జీవితమే ఒక నాటకరంగం

జీవితమే ఒక నాటకరంగంకావ్యేషు నాటకం రమ్యమ్‌..
పండితుడు పామరుడు భేదం లేని
తాధాత్మ్యతనందించే
అద్భుత ప్రక్రియ
హావభావ ప్రకటనల
స్థలం రంగస్థలం
అది మాట్లాడితే కావ్యాలు మనసు
రంగస్థలంలో శాశ్వతాలై పోతాయి
జీవిత సత్యాలు విచ్చుకొంటాయి
నిజానిజాలతో కండ్లు
తెరుచుకొంటాయి

రంగులు పులిమి రంగస్థలం తెరిస్తే
బాధలన్నీ ముఖాల వెనకే దాచుకున్న
స్వంత ముఖం లేని బహుముఖాలు
ధరించిన ఆహార్యానికి అనుగుణంగా
ఆంగికం అభినయం వాచకం..
అలవోకగా వొలికించే కళాకారులు
చప్పట్లు తప్ప పచ్చనోట్లు ఆశించరు
నిజానికి వాళ్ళ జీవితమే ఒక నాటకం

ఆత్మానుభూతిని పొందగలిగే ప్రదర్శనే
కళాకారుడి నిజ అంతరంగ నిదర్శనం
జాతి, మత, భాష, ప్రాంతాలకు అతీతం
ధర్మార్థ కామ మోక్షాల్ని చూపే సాధనం
కండ్లముందే ఆడే మన నిత్యజీవితం!!
(నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్‌
సెల్‌: 9949800253

Spread the love