పెరుగుతున్న బంగారం ధరలు..తగ్గుతున్న..

నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. రోజురోజుకీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, ఆభరణాలు చేసే స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 26వ తేదీ వరకే శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరల కారణంగా శుభకార్యాలు నిర్వహించే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నూతన వధూవరుల కోసం బంగారు ఆభరాణాలు తయారు చేయించే విషయంలో తమ ఆర్థిక అంచనాలు తలకిందులవుతున్నాయని పలువురు వాపోతున్నారు.
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారి ఇంట్లో ప్రస్తుతం పెండ్లి సంబంధం కుదిరితే బంగారం కొనుగోలు విషయంలో భయపడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా పుస్తె, మెట్టెలు కొనాలన్నా సుమారు రూ.40 వేలు అవుతుంది. ఆభరణాలు చేయించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సిందే. కొంత మంది ధర తగ్గితే బంగారం కొనుగోలు చేద్దామని నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకీ ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే సందేహం కొనుగోలు దారులు, స్వర్ణకారుల్లో నెలకొంటోంది. పసిడి ధరల్లో అనూహ్య పెరుగుదల వల్ల కొనుగోలుదారులతో పాటు స్వర్ణకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.62 వేలు ఉంటే ప్రస్తుతం రూ.76 వేల పైచిలుకు చేరింది. గత ఏడాది పెండ్లిడ్ల సీజన్‌లో రోజుకు ఐదు తులాల విక్రయాలు చేశాం. ఈసారి రోజుకు తులం కూడా విక్రయించడం గగనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. ధరలు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు.

Spread the love