ఒకరికి ఒకరుగా…

జీవితంలో దంపతుల్లో చిన్న చిన్న మనస్పర్థలు సర్వసాధారణం. భాగస్వాములిద్దరూ ఒకరి ఒకరుగా ఉంటేనే ఎంతటి సమస్య అయినా, కష్టాన్నైనా పారద్రోలి… బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే దంపతుల్లో ఒకరిపట్ల ఒకరికి ఎక్కువ సానుకూలత ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఇంటి పనుల్లో షేరింగ్‌ చాలా ముఖ్యం. దీనితో పాటు ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. అలా కాకుండా ఒకరినొకరు నిందించుకుంటే సమస్య మరింత జఠిలమవుతుంది. సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తే ఎలాంటి మార్గాలున్నాయో తెలుసుకుందాం…

కూర్చుని మాట్లాడుకోవాలి : సమస్య ఏదైనా సరే ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్యా వచ్చినదైనా, బయటి నుండి వచ్చినదైనా సరే కలిసి కూర్చుని చర్చించుకుంటేనే పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా ఒకరినొకరు నిందించుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
కలిసి పనులు : ఉరుకుల పరుగుల జీవితంలో మీకంటూ ప్రత్యేకంగా సమయం దొరక్కపోవచ్చు. ఆఫీస్‌ హడావుడిలో పడి చిన్న చిన్న సంతోషాలకు దూరమై వుంచొచ్చు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి కచ్చితంగా కొంత సమయం కేటాయించుకోవాలి. ఇంటి పనుల్లో ఇద్దరూ భాగస్వాములు కావాలి. అన్ని పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపే కాదు విసుగు కూడా వుండదు. ఇది ఇద్దరి మధ్య ప్రేమా ఆప్యాయతలను మరింతగా పెంచుతుంది.
పుస్తకాలు : ఎంత లేదనుకున్నా, ఎంతో కొంత ఒత్తిడి కచ్చితంగా వుంటుంది. నచ్చిన పుస్తకాలు చదువుతుంటే కొంత స్వాంతన ఉంటుంది. చదివిన పుస్తకాల మీద ఒకరి భావాలు ఒకరు పంచుకోండి. అప్పుడు ఈ ఒత్తిడి నుండి దూరం కావొచ్చు.
విసుగు లేకుండ : ఒత్తిడి కారణంగా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా విసుగు పుడుతుంది. అలాంటి సమయంలో విసుగును పొగొట్టుకునే ఆలోచనలు చేయాలి. ఇద్దరూ కలిసి ఇష్టమైన సినిమాలు చూడటం, రుచికరమైన వంటకాలు కలిసి తయారు చేసుకోవడం చేస్తుండాలి. అభిరుచుల్ని బట్టి ఇండోర్‌ గేమ్స్‌ వంటివి కూడా ఆడినా విసుగు లేకుండా ఉంటుంది.
మానసిక ధైర్యం : సమస్య ఎదురైనపుడు మొదట నిందించుకోకూడదు. ఈ సమయంలో మానసిక ధైర్యం చాలా ముఖ్యం. సమస్య ఎవరికి వచ్చినా ఇద్దరిదిలా ఉండాలి. భాగస్వామిని నిందిస్తూ మాట్లాడితే సమస్య మరింత జఠిలమవుతుందే తప్ప పరిష్కారం దొరకదు. మీరు తోడు ఉన్నారనే మానసిక ధైర్యం భాగస్వామికి చాలా ఓదార్పునిస్తుంది. సమస్యను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని అందిస్తుంది.
అభిరుచులకు అనుగుణంగా : అందరిలో ఏదో ఒక సృజన తప్పక ఉంటుంది. భాగస్వామిలో ఉన్న అభిరుచిని గుర్తించి, దాని మీద ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సహించాలి. పాడటం, నత్యం, సంగీతం, పెయింటింగ్‌ వంటివి ఆసక్తి ఉంటే… బయటకు వెళ్ళి ప్రత్యేకంగా క్లాసుల్లో చేరి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అందుబాటులో వుంది, యూట్యూబ్‌ సహాయంతో మీకు నచ్చినవి నేర్చుకోవచ్చు.
మధురక్షణాలు : పాత ఫొటోలు, పెండ్లి నాటి వీడియోలను మళ్లీ చూడండి. ఇలా చేస్తే మీ సమయాన్ని మీరు ఆస్వాదించడంతో పాటు ఆ క్షణాలను మరింతగా ఆనందించవచ్చు. ఇద్దరూ కలిసి గడిపి మధురక్షణాలను గుర్తు చేసుకుంటే, ఇది మనసును మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా మారుస్తుంది.
ప్రేమ వ్యక్తం : భాగస్వామిపై మీకెంత ప్రేమ ఉందో వ్యక్తం చేయండి. అందుకోసం అవతలి వారికి ఇష్టమైన వస్తువులను సర్‌ప్రైజింగ్‌గా ఇవ్వడం, నచ్చినవి తెలుసుకుని తీసుకురావడం వంటి సర్‌ప్రైజింగ్‌లు ఉంటే, జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి సానుకూలత పెరిగి ప్రేమ మరింత బలోపేతం అవుతుంది.శీ
ఈ విధంగా బంధాన్ని బలోపేతం చేసుకుంటూ, క్లిష్ట సమయంలోనూ తోడుగా ఉంటే… ఎంతటి స్పర్థలైనా ఇట్టే తొలిగిపోతాయి.

Spread the love