– కేంద్రం తీరుపై విమర్శలు
న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) డైరెక్టర్ కె.ఎస్ జేమ్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ సర్కారు తీరును తప్పుబట్టాయి. మోడీ ప్రభుత్వం తన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండని వారితో కలిసి పనిచేయదని ఆరోపించాయి. జేమ్స్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడినట్టు పేర్కొంటూ మోడీ సర్కారు అతనిని సస్పెండ్ చేసింది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నిర్వహించిన సర్వేలలో వెల్లడైన కొన్ని డేటా సెట్‌ల గురించి తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం జేమ్స్‌ను రాజీనామా చేయమని కోరిన తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందని సంస్థలోని అధికారి ఒకరు వెల్లడించారు.
అయితే జేమ్స్ తన రాజీనామాను సమర్పించేందుకు నిరాకరించటం గమనార్హం. కేంద్రం ఈ విధంగా దురదృష్టకరమనీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరామ్ రమేష్ అన్నారు. ”జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5 కొన్ని ఫలితాలపై మోడీ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నది. ఈ ఏడాది జూన్ 2023లో ప్రారంభం కావాల్సి ఉన్న ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6ను కేంద్రం నిరవధికంగా నిలిపివేయాలని కోరుకునే అవకాశం ఉన్నది” అని ఆయన తెలిపారు.