గుజార‌త్‌లో అంత ఈజీ కాదు

– గత ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలిచిన బీజేపీ
– కమలాన్ని దడ పుట్టిస్తున్న అంతర్గత పోరు, ఠాకూర్ల నిరసనలు
– గిరిజనుల ఆందోళనలు కూడా
– కాంగ్రెస్‌, ఆప్‌ అవగాహనతో ‘ఇండియా’ బలోపేతం
– రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం
హేమలత
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా సొంత ఇలాకా గుజరాత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అన్ని సీట్లనూ తమ వశం చేసుకుంది. కాగా ఈ మారు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. గతంలో మాదిరి బిజెపి గెలుపు నల్లేరుమీద నడక కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌, ఆప్‌, బిటిపిల మధ్య ఓట్లు చీలిపోవడంతో బిజెపి గెలుపు సులువైంది. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో ఇండియా బ్లాక్‌లో భాగంగా కాంగ్రెస్‌, ఆప్‌ కలసి బరిలోకి దిగడంతో బిజెపిలో వణుకు మొదలైంది. కొందరు బిజెపి అభ్యర్దులు పోటీ నుంచి విరమించుకున్నారు. అంతేకాదు, కుట్రలు పన్ని ప్రత్యర్ధులను నామినేషన్ల సమయంలోనే తప్పించే ఎత్తులు వేసింది. అందుకు ప్రత్యక్ష ఉదారణ సూరత్‌లో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవం. సర్పంచ్‌, వార్డు మెంబర్‌ వంటి వారి ఎన్నిక ఏకగ్రీవం కావడం కద్దు. ఒక ఎంపి స్థానంలో అభ్యర్ధులందరి నామినేషన్లూ స్క్రూటినీలో పోయి ఒక్క బిజెపి అభ్యర్థిది మిగలడం, ఎన్నిక ఏకగ్రీవం కావడం గమనార్హం.
గిరిజన ఓట్లపై కాంగ్రెస్‌ దృష్టి
గిరిజన ప్రాబల్యమెక్కువున్న భరూచ్‌ స్థానంలో కాంగ్రెస్‌కు పట్టు ఉండేది. కానీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌ గిరిజన నేతలు బిజెపిలోకి ఉడాయించారు. బిటిపి పార్టీ అధ్యక్షుడు మహేష్‌ వసావా బిజెపిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భరూచ్‌ నియోజకవర్గం పరిధిలోని డేడియాపాడా సీటును ఆప్‌ గెలుచుకుంది. కాబట్టి భరూచ్‌లో ఆప్‌ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. రాహుల్‌ జోడో యాత్ర ఈ గిరిజన ప్రాంతాల గుండానే కొనసాగింది. బిజెపి అభ్యర్థి మన్‌సుక్‌భారు వసావాకు ఆప్‌ చైతర్‌ వసావా గట్టి పోటీ ఇవ్వనున్నారు. కేజ్రివాల్‌ అరెస్టు అవ్వడంతో ఆయన సతీమణి సునీత, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ కేంద్రమంత్రులు ఆపార్టీ తరుఫున ప్రచారం చేస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాల్లో ఆప్‌ 5, కాంగ్రెస్‌ 17, బిజెపి 156 స్థానాలను గెలుచుకున్నాయి. స్థానిక సంస్థల్లో ఓబీసిల 10 శాతం రిజర్వేషన్‌ను 27 శాతానికి బిజెపి క్యాబినెట్‌ పెంచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం సీట్లను బిజెపి గెలుచుకోగా, బిజెపి 62.21 శాతం, కాంగ్రెస్‌ 32.11 శాతం ఓట్లు సాధించాయి.
బిజెపికి నిరసనల సెగ
బిజెపి ఐదు సిట్టింగ్‌లను మార్చింది. జునాగఢ్‌ స్థానంలో పార్టీ అభ్యర్థిని మార్చాలని అరడజను మంది నాయకులు రాష్ట్ర బిజెపి చీఫ్‌ సిఆర్‌ పాటిల్‌ను సోషల్‌మీడియా ద్వారా కోరారు. రంజన్‌ భట్‌ వడోదరా అభ్యర్థిని మార్చారు. రాజ్‌కోట్‌ అభ్యర్థి వ్యాఖ్యలతో రాజ్‌పుత్‌ల ఆగ్రహానికి గురయ్యారు. సబరికాంతలో బిజెపి అభ్యర్థిపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా ఠాకూర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేడంతో రూపాలకు రాజ్‌కోట్‌ టిక్కెట్‌ ఇవ్వొద్దని ఠాకూర్లు నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాదు, ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయొద్దని తీర్మానించారు. ఠాకూర్ల ఓట్లతో గెలుస్తున్న బిజెపికి ఈ పరిణామం మింగుడు పడట్లేదు. అమ్రేలీలో సిట్టింగ్‌ ఎంపి నారాన్‌ కచ్చదియా, కొత్త అభ్యర్థి భారత్‌ సుతారియిల మద్దతుదారులు బాహాటంగానే తలపడడంతో పార్టీలో అంతర్గత పోరు బయటపడింది. అర్హతను బట్టి కాకుండా కులం ప్రాతిపదికగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తుండటంతో అభ్యర్థుల్లో అసంతృత్తి నెలకొంది. బిల్కిస్‌బానో కేసులో దోషులను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర జనాభాలో 38 శాతం పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు నీతిఆయోగ్‌ వెల్లడించింది. పట్టణాలే తప్ప గ్రామాల అభివృద్ధి మరచింది. జింక్‌ స్మెల్టర్‌ ప్రాజెక్టు కోసం గిరిజనుల భూముల సేకరణపై వ్యతిరేకత కొనసాగుతోంది. ఇత్యాది ప్రతికూలాలు బిజెపిని వెంటాడుతున్నాయి.
26 స్థానాలకు మే 7న పోలింగ్‌
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు మూడోవిడతలో ఒకేసారి మే 7న పోలింగ్‌ జరగనుంది. ఎంపి ఎన్నికలతో పాటుగా ఐదు అసెంబ్లీ స్థానాలకూ అదే రోజున ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 22న నామినేషన్లు ముగిసేనాటికి మొత్తం 491 మంది లోక్‌సభకు, 39 మంది అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ 24 స్థానాలోనూ, ఆప్‌ రెండు స్థానాలోనూ పోటీ చేస్తున్నాయి. భరూచ్‌, భవనగర్‌ అనే రెండు ఆప్‌ స్థానాల్లో చైతర్‌ వసావా, ఉమేష్‌ మక్వానాలు పోటీపడుతున్నారు.

Spread the love