న‌వ వ‌సంతాన్ని కొత్త‌గా ఆహ్వా‌నిద్దాం

Let's invite a new springకుటుంబ జీవితంలో మనిషి రోజూ బతకడానికి తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. ఈ ఆహారం తీసుకునే విధానం ఒక్కో ప్రాంతానికి, ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు రొట్టె, కూర, పప్పు తింటారు. కొందరు అన్నం పచ్చళ్ళు కూరలు, పప్పు వంటి రకరకాల పదార్థాలతో తింటుంటారు. అట్లాగే ఆచార వ్యవహారాలు కూడా మనిషి జీవితంతో ముడిపడి ఉంటాయి. ఒక్కో మతంలో ఒక్కో తీరు, ఒక్కో కులంలో ఒక్కో తీరు పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆచారాల ప్రభావం… అవి పాటించేపుడు ఎలాంటి విషయాలు ఎదురవుతాయి, కొత్తగా వస్తున్న మార్పులు ఏమిటి? పూర్వపు ఆచారాలు, ఆలోచన ఎలా ఉండేవో చూడాలి. ఇవన్నీ కుటుంబ విషయాలలో ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకొని ఉంటాయో చూడాలి. ప్రవర్తన, విధానాలు, పరిణామాల వంటివి ఈ ఉగాదితో సమన్వయం చేసుకుంటూ సాగుదాం.

ఐన్‌ స్టీన్‌ ఒక మాట అన్నాడు, »»Science without religion is lame, religion without science is blind” అని. నిత్య జీవితానికి విస్తృత అర్థం చెప్పే ఉద్దేశం కాదు కానీ, కొంతనైనా భౌతిక శాస్త్ర దృష్టి, కొంతనైనా తత్త్వజ్ఞానమూ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నటువంటి మననుషులు కాస్త ప్రత్యేకంగా ఉంటారు. విశాలభావాలు కలవారికి ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. భారతీయ సంప్రదాయంలో తెలుగువారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు భారతీయ కాలమాన ప్రకారం, అంతరిక్ష, ఖగోళ, భూగోళ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళ జీవన విధానానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఏర్పరుచుకున్నారు. ఏడాదికి 360 రోజులని అరవై ఏళ్ల చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి 12 నెలలు అని, ఇది సూర్య శక్తి రూపానికి నెలవైన ‘కాలం’ అని అన్నారు. నెలకు 30 రోజులని, 24 గంటలు ఒక రోజు అనీ 60 నిమిషాలు 1 గంట అనీ ఇలా చెప్తూ, వాటికి పేర్లు కూడా పెట్టారు. విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నా, చంద్ర గమనంతో 27 ముఖ్యమైన నక్షత్రాలను గుర్తించి, పేర్లనుపెట్టి, ఆ పేర్లను రోజులకు తిథులు’గా అన్వయించి సూత్రీకరణ చేసుకున్నారు. ఈ వివరాల్లోకి పోకుండా, కొన్ని విషయాలను స్పృశిస్తూ సాగుదాం.
వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శశిర ఋతువులు ఆరు అని, సంవత్సరానికి 12నెలలలో రెండేసి నెలలు ఒక ఋతువు అని పేర్లు నిర్ణయించారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం నెలల పేర్లు పెట్టారు. పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులను కృష్ణపక్షం అని, మళ్ళీ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 రోజులు శుక్లపక్షం అని అన్నారు. పదిహేను రోజులను పక్షం అంటారు. నెలకు 2 పక్షాలు. రెండు చంద్రోదయాల మధ్య కాలాన్ని తిథులతో లెక్కిస్తారు.
