులతోని జత కట్టిన
జమిడిక జతులకు
చచ్చుపడ్డ కాళ్లకు ప్రాణం వస్తది
కఠిన శిలలు కాల్పని జగత్తులో విహరిస్తయి
గ్రామ దేవతలను కొలిసే
ఊరి గొడుగులు
పాట చెలిమెలు జమిడికలు
(పుట:106)
జమిడికను తెలంగాణా సాంస్కతిక వైభవ విశేషంగా వర్ణించారు.
ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ మనిషి మలాన్ని ఎత్తి పోస్తున్న వార్తను ఈ కవి చదివి ఎంతో చెల్లించి పోయి పరిశుద్ధులు అనే పేరుతో ఒక మంచి కవితను రాశాడు.
వేకువ జామున వెలివాడ నుండి
బయలుదేరే వెలుతురు పాదాలను
చూసి ఊరు ఉలికి పడుతది
అప్పటివరకు అలజడి లేని
మనస్సరోవరం అల్లకల్లోలం అయితది
బకెట్‌, చీపురు, రేకు,
నొసటిరాతను మార్చుకున్నా
నోటికాడికి బుక్కెడు బువ్వను తెస్తాయి
అశుద్ధాన్ని శుద్ధి చేసేవారి ఆయుధాలే
చీపురు, రేకు, బకెట్‌
ఇంట్లో పళ్లెంలోని మెతుకులు
పెంటకుప్పలాగే కనిపిస్తది
కంపును మరిగిన నాసికాలు
ఇంపును కూడా కంపుగానే కలగంటై
(పుట:115)
అణచివేతే అయుధమైనప్పుడు అలుకు పిడచ కూడా ఆయుధ మైతుందని, ఆధిపత్యం నెత్తికెక్కి నపుడు చుక్కలు చూపించుడే రీతి హెచ్చరికలు జారీ చేస్తాడు. గుడిసె కొప్పు మీద విముక్తి జెండాను ఎగుర వేస్తాడు. ఆకాశం అరుగు మీద ఎన్నెల కాయిస్తడు.

– డా. రాధేయ

Spread the love