– బీజేపీ కొంపముంచిన హిజాబ్, హలాల్
– మైనారిటీ వ్యతిరేక చట్టాలపై వెల్లువెత్తిన ఆగ్రహం
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్, హలాల్ వివాదాలు బీజేపీ కొంపముంచాయి. కమలదళంపై ఆగ్రహంతో ఊగిపోయిన మైనారిటీలు కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచారు. పాత మైసూరు ప్రాంతంలో ముస్లింల జనాభా 11 శాతం వరకూ ఉంటుంది. అయితే 2008 తర్వాత అక్కడి నుండి జనతాదళ్ (ఎస్) తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నిక కాలేకపోవడం ఇదే మొదటిసారి. పాత మైసూరులో జేడీ (ఎస్)కు బలమైన కేడర్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ తరహా ఫలితం రావడాన్ని పరిశీలిస్తే ముస్లింలు ఈసారి కాంగ్రెస్‌కు అండగా నిలిచారని అర్థమవుతోంది. పాత మైసూరులో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి ఒక్కలిగులు, ముస్లింల ఓట్ల పైనే జేడీ (ఎస్) ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే హిజాబ్, హలాల్ విషయాలపై ఆ పార్టీ బాహాటంగానే గళం విప్పింది. అయినప్పటికీ జేడీ (ఎస్)కు ఒరిగిందేమీ లేదు.
జేడీ (ఎస్)పై అనుమానంతోనే…
పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగుల ఓట్లతో పాటు ముస్లింల ఓట్లు కూడా ఈసారి కాంగ్రెస్‌కే పడ్డాయని రాజకీయ విశ్లేషకుడు ఎ.నారాయణ తెలిపారు. ముస్లిం ఓట్ల కోసం జేడీ (ఎస్) హిజాబ్‌ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీ చివరికి బీజేపీ పంచన చేరుతుందేమోనన్న అను మానంతో మైనారిటీలు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారని ఆయన వివరించారు. ఫలితాలు కూడా ఈ విషయాన్నే నిరూపిం చాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 15 మంది ముస్లిం అభ్యర్థులను బరిలో దింపగా వారిలో 9 మంది విజయం సాధించారు. జెడీ (ఎస్) 22 మంది మైనారిటీలను పోటీకి నిలిపినా ఒక్కరూ గెలవలేకపోయారు. 2018 ఎన్నికలలో ఐదుగురు ముస్లింలు కాంగ్రెస్ తరఫున, ఇద్దరు జేడీ (ఎస్) తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 224 అసెం బ్లీ స్థానాలలోనూ 65 స్థానాలలో ముస్లిం ఓటర్లు చెప్పుకో దగిన సంఖ్యలో ఉన్నారు. వాటిలో సగం సీట్లను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. రాష్ట్ర జనాభాలో 13 శాతం మంది ముస్లిం లు ఉన్నారని 2011 జనాభా లెక్కలను బట్టి తెలు స్తోంది.
బొమ్మై ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 15 మంది ముస్లిం అభ్యర్థులలో కేవలం ముగ్గురు మాత్రమే కోస్తా కర్నాటక ప్రాంతానికి చెందిన వారు. ఆ ప్రాంతంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పలు చర్యలు చేపట్టడం వారి ఆగ్రహానికి కారణమైంది. గత సంవత్సరం ప్రీ-యూనివర్సిటీ కళాశాలలలో హిజాబ్ ధారణను నిషేధించింది. దీంతో ఉడిపి వంటి కోస్తా జిల్లాలలో నిరసనలు మిన్నంటాయి. ముస్లింలను బహిష్కరించా లంటూ పిలుపునిచ్చిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ తుముకూరు జిల్లా తిప్‌తూర్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. మత మార్పిడులను, పశువుల రవాణాను నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు కూడా మైనారిటీల వ్యతిరేకతకు కారణమయ్యాయి. హలాల్ మాంసంపై నిషేధం విధించాలని కొందరు బీజేపీ నాయకులు పిలుపునివ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇతర వెనుకబడిన తరగతుల కింద ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్లను రద్దు చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ పతనానికి కారణమైంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నిర్ణయాన్ని అమలు చేయబోనని ప్రకటించింది. అటు కాంగ్రెస్ కూడా కోటాను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చి ముస్లింల అభిమానాన్ని చూరగొన్నది.
బజరంగ్‌దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అయితే బజరంగ్‌దళ్‌పై నిషేధ ప్రకటన కాంగ్రెస్ ఎత్తుగడలో ఓ భాగమే. హిందువుల ఓట్లు పూర్తిగా బీజేపీ వెనుక సంఘటితం కాలేదని తాము ముందుగానే అంచనా వేశామని, బజరంగ్‌దళ్‌పై తీసుకున్న నిర్ణయం ఓ పాచిక అని, చివరికి అది పారిందని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెన్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పాత మైసూరు ప్రాంతంలో మాదిరిగానే బాంబే కర్నాటక ప్రాంతంలో కూడా కాంగ్రెస్‌కు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. అక్కడ కాంగ్రెస్‌కు 33 సీట్లు రాగా బీజేపీ 16 స్థానాలతో సరిపెట్టుకుంది.