ఈ రోజుల నడక అంతా ఇలా పేర్కొన్నారు. మరి కాస్త వివరాల్లోకి వెళ్తే, సూర్యగమనంతో ఏర్పడే వాతావరణాన్ని బట్టి ఋతువులు ఏర్పడతాయి కాబట్టి, వసంత ఋతువు, (Spring) ఉండే చైత్ర, వైశాఖ మాసాల్లో చెట్లు చిగురించి పూలుపూసి ఆహ్లాద వాతావరణం ఉంటుంది. గ్రీష్మ ఋతువు(Summer) జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఎండలు బాగా కాస్తాయి. వర్ష ఋతువు (Monsoon) శ్రావణ, భాద్రపద మాసాల్లో వానలు ఎక్కువగా కురుస్తాయి. శరదతువు (Autumn) ఆశ్వయుజ, కార్తీకమాసాల్లో వెన్నెల బాగా ఉంటుంది. హేమంత ఋతువు (Winter) మార్గశిర, పుష్య మాసాల్లో మంచు బాగా కురుస్తూ చల్లగా ఉంటుంది. శిశిర ఋతువు (Fall) మాఘ, ఫాల్గుణ మాసాల్లో చెట్లు ఆకులు రాల్చి మోడు వారి పోతాయి. ఈ ఋతువులనే మూడు కాలాలుగా నిర్ణయించారు. 1. వేసవి కాలము, 2. వర్షాకాలం, 3. శీతాకాలం అంటూ ఒక్కొక్క కాలం నాలుగు నెలలు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలను అనుసరించి శాస్త్రవేత్తలు నిర్ణయించిన పేర్లు. తెలుసుకోవడానికి అయినా చెప్పడానికైనా సులువైన మార్గంగా ఉండేలా నిర్ణయించారు. ఇలా ఋతువులు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు అంటూ పేర్లు పెట్టారు. మొదటి ఆరు నెలలకు ఉత్తరాయణం, తర్వాత ఆరు నెలలకు దక్షిణాయణం అంటూ పేర్లు పెట్టారు. వాతావరణ, జీవావరణ శాస్త్రాలను పరిగణించి ఇటువంటి విభజన చేశారు. ఇదంతా కూడా ప్రకృతిలో వాతావరణ మార్పులు సూర్యచంద్రుల గమనాల వలన ఏర్పడినవిగా గుర్తించారు. సూర్యచంద్రుల అక్ష సంబంధ విషయాల ఈ సౌరమాన విషయాలన్నీ భూ పరిగ్రహ ఆధారంగా వైవిధ్యమైన కాలానుగుణం మార్పులను బట్టి నిర్ణయించారు. ఈ కొలతలు, పరిస్థితులు అన్నీ కూడా భూ ఉపరితలం మీద ఉండే భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాల ఊహారేఖ వంటివన్నీ సశాస్త్రీయంగా చెప్పినవే. అంతరిక్షంలో ఉండే ఇతర గ్రహాలకు, నక్షత్రాలను, ఖగోళ వస్తువులను, కక్ష్యలో తిరిగే భూ భ్రమణాన్ని గణిత పరంగా నిర్ధారించి చెప్పినవే. వీటినే ప్రజలు వాతావరణంలో వచ్చే ఆయా మార్పులకు అనుగుణంగా ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరచుకున్నారు. ఈ కోణంలో కూడా ఉగాది పండగ చరిత్ర తెలుసుకోవాలి.
ఓ 450 కోట్ల సంవత్సరానలకు పూర్వం భూగోళం పుట్టిందని అంటారు. జలచరాలు జంతువులు, మనుషులలో ఎన్నో పరిణామాల జరిగాయి. ఆది మానవులు ఎన్నో దశలను దాటుకుంటూ ఆధునిక మాడవుడై రాతియుగం నుండి రాకెట్‌ యుగం వరకు చేసేదే నిరంతర ప్రయాణం. ఎన్నో అభ్యసనలతో, ఎన్నో ప్రయోగాలతో ముందుకు సాగుతున్న జీవనమిది. అన్నీ తెలిసినా మరోసారి తలుచుకోవాలి, ఉగాది గురించి తెలుసుకోవాలి.
