జులై 6న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నిక

నవతెలంగాణ – హైదరాబాద్
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) ఎన్నికను జులై 6న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ వెల్లడించారు. భారత రెజ్లింగ్​ సమాఖ్య ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అంతకుముందు భారత ఒలింపిక్​ సంఘం వెల్లడించింది. అందులో భాగంగా ఎన్నికల రిటర్నింగ్​ అధికారిని నియమించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ లేఖ రాసింది. అందులో “డబ్ల్యూఎఫ్‌ఐ కార్యనిర్వాహక కమిటీని నియమించేందుకు ఎన్నికలను నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించింది. ఇందుకోసం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను చేపట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహాయ రిటర్నింగ్‌ అధికారితోపాటు మరికొంత మంది సిబ్బంది మీకు తోడుగా ఉంటారు” అని పేర్కొంది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించేందుకు ఐఓఏ ఎన్నికకు సిద్ధమైంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై ప్రస్తుతం దిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారంలోగా దిల్లీ ట్రయల్‌ కోర్టుకు అందించాల్సి ఉంది.

Spread the love