దిక్కుమాలిన ప్రభుత్వాలకు

వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదాం
మాజీ మంత్రి సంభాని
నవతెలంగాణ-కల్లూరు
ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వలుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 51వ రోజు హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా సోమవారం కల్లూరు పట్టణంలో శాంతినగర్‌ నుండి కప్పలబందం రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాహుల్‌ గాంధీ సందేశాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంబాని మాట్లాడాతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్నారు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లు కావస్తున్న ఇప్పటకీ అమలు చేయకుండా ప్రజలను దగా చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ… దళితుబంధు పేరుతో దళితుల ఓట్ల కోసం రూ.10లక్షల ప్రకటించి అరకొరగా ఇచ్చి దళితులను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు పంట రుణ మాఫీ వంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ప్రతి ఇంటికి ఒకేసారి రైతు రుణమాఫీ రూ.2 లక్షలు, వైద్యం కోసం కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా 5 లక్షలు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు, 18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందజేస్తామన్నారు.కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి కార్యదర్శి కొత్తా సీతారాములు, పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్‌ రెడ్డి, రాష్ట్ర జడ్పిటిసీ సంఘం అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్‌, స్టేట్‌ ఎస్సీ డీపీటీ కన్వీనర్‌ కొండూరు కిరణ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, గోళ్ళ అప్పారావు, ఎంపిటిసి మాదిరాజు లక్ష్మణరావు, మాజీ ఎంపిపి గోపాలస్వామి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, పాయపూర్‌ సర్పంచ్‌ శర్మ, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కొర్రపాటి సాల్మన్‌ రాజు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శివ వేణు, పెనుబల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు, వేంసూరు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్‌ రెడ్డి, తల్లాడ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్‌ ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Spread the love