అమెరికా రుణపరిమితి వివాదం

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెట్టే ఒత్తిడికి తలొగ్గి ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ బడ్జెట్‌ల ద్రవ్యలోటు తమ జీడీపీలో ఒకానొక శాతానికి మించకుండా ఉండాలని చట్టాలు చేశాయి. ఎక్కువ దేశాల్లో ఇది 3శాతంగా ఉంది. మన దేశంలో కూడా అటు కేంద్ర బడ్జెట్‌లో గాని, ఇటు రాష్ట్రాల బడ్జెట్‌లలో గాని ద్రవ్యలోటు జీడీపీలో 3శాతానికి మించివుండకూడదన్న చట్టాలు చేశారు. అయితే, అమెరికాలో ఈ తరహా చట్టం ఏదీ లేదు. దానికి బదులు అక్కడ ప్రభుత్వం చేయగల రుణానికి ఒక గరిష్ట పరిమితిని పెట్టుకున్నారు. ఇది కొంత తేడా వ్యవహారంలా ఉంటుంది. దేశ ఆర్థికవ్యవస్థ పెరుగుతున్నకొద్దీ ఈ గరిష్ట పరిమితిని మార్చుకోవలసివుంటుంది. అందుకే అమెరికాలో 1960 నుంచీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వ రుణ గరిష్ట పరిమితిని 78సార్లు సవరించారు.
ప్రస్తుతం ఈ పరిమితి 31.4లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితి మేరకు ఇప్పటికే ప్రభుత్వ రుణం చేరుకుంది. అందువలన బైడెన్‌ ప్రభుత్వం ఆ రుణ పరిమితిని పెంచమని అమెరికన్‌ కాంగ్రెస్‌ను అనుమతి కోరింది. కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల బలం ఎక్కువ. అందువలన వాళ్ళు రుణపరిమితి పెంపు ఒక మామూలు వ్యవహారంగా పరిగణించడానికి తిరస్కరించారు. రుణపరిమితిని పెంచేబదులు బడ్జెట్‌లో కొన్ని పద్దుల్లో కోతలు పెట్టాలని వాళ్ళు కోరుతున్నారు. ముందు రుణపరిమితిని పెంచడానికి ఒప్పుకుంటే ఆ తర్వాత బడ్జెట్‌లో పద్దులు కొన్నింట్లో కోతల విషయం చర్చించడానికి బైడెన్‌ సంసిద్ధత వ్యక్తం చేశాడు. కాని కోతలకు ఒప్పుకుంటేనే రుణపరిమితి పెంపుదలకు అంగీకరిస్తామన్న రిపబ్లికన్లు షరతు పెట్టారు. దీనికి బైడెన్‌ అంగీకరించలేదు. దీంతో వ్యవహారం ప్రతిష్టంభనలో పడింది. అది గనక పరిష్కారం కాకపోతే బైడెన్‌ ప్రభుత్వం ఇంతవరకూ తీసుకున్న రుణాలమీద వడ్డీ వాయిదాలు చెల్లించ లేక ఎగవేతదారుగా నిలవవలసివస్తుంది. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుంది.
