జమ్మూ కశ్మీర్‌లో వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మరో ఉగ్ర ఘటన వెలుగుచూసింది. బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాజు షా అనే కార్మికుడే లక్ష్యంగా కాల్పులు జరిపారని, తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ‘ఎక్స్’ వేదికగా వివరాలు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల గాలింపు ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. అనంత్‌నాగ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉద్ధృత స్థాయికి చేరుకున్న సమయంలో ఈ హత్య జరగడం కలవరపరుస్తోంది. ఉగ్రవాదుల దాడిని అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి. కాగా గత సోమవారం దక్షిణ కశ్మీర్‌లోని హెర్పోరాలో డెహ్రాడూన్‌కు చెందిన వలస వ్యక్తి టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఫిబ్రవరిలో శ్రీనగర్‌లో పంజాబ్‌కు చెందిన ఇద్దరు కార్మికులను కూడా తీవ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా అతడికి పాకిస్థాన్‌తో లింకులు ఉన్నట్టు తేలింది.

Spread the love