పేదల నివాసాలను క్రమబద్ధీకరించాలి

– కంటోన్మెంట్‌, కేంద్ర సంస్థల భూములపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీపీఐ(ఎం) బహిరంగ లేఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూముల్లోని పేదల ఇండ్లను జీవో 58 ప్రకారం రెగ్యులరైజేషన్‌ చేస్తున్న మాదిరిగానే కంటోన్మెంట్‌, కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల్లోని బస్తీలు, కాలనీల నివాసాలను సైతం క్రమబద్ధీకరించాలని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదల ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 58 అమలు చేస్తున్నదన్నారు. కొందరు మురికివాడల ప్రజలు 2015లో ఈ క్రమబద్ధీకరణతో ఇండ్ల పట్టాలు పొందారని గర్తుచేశారు. ప్రస్తుతం అనేక మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే, నగరంలోని కొన్ని మురికివాడలు కంటోన్మెంట్‌, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలాల్లో ఏర్పడగా.. వేలాది పేద కుటుంబాలు ఈ బస్తీల్లో నివాసముంటున్నాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ వీరికి ఇంటి స్థలం మీద ఎలాంటి హక్కులూ కల్పించడం లేదన్నారు. అనేక మురికివాడలు కంటోన్మెంట్‌, రైల్వే, రక్షణ, ఎయిర్‌పోర్ట్‌ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల్లో ఉన్నాయన్నారు. ఈ బస్తీల్లోని పేదల ఇండ్లను సైతం జీవో 58 మాదిరిగా క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. రైల్వే శాఖకు చెందిన వందల ఎకరాల భూములను దీర్ఘకాలిక లీజ్‌ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం చౌకగా కట్టబెడుతోందన్నారు. పేదలు దశాబ్దాలుగా నివసిస్తున్నా వారికి హక్కు కల్పించకపోవడం దారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల భూముల్లో ఏర్పడిన బస్తీలు, కాలనీల స్థలాన్ని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు.

Spread the love