తెలంగాణ కొందరి చేతుల్లో బందీ

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ది చెప్తారు
కర్నాటక మాదిరే తెలంగాణలో ఫలితాలు
మాజీ ఎమ్మెల్యే మల్ల‌రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో చేరిన సుబ్బూరు పాండు దంపతులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయ్యిందని, వారి నుంచి త్వరలోనే విముక్తి కానుందని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సుబ్బూరు పాండు దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మల్ల‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం కొందరి చేతుల్లో బందీ అయ్యిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు నిలువ నీడ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎందుకు ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కూడా ఇవ్వలేక పోయారని ప్రశ్నించారు. అదనపు పింఛన్‌ మంజూరుచేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వ భూముల కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పేదలకు ఇచ్చే భూములు కాజేస్తుండ్రని ఆందోళన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.500కే ఉన్న గ్యాస్‌ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1260కి పెంచాయన్నారు. కానీ కర్నాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్‌ అందజేస్తున్నామన్నారు. ఆ ప్రయత్నం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వాల పాలనలో ఆ పార్టీల నాయకులు అధికారులను పని చేయకుండా చేస్తున్నారని విమర్శించారు. బాధలను అనుభవిస్తున్న పేదలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కర్నాటక ఫలితాలు పునరావృతం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజాకంఠక విధానాలు అవలంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. గ్యాస్‌ ధరలను తగ్గిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఈసీ శేఖర్‌ గౌడ్‌, మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆకుల ఆనందు, మండలాధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, కౌన్సిలర్లు మమత, మంగా, మోహన్‌, యువ నాయకులు అభిషేక్‌ రెడ్డి, నాయకులు, గురునాథ్‌ రెడ్డి, మంకల దాస్‌, టిల్లు తదితులున్నారు.

Spread the love