ఉగస్య ఆది ఉగాది. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం అనీ, జన్మ అని, ఆయుష్షు అని అర్థాలున్నాయి. మనందరికీ తెలిసిందే ‘ఆది’ అంటే మొదలు అని.
ఉగం+ఆది=ఉగాది. హిందూ ఆచారాలలో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు ఈ ఉగాది, యుగాది సంవత్సరం మొదటి రోజు, చైత్ర పాడ్యమి రోజున ఉత్సవంగా జరుపుకోవడం ముఖ్య ఆచారం. యుగాదే ఉగాది. ఈరోజున్నే సృష్టి జరిగిందని నమ్ముతూ ఏర్పరచిన విశేషమైన రోజు. మార్చ్‌ నెల చివరలోనో, ఏప్రిల్‌ నెల మొదట్లోనో ఉగాది వస్తుంది.
ఆకాశంలో గాలి లోపల చలనాంశాణువులు ఉంటాయి. అగ్నిలో తేజోంశాణువులు ఉంటాయి. అలాగే ద్రవంశ్యాణువులు నీరులో ఉంటాయి. కఠినాంశాణువులున్న భూమి వీటికి ధీటుగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన నిశ్చలత్వంతో తన చుట్టూ తాను తిరుగుతూ ప్రాణులకు నిలయమై ఉన్నది భూమి. ఈ పంచభూతాలు సకల జీవకోటికి నిలయం. ఇదో ఎండ్‌ లెస్‌ జర్నీ. పరస్పర విరుద్ధంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేశాడు కాబట్టే బ్రహ్మాండ జ్ఞానాన్ని అక్షర రూపంలో నిక్షిప్తం చేశాడు. ఆకాశంలో బుద్ధి, చిత్రం, గ్యాత, అహంకారం, మనస్సు అనే ఐదింటిని కలిపి పంచాకాశం అంటుంటారు. నీటిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఉన్న జల పంచకంగా చెప్తూ ఉంటారు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే పంచకాలను జ్ఞానేంద్రియాలు చెప్పేదే అగ్ని పంచకాలు. ప్రాణ, అపాన, ఉదాన, జ్ఞాన సమానాలకే వాయు పంచకాలుగాను, ప్రాణ పంచకాలుగాను చెప్తారు.
ఇలాంటివి తెలుసు కోవాలి. ఇవన్నీ కూడా విజ్ఞానాన్ని అందించేవే. ఈ పంచభూతాలు ప్రతి జీవికి అవసరం. పరస్పర విరుద్ధాంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేసాడు.
అట్లాగే కాళ్లు, చేతులు, వాక్కు, మల, మూత్ర ద్వారాలైన కర్మేంద్రియాలను పంచభూతాలుగా చెప్తారు. మనస్సు ప్రత్యేకమైనది. ఇట్లా అన్ని విషయాలు చెప్తూ, సమస్త జ్ఞాన ప్రకాశాన్ని తనదైన తెలివిడితో ప్రకృతికి, వాతావరణానికి జతచేసి, తన ఆరోగ్యానికి, ఉనికికి, అవసరాలకి సంబంధించిన విషయాలను పండుగలుగా పేర్లు పెట్టి, ఉత్సవ నియమాలతో ఉత్సవ క్రియలను జరుపుకునే విధానాన్ని ఏర్పరిచాడు మనిషి. ఏ పండగ తీసుకున్నా వాటికి సంబంధించిన ఆహార విషయాలు, ఆచరణ విషయాలు ఇవే చూపిస్తాయి. దీన్నే ఇంటలిజెన్స్‌ అంటారు. అంటే మహాతత్వం అన్నట్టు! ఇదే విద్యా విజ్ఞాన లక్షణమన్నట్టు! వీటితో అరిషడ్వర్గాలుగా నిర్ణయించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జతచేసి ఆరు రుచులు అంటే షడ్రుచులకు పోలికను చెప్పి మనిషి గుణాలకు రుచులకు సమన్వయం చేశారు. కోరిక, కోపం, వ్యామోహం, అనురక్తి, కండకావరం, ఓర్వలేని తనం అనే ఆరు గుణాలు అంత: శత్రువులుగా పనిచేస్తూ మనిషిని నడిపిస్తుంటాయి. ఇవి సత్వ, రజో, తమో గుణాలతో చెప్పి మనిషిలోని ఇంద్రియాలకు అధ్యక్షస్థానంలో ఉన్న మనసుని మొట్టమొదలు చెప్తారు. ఈ మనస్సుకు చంద్రుని ప్రభావం ఉండడానికి కారణాలను చెప్తారు. కఠినత్వం, గర్వితం కలగల్సిన అహంకారం ఆధారంగా అరిషడ్వర్గాలు పనిచేస్తుంటాయి. భావ వికారాలు, భావ వినోదాలు ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ప్రేరణతో ప్రభావం చూపుతాయి.