ఇక్కడ రెండు వేరు వేరు అంశాలు ఉన్నాయి. మొదటిది: అసలు ప్రభుత్వం అప్పు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటన్నది. తాను చేయవలసిన ఖర్చుకు కావలసిన ధనాన్ని సమకూర్చుకోడానికి సంపన్నులమీద అదనంగా పన్నులు వేయవచ్చు. అలా చేయకుండా రుణం తీసుకోడానికే మొగ్గు చూపుతోందంటే ఆ ప్రభుత్వం సంపన్నులమీద పన్నులు వేయడానికి సిద్ధంగా లేదని భావించాలి. ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో తక్కిన ప్రపంచంతోబాటు అమెరికాలో కూడా ఆదాయాలలో, సంపదలో అసమానతలు బాగా పెరిగాయి. సంపన్నుల దగ్గర సంపద పెరిగినప్పుడు వారిమీద సంపద పన్ను, కార్పొరేట్‌ లాభాలమీద పన్ను అదనంగా విధించి ప్రభుత్వం తనకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చు కోవచ్చు. అలా సంపన్నులమీద అదనపు పన్ను విధించినంత మాత్రాన సంపదలోని అసమానతలు తగ్గిపోతాయని భావించకూడదు. ఏ దేశపు ఆర్థిక వ్యవస్థలోనైనా, శ్రామిక ప్రజలు తమకు వచ్చే ఆదాయాలకు దాదాపు సరిసమానంగా ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా పొదుపు చేసేది సంపన్నులే. ప్రభుత్వం చేసే అదనపు వ్యయం 100డాలర్లు అనుకుందాం. అందుకోసం ప్రభుత్వం రుణం తీసుకుందనుకుందాం. అప్పుడు ఆ 100డాలర్లూ ప్రభుత్వ వ్యయం తర్వాత సంపన్నుల దగ్గరికే చేరుతాయి. (కాసేపు విదేశీ లావాదేవీలను పక్కన పెడదాం) దాంతో వారు పొదుపు చేసే మొత్తం 100డాలర్ల మేరకు పెరుగుతుంది. దానిని ప్రభుత్వం మళ్ళీ వారివద్దనుండి రుణం రూపంలో తీసుకుంటుంది. ఈ విధంగా ప్రభుత్వం తాను చేసే అదనపు వ్యయానికి రుణం తీసుకోవడం వలన సంపద అసమానతలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. అదే అదనపు వ్యయం కోసం ప్రభుత్వం ఆ సంపన్నులమీద అదనపు పన్నులు విధిస్తే అప్పుడు పన్ను రూపంలో వారివద్దనుంచి వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వ వ్యయం అనంతరం మళ్ళీ వారివద్దకే వచ్చి చేరుతుంది. అంటే అదనపు పన్ను విధించి నందువలన సంపదలో అసమానతలు అంతకు ముందు ఉన్న స్థాయిలోనే యధాతథంగా కొనసాగుతాయి.
అయినా బైడెన్‌ ప్రభుత్వం కాని, రిపబ్లికన్లు గాని సంపన్నులమీద అదనపు పన్నులు వేయడానికి సిద్ధంగా లేరు. అమెరికన్‌ రాజకీయాలమీద బూర్జువా వర్గం ఎంత పట్టు కలిగివుందో దీనిని బట్టి గ్రహించవచ్చు. ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాబట్టాలంటే సంపన్నులమీద అదనపు పన్ను విధించే వీలుందన్న అంశాన్నే వారు పూర్తిగా తమ చర్చల్లో ఎక్కడా లేవనెత్తడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పొందలేని పరిస్థితులు వస్తాయని బైడెన్‌ హెచ్చరిస్తున్నాడే తప్ప సంపన్నులమీద అదనపు పన్ను ప్రస్తావననే ముందుకు తేవడం లేదు. రిపబ్లికన్లు కూడా రుణపరిమితిని పెంచడానికి పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారే తప్ప ఈ ప్రత్యామ్నాయం ఊసే ఎత్తడం లేదు.
ఒక అగ్రగామి పెట్టుబడిదారీ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉండడం ఏ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించదు. అయితే ఇక్కడ మన దృష్టి పడవలసిన అంశం మరొకటి ఉంది. బైడెన్‌ ప్రభుత్వానికి, రిపబ్లికన్లకు మధ్య ఈ తక్షణ సమస్య మీద ఉన్న భిన్నాభిప్రాయం వెనుక వారి వారి ఆర్థిక దృక్పథాలలో, ఆర్థిక వ్యూహాలలో ఉన్న లోతైన తేడాను మనం చూడాలి. ఒకరిది ”ఉదారబూర్జువా” దృక్పథం అయితే మరొకరిది ”సాంప్రదాయ బూర్జువా” దృక్పథం.
ఇందులో మొదటితరహాకి నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ముందుదారి తోచని స్థితిలో చాలా కాలంగా పడివున్న సంగతి తెలుసు. అందుచేత మళ్ళీ కీన్స్‌ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు బడ్జెట్‌ లోటును పెంచడానికి వెనకాడడం లేదు. అందుకోసమే వాళ్ళు (బైడెన్‌ ప్రభుత్వం) ప్రభుత్వ రుణ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఆ విధంగా పెంచే రుణపరిమితి వలన ప్రభుత్వ వ్యయం పెరిగి అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. అయినప్పటికీ, ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలాగైనా సరే అదుపు చేయడం ఒక్కటే లక్ష్యంగా వాళ్ళు భావించడం లేదు. నిరుద్యోగాన్ని ఎంతో కొంత అదుపు చేయడం, ఆర్థిక కార్యకలాపాలను మరింత హెచ్చు స్థాయిలో నిర్వహించడం కూడా ముఖ్యమే అని వాళ్ళు భావిస్తున్నారు. దానికి బదులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని బాగా తగ్గించి దేశం మీద మరింత ఆర్థిక మాంద్యాన్ని రుద్దడం పరిష్కారం అని వాళ్ళు అనుకోడం లేదు.
