ముమ్మాటికి మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతిపరుడే

– సుద్దపుస మాటలు మాట్లాడితే నీతిమంతుడు కాలేడు
– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంటేశ్వర్
ముమ్మాటికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అవినీతి పరుడేనని సుద్ధ పూస మాటలు మాట్లాడితే నీతిమంతుడు కాలేడని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్బీన్ హంధాన్ ,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరాడని నిజానికి ప్రశాంత్ రెడ్డి అవినీతిపరుడని, సహజ వనరులు దోచుకుంటున్న దొంగ అని,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సహజ వనరులైన ఇసుక, మైనింగ్, మోరం ను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నది ప్రజలు గమనిస్తున్నారని, జిల్లాలో ఎమ్మెల్యేలు అందరితో సమానంగా కాకుండా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎక్కువ దోచుకుంటున్నాడని ఏర్గెట్లలో మైనింగ్ పేరుతో వందల కోట్లు అవినీతికి పాల్పడ్డాడని, ప్రశాంత్ రెడ్డి కూడా కెసిఆర్ లాగానే అప్పుడప్పుడు బయటకు వచ్చి అందరూ అవినీతిపరులు నేను మాత్రమే మంచివాడిని అని చెప్తుంటాడని ఆయన అన్నారు.అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తూనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మీకు ఒక సవాల్ విసిరుతున్నానని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో మొదటి నాలుగు సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా మీరు చేసిన అవినీతిని రాష్ట్ర ప్రజలందరూ పత్రిక విలేకరులు కోడై కూసరని, అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్న నాలుగున్నర సంవత్సరాలుగా రోడ్లు భవనల శాఖ మంత్రిగా మీరు నిర్మించిన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం మీ అవినీతికి పరాకాష్ట అని, అదేవిధంగా జిల్లాకు మంత్రిగా ఉండి జిల్లాను అభివృద్ధి చేయాల్సిన మీరు కేవలం నియోజకవర్గాన్ని అవసరం లేని దగ్గర కూడ కమిషన్ల కొరకు రోడ్లు నిర్మించారని, ప్రతి ప్రాజెక్టులో రోడ్ల నిర్మాణంలో చెక్ డ్యాం ల నిర్మాణంలో కానీ 30% కమిషన్ తో వందల కోట్లు తీసుకొచ్చానని చెప్తున్నారని కానీ మంత్రిగా జిల్లాను మొత్తం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్గెట్లలో ఉన్న క్వారీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బినామీదని ఆరోపించిందని, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి దానిని తన బంధువులదని ఒప్పుకున్నాడని ,అదేవిధంగా ఏర్గట్లలోని క్వారీలో సహజ వనరులలో జాతి సంపదను ఎంత దోచుకున్నావని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే పొంతన లేకుండా సమాధానం ఇస్తూ ప్రశాంత్ రెడ్డి క్వారీ విలువ 10 కోట్లని 10 ఎకరాల భూమిని క్వారీని 10 కోట్లకే ప్రతిపక్షాలకు ఇస్తానని సంబంధం లేని సమాధానం చెప్పడం ఏ విధంగా సరైనదో చెప్పాలని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక మొదలు కాలేదని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ రెడ్డి గారు గాని, ఈరవత్రి అనిల్ గారు గాని ఏ రోజు అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయలేదని, మీలాగా ఏ రోజు అవినీతికి పాల్పడలేదని ఆయన తెలియజేశారు.మిషన్ భగీరథ, రోడ్ల నిర్మాణం ,చెక్ డ్యాములు, అమరవీరుల స్తూపం, సచివాలయం ,అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఈ ఆరు అంశాలలో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదని ప్రశాంత్ రెడ్డి నిరూపించుకోవాలని ,ఎక్కడికి రమ్మన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. 