భూమ్యాకర్షణ భూతాకాశ శక్తికి, చిత్తాకాశానికి చంద్రునికి, చిదాకాశం సూర్యునికి, నిరాకాశం గెలాక్సీ (Galaxy) అని పేరుతో పిలువబడే నక్షత్రం మండలానికి నిర్ణయించారు. సూర్యుని ఉష్ణ శక్తి, చంద్రుని శీతోష్ణ శక్తి అన్ని ప్రాణులపైన ప్రభావం చూపుతాయి కాబట్టే ప్రకృతి సంబంధితమైన వస్తు గుణ విశేషాలను లెక్కలోకి తీసుకున్నారు. వీటన్నింటి అనుసంధానమే ‘ఉగాది’. Gravitational force, Nuclear force, Electromagnetic force అనేవి శక్తి ప్రేరకాలు. ఇవి దేశ, కాలాలకు సమన్వయించి ఒక సూత్రంలోకి తెచ్చిన భౌతికశాస్త్ర జ్ఞానానికి అద్దం రూపే ఈ ‘ఉగాది’. ప్రాణం మనస్సు ఇంద్రియాల కూడికనే ‘ఉగాది’.
ఫాల్గుణ మాసం వెళ్ళగానే చైత్రమాస ప్రథమ తిథి అయిన పాడ్యమి రోజున సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణిస్తారు. ఇదే వసంత ఋతువు ప్రారంభం. వసంత ఋతువు కంటే ముందు శిశిర ఋతువు ఉంటుంది. చెట్లన్నీ ఎండిపోయి ఉన్న పరిస్థితి నుండి ఒక్కసారిగా చిగురులెత్తి ప్రకృతి మొత్తం అందంగా కనిపించే ఋతువు వసంత ఋతువు. పక్షి సంతతి, జంతు సంతతి పరవశించిపోతుంది. పచ్చని మామిడి చెట్లను చూసి కోయిలలు రాగాలెత్తుతాయి. మనుషులు ఈ శోభాయమానంగా సిద్ధమవుతున్న ప్రకృతిని చూసి చైతన్యాన్ని పొందుతారు. ఈ చైతన్యం అంకురించి ఆశయాలకు దారి చూపే ఋతువు అవుతుంది. అందుకే ఉగాదిని చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు.
ఉగాది పచ్చడి:-
మనుషులు ఆశా జీవులు. ఏడాది మొత్తం ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహల పడుతుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు? జరిగేది జరుగుతుందని ఊరుకోరు. మానవ ప్రయత్నం కొంతైనా చేయాలనంటారు. ఇది ఓ సాధారణ విశ్వాసం. అందుకే ఆరు రుచులతో ఉగాది పచ్చడిని చేసుకొని తినడంతోపాటు పంచాంగ శ్రవణం చేయడమూ చూస్తాం.
