అపహాస్యం

అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గత కొద్దిరోజులుగా సాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య మొదలైన యుధ్ధం చిలికి చిలికి గాలివానలా మారి, మంత్రులు, ఎమ్మెల్యేలకు తగులుకుంది. తగదునమ్మా అంటూ సందెట్లో సడేమియలా, ప్రాపకం కోసం చిన్నాచితక గల్లీ లీడర్లు సైతం ఇందులో తల దూర్చుతున్నారు. అసలు విషయమేమిటంటే బీఆర్‌ఎస్‌ను పుట్టి ముంచిన మేడిగడ్డ నుంచి మొదలై ఇరు పార్టీల నేతల రాజీనామాల వరకు సాగింది. ఒక్క సీటు గెలిచి చూపించూ అని ఒకరంటే, నువ్‌ గెలిచిన పార్లమెంట్‌ నియోజకవర్గంలో బోనీ కొట్టలేదని కౌంటర్‌…. దమ్ముంటే రాజీనామా చేయాలని ఒకరంటే… సిద్దమని మరొకరూ…వైరి పక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. విద్యా, వైద్యం, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు, ఆపదకు, సంపదకు తమ వెన్నంటే ఉంటారని అధికార పీఠం కట్టబెట్టారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామాల రాజకీయాలకు పాల్పడుతున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రజలెన్నుకున్నది ఐదేండ్లు అండగా ఉంటారనే తప్ప, ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు కాదు. ఇప్పటికైనా డ్రామాలకు తెరదించి క్షేత్ర స్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెడితే మరోసారి పట్టం కడుతారు. లేకుంటే ఇంటికి పంపడం ఖాయం.
– ఊరగొండ మల్లేశం

Spread the love