నవతెలంగాణ-హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఉఖ్రుల్ జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేపడుతున్నారు. వీరి ధర్నా నేడు కూడా కొనసాగుతోంది. ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మునపటిలా శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని గిరిజన ఐక్యత కమిటీ డిమాండ్ చేసింది. కొండ జిల్లాల మాదిరిగానే మణిపూర్‌లోని అన్ని లోయ జిల్లాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏని విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ‘మేము కేంద్రాన్ని అడగాలనుకుంటున్నాము. రాష్ట్రపతి పాలన విధించలేకపోతే, ఆర్టికల్ 355 విధించడం గురించి ఏమిటి..? ఇటీవలే తొలగించిన ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏని వీలైనంత త్వరగా తిరిగి అమలు చేయాలని మేము కోరుకున్నాము. లిటన్ ప్రాంతం నుండి అస్సాం రైఫిల్స్ తొలగింపు (ఉఖ్రుల్‌లో) నిన్న హత్య జరగడానికి ఒక కారణం’ అని గిరిజన ఐక్యత కమిటీ మీడియా సెల్ కోఆర్డినేటర్ అన్నారు.