ఉగాది పచ్చడిలో ‘మాధుర్యం’ అంటే తీపి- చెరుకు, బెల్లం. ‘ఆమ్లం’ అంటే పులుపు – కొత్త చింతపండు రసం. ‘లవణం’ అంటే ఉప్పు. ‘కటు’ అంటే కారం- మిరియాలు. ‘తిక్త’ అంటే చేదు- వేప పువ్వు. ‘కషాయం’ అంటే వగరు – లేత మామిడికాయలు. ఇవే ఉగాది పచ్చడికి కావలసిన మూల పదార్థాలు. పలుచని కొత్త చింతపండు రసంలో వేప పువ్వు రెక్కలు, చిన్ని మామిడికాయ ముక్కలు, కాసింత మిరియాల పొడి, సరిపడేంత కొత్త బెల్లం, చెరుకు గడల ముక్కలు, చిటికెడంత ఉప్పు వేసి కలిపి చేసిన ‘పచ్చడిని’ నైవేద్యంగా పెట్టి తర్వాత అందరూ ఈ ‘ఉగాది పచ్చడి’ని సేవిస్తారు. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానాదులు చేసి, కొత్త బట్టలు కట్టుకొని దైవ ప్రార్థన ముగించుకొని, రకరకాల పిండి వంటలను వండుకొని కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆనందంగా భుజిస్తారు. సాయంకాలం గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం విని మంచి చెడులను తెలుసుకుంటారు. ఇష్టమైన వాళ్ళను కలుసుకోవడం, పెద్దవాళ్లకు కాళ్లకు మొక్కి దండం పెట్టుకోవడం, గోపూజ చేయడం వంటివి ఆనవాయితీ! ‘ప్రభవ’ నుండి ‘అక్షయ’ వరకు ఉన్న 60 సంవత్సరాల పేర్లలో ‘క్రోధి’ 38 వది. 1965లో క్రోధి నామ సంవత్సరం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మనుషులలో క్రోధాన్ని కలిగిస్తుందన్న అర్థంతో ఉన్న ఈ పేరు లోని పరమార్ధాన్ని గ్రహించాలి. క్రోధం ఎందుకు వస్తుంది? ఎవరిపై వస్తుంది? క్రోధం వస్తే లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఎవరికి వారే ప్రశ్నలు వేసుకొని ఒక మంచి అవగాహనకు రావాలి. క్రోధాల వల్ల ఏ ఉపయోగాలు ఉండవు. అనారోగ్యాలు వస్తాయి! అలసటలు తెస్తాయి!! ఆనందాలను పోగొడతాయి!!! ఇది అర్థమైతే చాలు. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌’ అని మన పెద్దలు ఎందుకు అన్నారు? ఇందుకే! ఏదో చెడు రాబోతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడితే ఆ చెడు నుంచి కొంతనైనా మనల్ని మనం రక్షించుకుంటాం. రక్షించుకునే ప్రయత్నం చేయాలి. కాస్త ఓపిక, మరికాస్త మంచితనం జత చేసామంటే అన్ని చికాకులను అధిగమించవచ్చు అనేది ‘ఉగాది’ నేర్పించే పాఠం.
2024 ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ. మనసుపై స్వీయ నియంత్రణ లేకపోవడం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అత్యాశ, ఆత్రుత వంటివి విషయాసక్తులుగా ఉండడం వలన మనుషులు అధ:పతనానికి పడిపోతుంటారు. ఇది గుర్తెరిగితే చాలు. పర్యావరణాన్ని పాడు చేసుకోవడం వలన ప్రకృతి ప్రకోపిస్తుంది. ఎండలు అధికమైనా, వానలు అతిగా కురిసినా. అత్యధిక చలి పెరిగిన పర్యావరణాన్ని పాడుచేసే మనుషులే కారణం. ఇదే తమస్సు. అంటే చీకటి. ఆ చీకటి నుంచి వెలుగులోకి పయనిద్దాం.
