అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం: తుమ్మల

నవతెలంగాణ – భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్‌పామ్‌ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో సంస్థపై కరెంటు భారం తగ్గుతుందని చెప్పారు. అశ్వారావుపేటలోని పామాయిల్ పరిశ్రమను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్లాంటు నిర్మాణాన్ని మే నెలలోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్‌లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతం కొబ్బరి, జాజి, మిరియాలు, వక్క తదితర పంటలకు చాలా అనువుగా ఉందని, ప్రభుత్వం నుంచి రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో హార్టికల్చర్‌ కోర్సులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై త్వరలోనే వీసీతో చర్చిస్తానని తెలిపారు.

Spread the love