సెకండ్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత ఏది ?

 What is the job security for second ANMs?– సమ్మెలోకి సెకండ్‌ ఏఎన్‌ఎంలు
– ఎలాంటి పరీక్షలూ లేకుండా రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌
– 10 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు
– సమ్మెలోకి వెళ్లేందుకు పోలీసులకు మోమొరాండం
– కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు
– సెకండ్‌ ఏఎన్‌ఎంల సమ్మెకు సీఐటీయూ మద్దతు
నవతెలంగాణ-కొడంగల్‌
వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు సమ్మె బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత లేదని, ఎలాంటి పరీక్షలు లేకుండా తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెకండ్‌ ఏఎన్‌ఎంలు 10 రోజులుగా సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతూ తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. వైద్యశాఖలో మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా సేవలందిస్తున్నామని వారి తరహాలోనే తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొడంగల్‌, దౌల్తాబాద్‌, బోంరాస్‌ పేట్‌ మండలాల పరిధిల్లో పని చేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆందోళన నిర్వహిస్తున్నారు. కేవలం నెలకు రూ.25 వేల వేతనంతో పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో వేతనం సరిపోక ఏఎన్‌ఎంల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని చెబుతున్నారు, తమను రెగ్యలరైజ్‌ చేసేంతవరకు పోరాటాలను ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు, వీరికి సీఐటీయూ కార్మిక సంఘం మద్దతుతో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు,
సెకండ్‌ ఏఎన్‌ఎంల విధులు
వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్దతిలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు, ప్రజలకు వైద్యసేవలందించడంలో వీరి పాత్ర క్రియాశీలకమని చెప్పొచ్చు. ఇటు ఆశా వర్కర్లు, అటు మొదటి ఏఎన్‌ఎంల విధులను కూడా సెకండ్‌ ఏఎన్‌ఎంలు నిర్వర్తిస్తారు, మహిళలు గర్భవతి అయిననాటి నుంచి మొదలుకుని వారి పేరు నమోదు చేసుకుని పీహెచ్‌సీల్లో చెకప్‌ చేయించడంతో పాటు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరి అయ్యేలా అవగాహన కల్పించి ఆపై డెలివరి కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అందే పథకాలను వివరిస్తారు. అంతే కాకుండా డెలివరి అయి పుట్టిన పిల్లలకు వారి ఆరోగ్యానికి సంబంధించిన సేవలు వీరే అందిస్తారు .ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, నైట్‌ డ్యూటీలు చేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. జ్వరసర్వే, టీబీ, ఫైలేరియా వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు సర్వేలు, పరీక్షలు నిర్వహిస్తారు.
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి
కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సెకండ్‌ ఏఎన్‌ఎంలు విధులు నిర్వర్తించారు. 2020 మార్చిలో ఆరంభమైన కరోనా వ్యాప్తి దాదాపుగా రెండేండ్లలకు పైగానే భయబ్రాంతుకు గురి చేసే అనేక కేసులు నమోదవడంతో పాటు మృతిచెందారు. కరోనా వచ్చిదంటే అటు వీధిగుండా వెళ్లాలంటేనే ప్రజలు భయబ్రాంతులకు గురైన సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారికి టెస్టులు నిర్వహించి కిట్‌లను అందిస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడి కరోనాను అరికట్టడంలో ముఖ్య భూమిక పోషించారు. అనేక నెలల పాటు కరోనా వ్యాక్సినేషన్‌లు మొదటి, రెండవ, బూస్టర్‌ డోసులు వేశారు. గ్రామాలు, తండాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టెందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ కరోనా వారియర్స్‌గా నిలిచారని చెప్పకతప్పదు.
11 రోజులుగా ఆందోళనలు
తమను రెగ్యులరైజ్‌ చేయాలని సెకండ్‌ ఏఎన్‌ఎంలు 10 రోజులుగా సమ్మెబాట పట్టి వివిధ రూపాలోల ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 4 నుంచి సమ్మెకు వెళ్లారు. తొలి రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా సెకండ్‌ ఏఎన్‌ఎంలను హైదరాబాద్‌కు తరలకుండా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆపై జిల్లా కలెక్టరేట్‌ ఆందోళనలు చేపట్టి ఏన్‌ఎంలు తమ వినతులను జిల్లా కలెక్టర్‌కు అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఆపై ర్యాలీలు, ఎమ్మెల్యేలకు వినతీలు ఇలా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ తమ డిమాండ్‌ ప్రభుత్వనికి తెలుపుతున్నారు. ఎలాంటి పరీక్షలూ లేకుండా ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేరేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలి
వైద్యఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో పని చేస్తున్న సెకండ్‌ ఏన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలి. 10 రోజులు సమ్మెలో భాగంగా ఆందోళనలు చేపడుతున్నాం. చాలీచాలనీ వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలను ప్రభుత్వం గుర్తించి రెగ్యులరైజ్‌ చేసి సెకండ్‌ ఏఎన్‌ఎంల కుటుంబాలను ఆదుకోవాలి, తమ డిమాండ్‌ నేరవేరేంత వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తాం.
బుస్స చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు

Spread the love