నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఈటలను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఈటల హత్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పారు. తన భర్త హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తనకు తెలిసిందని అన్నారు. కేసీఆర్ అండ చూసుకుని కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. పదవుల కోసం ఈటల తలవంచరని అన్నారు. ఈటల బీజేపీలోనే ఉంటారని… ఆయన పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.