విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నవతెలంగాణ – గంగాధర : గృహ వినియెాగంతోపాటు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని వీఏఎస్ ఫంక్షన్ హాలులో విద్యుత్ విజయోత్సవ ర్యాలీ, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ 2014 కంటే ముందు కరెంటు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలువని పరిస్థితి ఉండేదన్నారు. కరెంట్ కోతల వల్ల రైతులు అర్ధరాత్రి పూట ఎన్నో అవస్థలు పడ్డారని, మోటార్ల దగ్గర పడుకుని పాములు, తేల్లు కుట్టి మరణించిన సందర్భాలు లేకపోలేదన్నారు. యావత్‌ భారత దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. అన్ని రంగాలకు వేసవిలోనూ 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని అన్నారు. స్వతంత్ర భారత దేశంలో విద్యుత్తు రంగంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిందని అన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు ఎన్నో ఏళ్ల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారని, ఆ కష్టాలు ఇక ఉండవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 27 లక్షల రైతుల వ్యవసాయ మోటార్లకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుకు నాణ్యమైన విద్యుత్ సరఫరే నిదర్శనమనిఅన్నారు. ఈ కార్యక్రమంలో కోడిమేల గంగాధర జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఎంపీపీలు రవీందర్, స్వర్ణలత, కవిత, ఏఎంసీ చైర్మన్ లు చొక్కా రెడ్డి, లోకిని ఎల్లయ్య, విద్యుత్ అధికారులు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love