నవతెలంగాణ – విశాఖపట్టణం
విశాఖపట్టణం జిల్లా తగరపువలస జాతీయ రహదారికి సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సర్వత్ర చర్చనీయాంశమైంది. తొలుత ఆమెపై లైంగికదాడికి పాల్పడిన నిందితులు, ఆపై అత్యంత క్రూరంగా హింసించి చంపేశారు. గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడివున్నట్టు ఈ నెల 11న రాత్రి భీమిలి పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అనంతరం జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలిని విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 32 ఏళ్ల వివాహితగా గర్తించారు. ఆమెపై తొలుత లైంగికదాడికి పాల్పడి ఆపై అత్యంత క్రూరంగా హింసించి చంపినట్టు ఒంటిపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు నిర్దారించారు. ఆమెను అంత దారుణంగా హింసించి ఎందుకు చంపారన్న విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె తన గ్రామ సమీపంలోని కంపెనీలో పనిచేసేవారని, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.