పాలకు బదులుగా…

కాల్షియం… ప్రస్తుతం ప్రతి పది మంది మహిళల్లో ఎనిమిది మంది ఎదుర్కొంటున్న సమస్య. ఎందుకు అవసరం… ఏంటి దాని ప్రాముఖ్యత అంటే.. శరీర నిర్మాణంలో దాని పనితీరు అటువంటిది. శరీర పనితీరులో కాల్షియం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీర భౌతిక నిర్మాణానికి ప్రధాన మూలం ఎముక. ఎముక పటిష్టంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా అవసరమైనంత శరీరంలో ఉండాలి. శరీర ఎదుగుదలకు ఇది చాలా కీలకం కూడానూ. పుట్టినప్పటి నుంచే కాల్షియం శరీరంలో ప్రధాన భాగమై పోతుంది. పిల్లల్లో కాల్షియం లోపిస్తే పెరుగుదలలో నెమ్మది, పెళుసు ఎముకలు, బోలు ఎముకలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కండరాలు, నాడీ వ్యవస్థ, కొన్ని హార్మోన్ల పని, హృదయ స్పందన వంటివి సక్రమంగా ఉండాలంటే అధిక మొత్తంలో కాల్షియం అవసరం. అయితే కాల్షియం అనగానే మనకు గుర్తొచ్చేది పాలు.. కానీ పాలకంటే కూడా ఎక్కువ కాల్షియం ఉన్న పదార్ధాలు కొన్ని ఉన్నాయి. పాలంటే ఇష్టపడని వారు, అదనంగా కాల్షియం కావాలనుకునే వారు ఏయే పదార్థాలు తీసుకువచ్చో తెలుసుకుందాం…
చీజ్‌ : ఇది పాలలోని ప్రోటీన్‌ ఉత్పత్తి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ పాల కంటే తక్కువ లాక్టోస్‌తో ఉంటుంది. దీని వల్ల బరువు పెరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం చీజ్‌, జున్ను మితంగా తీసుకోవడం ఉత్తమం.
పెరుగు : పాలు అంటే ఇష్టపడని వారు పెరుగు తినవచ్చు. పెరుగులో జీర్ణవ్యవస్థకు ఉపయోగకరంగా ఉండే సూక్ష్మజీవులు ఉంటాయి.
విత్తనాలు : తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు వంటి విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో పాలతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. రోజువారీ కాల్షియం కోసం భోజనంలో కాల్చిన నల్ల నువ్వులను తీసుకోవచ్చు. నల్ల నువ్వుల పాలను కూడా ఒక గ్లాసు తాగొచ్చు.
సార్డినెస్‌ : డైట్‌లో ఉన్న వారికి సార్డినెస్‌ చేప సరైన ఆహారం. ఇందులో అధిక ప్రోటీన్‌తో పాటు మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఎముకల పోషణకు ఉపయోగపడే కాల్షియం పుష్కలంగా ఉన్న మాంసం, లేత ఎముకలు రెండింటినీ తీసుకోవచ్చు.
బాదం : సాయంత్రం స్నాక్స్‌లా ఏమైనా తినాలనిపించినపుడు బాదం గింజలు తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్‌ వల్ల త్వరగా కడుపు నిండినట్లు ఉంటుంది. పాల కంటే ఎక్కువ కాల్షియం వీటి నుంచి పొందవచ్చు. ఎముకల దృఢత్వంతో పాటు మెదడు చురుకుగా ఉండేందుకు దోహదపడతాయి. అంతేకాదు, అల్జీమర్స్‌ రాకను నెమ్మది చేస్తుంది.
చిక్కుళ్ళు : బీన్స్‌తో పాటు బ్లాక్‌ బీన్స్‌, వైట్‌ బీన్స్‌, రెడ్‌ బీన్స్‌ వంటి గింజల రూపంలో తినే పప్పు ధాన్యాలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని మనందరికీ తెలుసు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. పచ్చి బఠానీల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
అంజీర్‌ (అత్తి) : ఎండు అంజీర్‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్‌, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. చిరుతిళ్ళు తినాలని అనిపించినపుడు వీటిని తీసుకోవచ్చు. స్లిమ్‌గా ఉండేందుకు ఈ పళ్లు సహకరిస్తాయి. అయితే వీటిలో చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మితంగా తీసుకోవడమే హితం.
ఆకుకూరలు : ముదురు ఆకుపచ్చ ఆకు కూరలను సూపర్‌ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

Spread the love