హైదరాబాదీ మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ కూరలు ఘుమఘుమలాడుతుంటాయి. చికెన్, మటన్ లేదా చేపలు, రొయ్యలు ఇలా ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వారు తెచ్చుకొని తింటుంటారు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మాంసాహార ప్రియుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే వారందరికీ నిరుత్సాహం కలిగించే చిన్న బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాదీ మాంసం దొరకదు. ఎందుకంటే మహావీర్ జయంతి సందర్భంగా సిటీలోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భాగ్యనగర పరిధిలోని మాంసం దుకాణాలు ఆదివారం మూతపడనున్నాయి. కాగా జైనులకు మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగనే విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో జైనుల సంఖ్య గణనీయంగా ఉండడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా హైదరాబాద్ నగరంలో మాంసం విక్రయాలు గణనీయ సంఖ్యలో ఉంటాయి. సిటీలో పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాతో పాటు వేలాది సంఖ్యలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు కూడా ప్రతి రోజూ భారీ మొత్తం మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాయి. ఆదివారం ఈ పరిణామం మరింత ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే

Spread the love