ఫ్లాప్‌ షో..!

– మోడీ అన్నీ తానై ప్రచారం చేసినా ఫలితం శూన్యం
మోడీ గారడీ ఏ మాత్రం పని చేయలేదు. మోడీ విశేష జనాదరణ కలిగిన నాయకుడని, బీజేపీ విజయం ఆయన పైనే ఆధారపడి ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే ఆయన పైనే ఆధారపడడం పెద్ద తప్పిదమని కర్నాటక ఫలితాలు నిరూపించాయి. యడియూరప్ప వంటి ప్రజాబాహుళ్యం కలిగిన నాయకుడిని పక్కనపెట్టి, బజరంగబలి పేరిట ఓట్లు కొల్లగొట్టాలని బీజేపి కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అయితే ఇది యాధృచ్చికంగా జరిగినదేమీ కాదు. రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉండడం ఆధిష్టానానికి సుతరామూ ఇష్టం లేదు. మోడీని మాత్రమే ముందుకు తేవాలని ఆ పార్టీ కోరుకుంది. అయితే ఈ ఎత్తుగడ కర్నాటకలో బెడిసికొట్టింది. స్థానిక నేతలను విస్మరించి, అంతా తానై మోడీ జరిపిన ఎన్నికల ప్రచారం బీజేపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా వికటించింది.
బెంగళూరు : ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కుపెట్టిన బాణాలు గురి తప్పాయి. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన తర్వాత పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిందంటూ కార్పొరేట్‌ మీడియా ఊదరగొట్టింది. రాష్ట్రంలో పట్టు కోల్పోతున్న బీజేపీకి కాంగ్రెస్‌ హామీ ఊపిరి పోసిందంటూ వ్యాఖ్యలు చేసింది. మరో వారంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా మోడీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని పదేపదే ప్రస్తావిస్తూ హిందూత్వ కార్డును బయటికి తీశారు. జాతీయ మీడియాలో ఈ విషయానికి విశేష ప్రాధాన్యత లభించింది. అయితే పోలింగ్‌ రోజున ప్రజలు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని ఫలితాలు రుజువు చేశాయి. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ అందిస్తూ కన్నడిగులు విలక్షణ తీర్పు ఇచ్చారు.
చేతులు కాలాక…
పైగా బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం పలు సందర్భాలలో హిందూత్వ విధానాలను అవలంబిం చడం ప్రజలకు ఆగ్రహం
కలిగించింది. పాఠశాలలకు వెళ్లే ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించకుండా అడ్డుకోవడం, హలాల్‌పై నిషేధం విధించడం, 18వ శతాబ్దిలో మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌ ఒక్కలిగుల చేతిలో హత్యకు గురయ్యారంటూ కల్పిత కథను ప్రచారం చేయడం వంటి చర్యలు బీజేపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. హిందూత్వ కార్డును ప్రయోగించడం వల్ల బీజేపీకి నష్టం జరగవచ్చునని ఎన్నికలకు కొద్ది వారాల ముందే బొమ్మై గ్రహించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మరోవైపు ముస్లిం ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్‌ వైపు సంఘటితమయ్యారు. మైనారిటీలు గతంలో కంటే ఇప్పుడు పది శాతం ఎక్కువగా కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని సర్వేలు తేల్చేశాయి.ఏదేమైనా ఎన్నికల ఫలితాలు బీజేపీ హిందూత్వ వాదనను వెనక్కి నెట్టాయి. హిజాబ్‌పై నిషేధం విధించడానికి ప్రధాన కారకుడైన మంత్రి బీసీ నగేష్‌ ఓడిపోయారు. సుఫీల ప్రార్థనా మందిరంపై వివాదాన్ని సృష్టించిన బీజేపీ నాయకుడు సీటీ రవికి కూడా పరాజయం తప్పలేదు. హలాల్‌పై నిషేధం విధించడాన్ని ఆయన సమర్ధించారు కూడా. హిందువుల ప్రాబల్యం అధికంగా ఉండే కొడగూ ప్రాంతంలోని రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్న హిందూ ఓటర్లను హిందూత్వ నినాదం ఏ మాత్రం ఆకర్షించలేకపోయింది.
స్థానిక నాయకత్వాన్ని విస్మరించి…
మరో ముఖ్యమైన విషయమేమంటే ప్రతి దానికీ అధిష్టానం పైనే ఆధారపడడం కూడా బీజేపీ కొంప ముంచింది. ప్రచారం చివరి దశలో కాంగ్రెస్‌ పార్టీ ‘నందిని’ పాల అంశాన్ని తెర పైకి తెచ్చింది. కర్నాటక పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ అయిన నందినిని బలహీనపరచి, గుజరాత్‌ కు చెందిన అమూల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న బీజేపీ ప్రభుత్వ ప్రయత్నం పాత మైసూర్‌ ప్రాంతంలో కొంత ప్రభావం చూపింది. ఆర్థికపరంగా ఎదు రైన సవాళ్లు, పెరగని వేతనాలు, ద్రవ్యోల్బణం వంటివి కర్నాటక ఫలితంపై ప్రభావం చూపాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఎలా సమాయత్తమవుతుందో వేచి చూడాల్సిందే.
అందరిలోనూ అసంతృప్తే
అయితే ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. మత జాతీయతావాదం మాదిరిగానే హిందూత్వ కూడా భావోద్వేగాలపై ఆధారపడిన అంశం. అనేక హింసాత్మక నేరాలకు పాల్పడిన బజరంగ్‌దళ్‌ను బజరంగ్‌బలితో పోల్చడం ఓటర్లకు ఏ మాత్రం రుచించలేదు. వాస్తవానికి ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసిన విషయం రాష్ట్ర ఆర్థిక దుస్థితి. నిరుద్యోగ సమస్య కారణంగా పట్టణ ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు సంక్షేమ ఫలాలు అందకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం ప్రభావంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ మద్దతుదారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంతో కులాల ఆధారంగా ఓట్లు వేసే పద్ధతికి స్వస్తి చెప్పారు.

Spread the love