అదే రెండో తరహాకి చెందినవాళ్ళు, ”సాంప్రదాయ బూర్జువా దృక్పధం”తో ఉన్నవాళ్ళు మాత్రం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం అన్నదొక్కటే తమ ఏకైక తక్షణ లక్ష్యం అని భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యయాన్ని బాగా తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. శ్రామిక ప్రజలకు ఇచ్చే నగదు బదిలీలలో కోతలు పెట్టాలని, వారికి సంబంధించిన సంక్షేమ చర్యలలో కోత పెట్టాలని, ఆ విధంగా జరిగితేనే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు.
కీన్స్‌ తన కాలంలో ఈ ”సాంప్రదాయ బూర్జువా” అవగాహనను ఎదుర్కోవలసివచ్చింది. సంపన్నులమీద అదనపు పన్నులు విధించేబదులు ప్రభుత్వ వ్యయాన్ని పెంచి తద్వారా మార్కెట్‌లో పడిపోతున్న కొనుగోలుశక్తిని ఎంతో కొంతమేరకు నిలబెట్టడం వలన ప్రయివేటు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందీ కలగదని కీన్స్‌ వాదించాడు. కీన్స్‌ పెట్టుబడిదారీ వ్యవస్థను గట్టిగా బలపరిచినవాడు. అయితే బోల్షివిక్‌ విప్లవం ప్రభావం బలంగా ప్రపంచంమీద పడుతున్న కాలంలో అతను ఉన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ గనుక ఎక్కువగా ఉద్యోగాలు కల్పించలేకపోతే అసంతృప్తికి గురయ్యే కార్మికులు సోవియట్‌ విప్లవ ప్రభావానికి లోనై మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థనే కూల్చివేసే ప్రమాదం ఉందని అతను నమ్మాడు. అటువంటి అసంతృప్తికి కార్మికులు లోనుగాకుండా వారిని బుజ్జగించడం ఎంతైనా అవసరం అని అతడు భావించాడు.
ఉదార బూర్జువా దృక్పధానికి సాంప్రదాయ బూర్జువా దృక్పధానికి మధ్య తేడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవడం కోసం బలవంతంగానైనా కార్మికులను అణచివేయడానికి, నిరుద్యోగాన్ని బాగా పెంచివేయడానికి సాంప్రదాయ బూర్జువాదృక్పధం వెనుకాడదు. అదే ఉదార బూర్జువా దృక్పధం అయితే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించడానికి కార్మికుల మద్దతును కూడా పొందాలని ప్రయత్నిస్తుంది. భారీస్థాయిలో నిరుద్యోగం పెరిగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కార్మికులకు సంక్షేమం పేర కొంత ధనం బదిలీ అయేటట్లు చూస్తుంది.
ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ప్రతిష్టంభన వెనుక ఈ రెండు భిన్నదృక్పధాలూ అంతర్లీనంగా ఉన్నాయి. ఉదార బూర్జువా దృక్పధం అమలు జరిగితే ప్రభుత్వ జోక్యం ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా పెరుగుతుంది. అలా జరిగితే పెట్టుబడిదారీ వ్యవస్థలో సద్యోజనితంగా (స్పాంటేనియస్‌గా) వ్యక్తం అయే ధోరణులకు అది ఆటంకం అవుతుంది. (ప్రభుత్వ జోక్యం పెరిగితే పెట్టుబడిదారులు తమ ఇష్టం వచ్చినట్లు దోచుకోడానికి అవరోధాలు కలుగుతాయి) అందుకే ప్రభుత్వ జోక్యం ఉండాలని చెప్పిన కీన్స్‌ విధానాలను నయా ఉదారవాదం మొదట్లోనే పూర్తిగా తోసిపారేసింది. ఇప్పుడు తిరిగి అవే కీన్స్‌ విధానాలను మళ్ళీ అమలు చేయాలని అనుకోవడం, అందునా, నయా ఉదారవాద విధానాలు ముందుదారి కనపడని స్థితిలో దిగబడివున్నప్పుడు కీన్స్‌ విధానాలను అమలు చేయాలని భావించడం మరిన్ని వైరుధ్యాలలోకి వ్యవస్థనునెడుతుంది. ఇప్పుడు కీన్స్‌ విధానాలను అమలు చేయబూనుకుంటే అది మృతశిశువు చందమే అవుతుంది.