2014లో ప్రశాంత్ రెడ్డి చూపించిన ఆస్తుల విలువెంత 2023లో ఆయనకున్న ఆస్తుల విలువెంతనో చూస్తే ప్రశాంత్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడో తెలుస్తుందని ,ఆ రోజు మీయొక్క వ్యాపార టర్నోవర్ ఎంత ఈరోజు మీ యొక్క వ్యాపార టర్నోవర్ ఎంత దానిని చూస్తేనే మీ అవినీతి బయటపడుతుందని ఆయన అన్నారు. అవినీతి అంటే కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్న డబ్బు అని ఎవ్వరూ కూడా కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న డబ్బుకు ఫోటోలు వీడియోలు తీసుకోరని కాబట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అవినీతి చేశారని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరే అవినీతి చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నానుడి ఉంది రషీద్ తప్పితే మసీదు అని కావున మీరు అవినీతి చేయలేదని ఎక్కడ ప్రమాణం చేస్తారో చెప్తే అక్కడికి మేం వస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రతి పనిలో అవినీతి ఉందని ఉదాహరణకు ముప్కాల్ లో 990 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు రెండు వేల కోట్లకు ఎందుకు వెళ్లిందో చెప్పాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని ప్రశాంత్ రెడ్డి ముమ్మాటికి అవినీతిపరుడే అని మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు నా తమ్ముడిని గంజాయి స్మగ్లర్ అంటున్నాయని చెప్పారు, మీ తమ్ముడు నిజంగా గంజాయి స్మగ్లర్ కాకపోతే ఏర్గట్ల మండలంలో రేవంత్ రెడ్డి మీ తమ్ముడిని గంజాయి స్మగ్గలరని ఆరోపించిన తర్వాత జిల్లాలో ఎందుకు గంజాయి కేసులు మొదలయ్యాయి, అంతకు ముందు ఎందుకు గంజాయి కేసులు ఒక్కటి కూడా వెలుగులోకి రాలేవో చెప్పాలని ,ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నమని ,ప్రశాంత్ రెడ్డి తమ్ముడిని గంజాయి స్మగ్లర్ అంటే అంత కోపం వచ్చింది మరి ముప్కల్ మండలంలో సంతోష్ అనే రైతు యొక్క తమ్ముడిని ,ఇంజనీరింగ్ చేస్తున్న కుమారుణ్ణి అక్రమంగా గంజాయి కేసులో ప్రశాంత్ రెడ్డి ఇరికించాడని,ప్రశాంత్ రెడ్డి మంత్రి కాకముందే సంతోష్ కుటుంబంలో సర్పంచులు, ఎంపీపీ లు వున్నారని,మీరు ఎమ్మెల్యే కాకముందే మీకంటే ఎక్కువ ఆర్థికంగా ఉన్న సంతోష్ కుటుంబం ఎందుకు గంజాయి స్మగ్లింగ్ చేస్తుందో ప్రశాంత్ రెడ్డి నిరూపించాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హాందన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి ఆరోపణలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి గాని అధికార యంత్రం గాని సమాధానం ఇవ్వాలని, బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలంలో క్వారీలో మంత్రి అవినీతి చేశాడని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డి నిర్మించిన చెక్ డ్యామ్ లో ఇప్పటివరకు నాణ్యత లోపం వల్ల ఎన్ని కొట్టుకుపోయాయో విచారణ జరిపించాలని, ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టుల కాంట్రాక్టు అన్ని ఒకే కాంట్రాక్టర్కు ఇవ్వడం ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంత కమిషన్ వచ్చిందో అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చి అవినీతి చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందని, ఒకవేళ దీనికి స్పందించకపోతే మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజంగా అవినీతి