పిల్లాపాపలతో తల్లిదండ్రులతో హాయిగా ఉండే కుటుంబ జీవితాలను హదయపూర్వకంగా ఆచరిద్దాం. పండగలలో కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి పని చేసుకునే సామరస్య జీవితానికి గొప్ప హేతువులు పండుగలు. శోభకృత్‌ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘క్రోధ’ నామ సంవత్సరానికి ఈ ‘ఉగాది’ పండుగ నాడు ఆహ్వానిద్దాం. ఈ నవవసంతాన్ని కొత్తగా ఆహ్వానిద్దాం.

– డా|| కొండపల్లి నీహారిణి,
9866360082

నిండైన పండుగ!
ఉరుకుల పరుగుల రణగొణ ధ్వనుల్లో
మనల్ని మనం మరచిన వేళ
చెట్టు చెట్టుకీ ఎవరో పిలుస్తూ ఉంటే
అప్పుడు గుర్తొస్తుంది ఆ స్వరమధురం!
ప్రకతి ధర్మానికి పలికే కోయిల రాగం
అర్థమయ్యేక తీయటి ఆలోచనలతో
గుండెల్లో ఆనందానుభూతి ప్రవహిస్తుంది
సూర్యుడే చెబుతాడు వెచ్చగా గిచ్చి మరీ
పూత పరదా కప్పుకొని వేపచెట్టు
పిందె సరదా చెప్పుకొని మామిడిచెట్టు
నూతన వత్సర ఆగమనంగా కనబడగానే
మనసుల్లో పండుగ కళ వెలుగుతుంది
మధుమాసంలోని మాధుర్యమంతా
పుణికి పుచ్చుకొని ఆబాలగోపాలాన్ని
పులకాంకితుల్ని చేసేదే ఉగాది!
పచ్చదనం చిగుర్లు తొడిగిన కొమ్మకొమ్మన
కోకిలమ్మలు సన్నాయి పాడుతుంటే
ఇళ్ల ముంగిట రంగవల్లులు ఒద్దికగా ఒదిగితే
ద్వారాలు మామిడి పత్రహారాలతో
మంగళద్వానాలు పలుకుతుంటే
క్రోధి ఉవ్వెత్తున ఎగసే కడలి తరంగంలా
తెలుగు వాళ్ళ జీవితాల్ని ఆనందాబ్ధిలో
ముంచి ఓలలాడిస్తుంది..
కొత్త వస్త్రాలు పిండి వంటలు ఓ పక్క
జీవన పార్శ్వాల్ని జిహ్వకు పరిచయం
చేసేటి షడ్రుచుల పచ్చడి మరో పక్క
తెలుగు వారి జీవితాల్లో తెలిరేకయై
విచ్చుకొని వికసింపచేస్తుంది ఉగాది!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

యాది
ఉగాది.. నాకు బాగా యాది
కుమ్మరి బాలయ్య తాత
కుండిచి పోయేది
మా ఊరి సిక్కులోని తొట్ల
మామిడి కాయలు తెచ్చెది
ఇంటేనుక ఉన్న యపచెట్టుకు
పువ్వు తెంపేది
సంతన్న దుకడ్ల
సరుకులు తెచ్చది
పచ్చడి కమ్మగా జేసేది
వడకట్టు అంతా పంచేది
దో స్తుగాల్లు అడిగి మరీ తాగేది
గిప్పుడు ఏది గా ఉగాది..
ప్లాస్టిక్‌ డబ్బాల
రుచి లేని పచ్చడి
వడకట్టు అంతా వెతికినా
తగేటో ల్లేరి
పండగకు ఊరికి
వచ్చేదే మరిచిరి
వాళ్ళు ఇప్పుడు
పట్నంలో వలస
పక్షులు మరీ
గాప్పటి ఉగాది
మరచిపోని యాది…!

– ఏ. అజయ్‌ కుమార్‌

Spread the love