నవతెలంగాణ-తుంగతుర్తి
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం,లారీల కొరత,మిల్లుల వద్ద అన్లోడింగ్ ఆలస్యం కావడం వల్ల,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్ అన్నారు.శనివారం మండల పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి,రైతులు ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు.
అధికారులు చెప్పేది ఒకటి,క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటని అన్నారు. రోజుల తరబడి ధాన్యం కల్లాలలో ఉండటం వలన, బాగా ఎండి తేమశాతం 13 లోపే రావడం వలన, నూకగా మారుతుందని,దీన్ని సాకుగా చూపుతూ మిల్లర్లు క్వింటాకు రెండు మూడు కేజీలు తరుగు తీస్తున్నారని,లేనియెడల లారీని అన్లోడ్ చేయకుండా తిరిగి పంపుతామని చెప్పడంతో గత్యంతరం లేక మిల్లర్ల కండిషన్లకు ఒప్పుకొని అన్లోడ్ చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు మండల జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ ఫలితం శూన్యమని రైతులు తెలిపారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఆపాలని,ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట రైతులు తదితరులు పాల్గొన్నారు.