చేసినట్టేనని జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. చెక్ డ్యామ్ ల కట్టలు తెగి సాగు భూములు కొట్టుకపోయి 5 నెలలు అవుతున్న పట్టించుకోని జిల్లా అధికారులు,ప్రభుత్వం,నాణ్యత లోపం వల్లే చెక్ డ్యామ్ లు తెగిపోయని,ఒకే డిజైన్ తో అన్ని చెక్ డ్యామ్ లు నిర్మాణం చేపట్టినరని,అత్యుత్సాహం తో, ఆలోచనరహితంతో చెక్ డ్యామ్ ల వాల్ పెంచి నిర్మించడం వల్లే సాగు భూములు కొట్టుకపోయినవని,వేల్పూర్ బ్రిడ్జి కింద నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ నాణ్యత లోపం వల్ల నీళ్ళన్ని లీకేజీ రూపంలో వెళ్లి పోతున్నాయని ఆయన అన్నారు.వేల్పూర్, పచ్చల నడుకుడ చెక్ డ్యామ్ ల కట్టలకు అదే వాగు లోని గ్రావెల్ పోయడం వలన భూగర్భజలాలు పెరగలేని పరిస్థితి తో పాటు కట్ట బలహీనంగా మారి తెగిపోయిందని,గుత్తేదారు కి అదే వాగు నుండి గ్రావెలు తీసుకున్న 5 కిలోమీటర్ల లిడ్ తో బిల్ రికార్డు చేసి ప్రభుత్వ ధనం వృధా చేశారని,మోతె, అక్లుర్, పచ్చల నడుకుడ చెక్ డ్యామ్ లు తెగి సాగు భూములు కొట్టుకోవడం మిగిలిన ప్రాంతాల్లో పంట నష్టం తో పాటు చేతికొచ్చిన మొక్కజొన్న నీటిపాలైన ఇప్పటి వరకు అధికారులు ఏ విధముగా వారిని అదుకోలేకపోయారని ఆయన విమర్శించారు. పెద్ద వాగు, కప్పుల వాగు చెక్ డ్యామ్ ల టెండర్లు పిలవడం లో అవినీతి జరిగిందని,20 పనులకు కేవలం మూడు పనులకు మాత్రమే ఎక్కువ సంఖ్యలో టెండర్లు రావడం అందులో 18.29% నుండి 21.25% తక్కువ కు కోడ్ చేయడం వలన ప్రభుత్వం కు ఆదాయం వచ్చిందని,9 పనులకు ఇద్దరు మాత్రమే టెండరు వేసే విధముగా చేసి. 4 పనులకు 3.69% ,5 పనులకు 3.33% ఎక్కువతో బి ఎల్ జి ప్రాజెక్టు కు వచ్చే విధముగా అధికారులు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసినారని,మిగిలిన 8 పనులకు కేవలం ఒక్క టెండర్ వచ్చే విధముగా చేసి 6 పనులను 0.19% తక్కువకు సరళ ప్రాజెక్ట్ కంపెనీకి, 2 పనులు బి ఎల్ జి ప్రాజెక్ట్స్ 0.09% తక్కువకు వచ్చే విధముగా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా గుత్తేదారు తో అధికారులు కలిసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేశారని,టెండర్లు అప్పచెప్పడంలో జరివిన అవినీతి మీద పూర్తిగా విచారణ జరిపి దీని వెనక ఎవరెవరు ఉన్న రో వెలికి తీసి బాద్యుల మీద చర్యలు తీసుకోవాలని,ఇలా టెండర్ల లో అవినీతి, చేసిన పనులలో నాణ్యత లోపం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకు నష్టం వాటిల్లిందని,దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని , నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా పాలన అధికారికి ఇదివరకే వినతిపత్రం ఇచ్చిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని,ఇప్పటికైనా టెండర్లలో జరిగిన అవినీతి పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.అలాగే సాగు భూమి పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం తో పాటు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని,నాణ్యత లోపం తో నిర్మించిన పచ్చల నడుకుడ,వేల్పూర్, మోతె, అక్లుర్ పనుల తో పాటు అన్ని పనుల మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్ స్పందించకపోతే మేమే విజిలెన్స్ కు, అలాగే న్యాయ పోరాటం చేస్తామని అన్వేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, కార్పోరేటర్ రోహిత్ ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, గంగారెడ్డి, నగర ఎస్సి అధ్యక్షులు వినయ్ ,సాగర్ ప్రమోద్ పాల్గొన్నారు.

 

Spread the love