జూన్‌ డెడ్‌లైన్‌ ?

బండిని మార్చాలి..కవితను అరెస్టు చేయాలి
అంతా పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష సీటు చుట్టూ రాజకీయం నడుస్తున్నది. బండి సంజరుని అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తేనే రాష్ట్రంలో బీజేపీ మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అధిష్టానంపై అసంతృప్తి గ్రూపు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఆ పార్టీ అధిష్టానానికి జూన్‌ నెలాఖరు వరకు డెడ్‌లైన్‌ విధించినట్టు ప్రచారం జరుగుతున్నది.
 కేసీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాల్సిందే
 బీజేపీ అధిష్టానానికి అసంతృప్తుల అల్టిమేటం
 లేకుంటే మా దారి మేం చూసుకుంటామని హెచ్చరిక
 రాజగోపాల్‌రెడ్డితో దిగ్విజరు సింగ్‌ చర్చలు !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బండి సంజరు స్థానంలో ఈటలను అధ్యక్షునిగా నియమించాలనీ, కవితను అరెస్టు చేయడంతో పాటు కేసీఆర్‌ కుటుంబం ఆస్తులపై విచారణ జరిపించాలనే డిమాండ్లను అసంతృప్తులు ముందుకు తెస్తున్నట్టు తెలిసింది. జూన్‌ నెలాఖరులోగా అధ్యక్షున్ని మార్చకపోతే తమ దారి తామూ చూసు కుంటామని అల్టిమేటం జారీచేశామని రాజగోపాల్‌రెడ్డి తన అనుచరుల వద్ద బహిరంగంగానే చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. తనతో కాంగ్రెస్‌ నేత దిగ్విజరుసింగ్‌ సంప్రదింపులు జరిపి ఆ పార్టీలోకి తిరిగి రావాలని కోరారని కూడా ఆయన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు వినికిడి. అయితే, రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికైతే తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలపలేదని తెలిసింది. ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తదితర అసంతృప్త నేతలు దక్షిణ భారతదేశ రాజకీయాలకు సంబంధించిన బ్లూప్రింట్‌ను అధిష్టానం వద్ద ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం ఎవరు?, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఎవరు? వారిలో బలమైన నేతలెవరు? అనే అంశం కూడా ఎన్నికల ఫలితాల్లో కీ రోల్‌ పోషించే అవకాశం ఉంటుంది. మొదటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో మత విద్వేషాలను ప్రజలు సహించరు. వాటిని భుజాన వేసుకుని వచ్చే పార్టీలకు తగిన బుద్ధి చెబుతూనే ఉంటారు. విద్వేషపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు మరింత దూరమయ్యే ప్రమాదముంది.
ఈ పరిణామాలన్నింటినీ వివరిస్తూ ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశమంతటా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన ఫలితాలు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన ఎన్నికల రిజల్ట్‌, తాజాగా కర్నాటకలో బీజేపీకి ఎదురైన పరాభవం, బండి సంజరు వివాదాస్పద వ్యాఖ్యలు, ఇలా ప్రతి అంశాన్నీ అధిష్టానం ఎదుట పూసగుచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ మరింత దూకుడు పెంచాలంటే బండి సంజరు సామర్ధ్యం సరిపోదని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. బండిని తొలగిస్తే పాత బీజేపీ శ్రేణుల్లో వ్యతిరేకత వస్తుందని భావిస్తే…సంజరుకి గౌరవప్రదంగా మరో పదవి ఇచ్చి అయినా సరే పక్కకు తప్పించాలని ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. తామంతా కేసీఆర్‌ బాధితులమనీ, ఆయన్ను ఓడించే లక్ష్యంతో పనిచేస్తున్నామని కుండలు బద్ధలు కొట్టినట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చకుండా, కేసీఆర్‌ కుటుంబంపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి చేయకుండా ఉంటే తాము మరో ప్రత్నామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీచేసినట్టు విశ్వసనీయ సమాచారం.

Spread the love