ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

– జలమండలి ఎండీ దానకిశోర్‌
– జలమండలిలో వార్డు అసిస్టెంట్లకు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ మహానగరంలో తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వార్డు అసిస్టెంట్లు పని చేయాలని ఎండీ దానకిశోర్‌ సూచించారు. వివిధ వార్డుల్లో పని చేయడానికి ఎంపిక చేసిన అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జలమండలిలో శుక్రవారం నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ దానకిశోర్‌ పాల్గొని మాట్లాడారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా వార్డు అసిస్టెంట్లు పని చేయాలన్నారు. జలమండలికి ఇప్పటికే కస్టమర్‌ కేర్‌ సెంటర్‌, ఆన్‌లైన్‌లో ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. వీటికి తోడు ప్రజలు ఇచ్చే పిటిషన్లను సంబంధిత సెక్షన్‌ మేనేజర్‌ దృ ష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. అంతేకాకుండా ఫిర్యాదులను ఎంసీసీలో నమోదుచేసి, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో నమోదయ్యే తాగునీటి, సీవరేజీ సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఇతర శాఖల సమన్వయం చేసుకుంటూ త్వరితగతిని పరిష్కరించడానికి కృషిి చేయాలన్నారు. హైదరాబాద్‌ నగర వాసుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం త్వరలో వార్డు వ్యవస్థను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతీ 50 వేల మంది జనాభాకు ఒక వార్డు ఏర్పాటు చేయనుంది. అన్ని శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు ఒకే చోట ఇచ్చేందుకు దీన్ని తీసుకొస్తుంది. ఇందులో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి జలమండలి నుంచి ఒక వార్డు అసిస్టెంట్‌ను నియమించనున్నారు. వీరు ప్రజల నుంచి సంబంధింత ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. ఎంపిక చేసిన వార్డు అసిస్టెంట్లకు ఖైరతాబాద్‌ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో వీరు పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తదితరల అంశాల గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌ బాబు, రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌. ప్రవీణ్‌ కుమార్‌, సీజీఎంలు మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, వినోద్‌ భార్గవ, శ్రీధర్‌, జీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love