జీ20.. 15 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్న ప్రధాని..!

నవతెలంగాణ -ఢిల్లీ: భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ నగరం ముస్తాబైంది. ఈ నెల 9-10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్‌కు తరలిరానున్నారు.  ఈ శిఖరాగ్ర సదస్సు వేళ ప్రధాని మోడీ బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. సదస్సుకు వచ్చే ప్రపంచ నేతలతో సుమారు 15కు పైగా ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా శుక్రవారం మోదీ తన అధికారిక నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వర్గాలు తెలిపాయి. మారిషన్‌ నేతలతోనూ మోడీ భేటీ కానున్నట్లు వెల్లడించాయి. ఇక శనివారం రోజున సమ్మిట్‌ మధ్యలో యూకే, జపాన్‌, జర్మనీ, ఇటలీ నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.
జీ-20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రత వలయంలో ఉంది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలో భారీగా ఆంక్షలు విధించారు. ఢిల్లీ సరిహద్దు రాష్ర్టాల నుంచి రాకపోకలను నిలిపివేశారు. బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. నగర రోడ్లలో లక్ష మంది పోలీసులతో నిరంతరం పహారా కాస్తున్నారు. స్నైపర్‌ శునకాలు, ఏఐ కెమెరాలు, జామర్లు వినియోగించి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు డ్రోన్లు, ఫైటర్‌ జెట్లను ఉపయోగించి పహారా కాస్తున్నారు.

Spread the love