అటువంటి వైరుధ్యాలలో కేవలం ఒక్కదానిని మాత్రం నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. అమెరికన్‌ ప్రభుత్వం గనుక అదనంగా అప్పు చేసి దానిని సంక్షేమ కార్యక్రమాలకోసం ఖర్చు చేస్తే, అప్పుడు అమెరికాలో సరుకుల గిరాకీ పెరుగుతుంది. అమెరికన్లు ఉపయోగించే సరుకులలో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా లభిస్తాయి. అంటే ప్రభుత్వ వ్యయం పెరిగితే అది దిగుమతుల పెరుగుదలకు దారి తీస్తుంది. అప్పుడు విదేశీ చెల్లింపులలో లోటు పెరుగుతుంది. దానిని అదుపు చేయడానికి అమెరికా విదేశాలలోని ఎగుమతిదారు లకి తన ప్రభుత్వ బాండ్లను అమ్మవలసివస్తుంది. అలా అమెరికా విడుదల చేసే బాండ్లను విదేశీ ఎగుమతిదారులు తీసుకోడానికి సిద్ధపడాలంటే డాలర్‌ అంతర్జాతీయ రిజర్వుకరెన్సీగా తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవలసి వుంటుంది.
ఇప్పుడు అమెరికా డజన్లకొద్దీ దేశాలమీద విధిస్తున్న ఆంక్షల ఫలితంగా ఆ దేశాలనుండి తనకు అవసరమైన సరుకులను దిగుమతి చేసుకునే అవకాశాన్ని అమెరికా కోల్పోతున్నది. అందువలన తన దేశంలో వాటిని ఉత్పత్తి చేసుకోడానికి ఎక్కువ ఖర్చు చేయవలసివస్తోంది. అందువలన అమెరికాలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోంది. ఇంకోపక్కన ఆంక్షలకు గురైన దేశాలు తమలో ఒకరితో మరొకరు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఆ ఒప్పందాలలో డాలర్‌ ప్రమేయం లేదు. ఆ యా దేశాల స్వంత కరెన్సీలనే మార్పిడి చేసుకుంటున్నారు. దాని ఫలితంగా డాలర్‌ ఆధిపత్య స్థానం బలహీనపడుతోంది. ప్రస్తుతం ఎటువంటి ఆంక్షలూ ఎదుర్కోని దేశాలు సైతం తమ వద్ద పెద్ద మోతాదులో డాలర్‌ నిల్వలను, (బాండ్ల రూపంలో ఉండే నిల్వలతో సహా) అట్టిపెట్టుకోడానికి సంసిద్ధంగా లేవు. ఒకవేళ భవిష్యత్తులో తమపై కూడా ఆంక్షలు వస్తే అప్పుడు ఈ డాలర్‌ నిల్వలు ఉపయోగపడకుండా పోతాయి. అందుకే డాలర్‌ నిల్వలను పెంచుకోడానికి అందరూ అంత సుముఖంగా లేరు. ఈ కారణాలన్నీ డాలర్‌ బలహీనపడడానికి దారి తీస్తున్నాయి.
అమెరికాలో ఉదారబూర్జువా వైఖరి అవలంబిస్తున్న బైడెన్‌ ప్రభుత్వం మరోపక్కన చాలా ఎక్కువ దేశాలమీద ఆంక్షలు విధించడానికి మొగ్గు చూపిస్తోంది. ఈ ఆంక్షల ఫలితాలు అమెరికాలో ఉదారబూర్జువా దృక్పధాన్ని అమలు చేయడానికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి. ఒకవైపున నయా ఉదారవాదంతో ప్రేరణ పొందిన సామ్రాజ్యవాద ఆధిపత్యధోరణిని సమర్థిస్తూ మరోపక్క కీన్స్‌ సూచించిన ఉదారవాద సంక్షేమ విధానాలను అమలు చేయడం సాధ్యం కాదు. రెండు వేరువేరు దిశల్లో ప్రయాణం చేసే పడవలమీద చెరో కాలునూ ఉంచి ప్రయాణించాలనుకోవడం వంటిదే ఇది.
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love