నవతెలంగాణ – హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులకు కొత్తగా తీసుకొచ్చిన విధానం ఓ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించి అండగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో జగిత్యాల డిపోనకు చెందిన కండక్టర్ సత్తయ్య జగిత్యాల నుంచి వరంగల్‌కు టీఎస్‌ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ సత్తయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఇంటికి పెద్దదిక్కుకోల్పోవడంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. అయితే సంస్థ ఇటీవల ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను యూబీఐకి మార్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సత్తయ్య కూడా అకౌంట్, రూపే కార్డు పొంది ఉండడంతో ప్రమాద బీమా కింద రూ.40లక్షలు. రూపే కార్డు కింద మరో 10లక్షలను మొత్తం రూ.50లక్షల ఆర్థిక ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా మంగళవారం బస్ భవన్‌లో సత్తయ్య కుటుంబ సభ్యులకు సంస్థ ఎండీ సజ్జనార్ చెక్కులను అందజేశారు. కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సజ్జనార్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ ,యూబీఐ జనరల్ మేనేజర్ పి. క్రిష్ణణ్ రీజినల్‌హెడ్ డీ. అపర్ణరెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జీవీ మురళీ కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.