దిగజారుతున్న రాజ్యాంగ స్ఫూర్తి – ఒక పరిశీలన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ”జాతీయ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ చట్ట సవరణ బిల్లు” పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది. భారత రాజ్యాంగంలో సమైఖ్య నిర్మాణాన్ని గురించి స్పష్టమైన లిఖిత అధికరణాలున్నాయి. ఇవి సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రాజ్యాంగపరంగా ఇవ్వబడిన అధికార నియమ, నిబంధనల మేరకే అవి నడుచుకోవాలి. ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వస్తే, అది పాలనా వ్యవస్థను గందరగోళంలో పడవేసి వ్యవస్థను స్తంభింపజేస్తుంది. ఇంత పెద్ద దేశంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు రూపొంధించిన చట్టాలు సక్రమంగా అమలు కావాలంటే పాలనాపరమైన వ్యవస్థా నియమాలు (ఆర్గనైజేషనల్‌ సిస్టమ్‌ ప్రిన్సిపుల్స్‌) ఆ పాలనా వ్యవస్థలో భాగమైన ప్రతి విభాగం, సిబ్బంది తప్పక వాటిని పాటించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘బిల్లు’ దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ఎన్నికైనటువంటి మంత్రివర్గ అధికారాలను నిర్వీర్యం చేసేందుకు ఉద్ధేశింపబడింది. ప్రభుత్వం అధికారుల పోస్టింగులపై, బదిలీలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)కి సంపూర్ణ నియంత్రణను మంజూరు చేసేందుకు ఉద్దేశించింది. దీనిని అనుమతించినట్లయితే ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వబడిన ప్రజాస్వామ్య అధికారం బలహీనమైపోతుంది. భారత రాజ్యాంగాల్లో పొందుపరచబడిన కేంద్ర-రాష్ట్ర సూత్రాలకు అది సంపూర్ణంగా విరుద్ధమైనది. రాజ్యాంగంలోని ఒకటో అధికరణం భారతదేశం ”రాష్ట్రాలు యూనియన్‌”గా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్వచనం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఒక ‘ఆర్గానిక్‌ లింక్‌’ వంటిది. భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన’దేశ ఐక్యత’ను ఇది సూచిస్తుంది. సహకార సమాఖ్య (కోపరేటీవ్‌ ఫెడరల్‌) స్ఫూర్తిని కలిగివుంది.
రాష్ట్రాలలో సమర్థవంతమైన పాలన అందించడానికి ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 239 ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటరీ (ఎన్‌సీటీడీ) ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం (యూనియన్‌ టెరిటరీ) అయినప్పటికీ, రాష్ట్రస్థాయితో సమానమై నటువంటి హోదాను అది మంజూరు చేస్తున్నది. ఈ ప్రత్యేక నిబంధన ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వివిధ పరిపాలన విషయాలపై గణనీయమైన అధికారాలను కలిగి ఉండేలా చేస్తుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల ఓటుద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి ఉద్యోగ బృందంపై పూర్తి అధికారాలుంటాయి. ఉద్యోగులను నియమించటం, ప్రమోషన్లు ఇవ్వటం, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, అవార్డులు, రివార్డులను ప్రకటించటం, సస్పెండ్‌ చేయటం, అవసరమైతే పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించటం మొదలైన క్రమశిక్షణాయుతమైన పాలనాపరమైన అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వానికి లోబడి బాధ్యత వహించాలి. ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ఇది ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో భాగం. ఇదే విషయాన్ని 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ పరిపాలన వ్యవస్థ స్వరూప, స్వభావాన్ని నొక్కి చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఇతర రాష్ట్రాలలో గవర్నర్‌కు ఉన్న విధి, విధానాలే వర్తిస్థాయి. అంతకు మించి అదనపు అధికారాలు, హోదా ఉండవు. 2023 మే 1న ఇచ్చిన తీర్పులో ఎన్‌సీటీడీలో అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లపై ఢిల్లీ ప్రభుత్వ అధికారమే అంతిమమని సుప్రీంకోర్టు పునరద్ఘాటించింది.
సుప్రీంకోర్టు సమైఖ్య పాలనా సూత్రాలనే మరోసారి సమర్థించింది. ఇక్కడ ఎన్నికైన ప్రజా ప్రతినిధులకే అధికరాలు, బాధ్యతలు కలిగి ఉంటారు. వారు పౌర సేవకులు. ఓటర్లకు జవాబుదారీగా ఉంటారు. కనుక, లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికైన ప్రభుత్వ శాసన,పాలనా అధికారాల విషయంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రతిపాదిత సవరణ బిల్లు నగరపాలక సంస్థలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి సంపూర్ణ నియంత్రణను కల్పించాలని కోరింది. ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. ఇది దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. నామినేటెడ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ)కి ఎన్నికైన ప్రభుత్వానికి అనవసరంగా పాలనా పరంగా ఘర్షణలు తలెత్తుతాయి. ఎల్‌జీ అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్య వహించే నామినేటెడ్‌ పోస్ట్‌. పరిపాలన వ్యవహారాలపై ‘ఎల్జీ’కి విస్తృత అధికారాలు ఇస్తే, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నామ మాత్రం అవుతుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామిక, అసంబద్ధ చర్య. ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే సమైఖ్య నిర్మాణం బలహీనపడుతుంది. ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలికి అర్థం లేకుండా పోతుంది. అధికారం ఒకచోట, బాధ్యతలు మరోచోట ఉండటం సహేతుకం కాదు. ఈ ప్రతిపాదిత బిల్లు సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేలా కనిపిస్తుంది. దానిని ‘బేఖాతర్‌’ చేస్తుంది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే అది ప్రమాదకరమైన దుష్ట సంప్రదాయానికి దారితీస్తుంది. ఇతర రాష్ట్రాల పాలనలో జోక్యం మరింతగా పెరిగిపోతుంది. క్రమంగా అధికార కేంద్రీకరణ జరిగి నియంతృత్వానికి దారితీస్తుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులలో కోతలు పెడుతోంది. అన్ని అర్హతలు ఉన్నా బ్యాంకుల నుండి, ఇతర సంస్థలనుండి రుణాలు పొందకుండా ఆంక్షలు విధిస్తోంది. మోడీ గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉండగా గవర్నర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. పరిపాలనా విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏమిటంటూ ఘాటుగా ప్రశ్నించాడు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు తగ్గినా, సకాలంలో నిధులు విడుదల కాకున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వ్యక్తే మళ్లీ అదేబాటలో నడుస్తున్నాడు. కేవలం ఈ బిల్లు విషయంలోనే కాకుండా భారతదేశాన్ని పాలించటంలో మోడీ మన రాజ్యాంగ ప్రవేశిక (ప్రియాబుల్‌)ను అర్థం చేసుకోవాలనీ, మన దేశ ప్రజా స్వామ్య సూత్రాలను గౌరవించి పాటించాలని, పౌరులు, ప్రతిపక్షాల నాయకులు కూడా కోరుతున్నారు. మన దేశ సమైక్యతను, సమగ్ర తను కాపాడటానికి సహకార సమాఖ్యా నిర్మాణమే ఉత్తమమైనది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో పౌరులు, ప్రజాస్వామిక సంస్థలు, మీడియా అందరు ఐక్యంగా నిలబడాలి. పూర్తి పరిరక్షణకు చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది. ప్రజల చైతన్యం, జాగరూ కతపైనే ప్రజాస్వామ్య సౌధం నిలబడుతుంది.

డాక్టర్‌ కె.రామ్‌కిషోర్‌

సెల్‌: 9849328496 

Spread the love